logo

తగ్గిన ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేగం

మెట్రో రెండో దశలో చేట్పేట్, కీల్పాక్‌ మెట్రో స్టేషన్ల మధ్య భూగర్భంలో జరుగుతున్న పనులు చేట్పేట్ చెరువు కింద సబర్బన్‌ స్టేషను ప్రాంతానికి చేరుకున్నాయి.

Published : 23 Apr 2024 01:09 IST

భూగర్భ మెట్రో పనులతో ప్రభావం

చేట్పేట్ చెరువు ప్రాంతంలో జరుగుతున్న పనులు

న్యూస్‌టుడే, వడపళని: మెట్రో రెండో దశలో చేట్పేట్, కీల్పాక్‌ మెట్రో స్టేషన్ల మధ్య భూగర్భంలో జరుగుతున్న పనులు చేట్పేట్ చెరువు కింద సబర్బన్‌ స్టేషను ప్రాంతానికి చేరుకున్నాయి. చేట్పేట్ మెట్రో స్టేషను వద్ద మార్చిలో టీబీఎం పనులు చేపట్టింది. సబర్బన్‌ స్టేషను ట్రాక్‌ కింద పనులు జరుగుతుండటంతో స్టేషను ప్రాంతంలో ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేగాన్ని తగ్గించి నడపాలని సీఎంఆర్‌ఎల్‌ చేసిన విజ్ఞప్తి మేరకు రైళ్ల వేగాన్ని తగ్గించారు.

35 నుంచి 40 కి.మీ వరకు

చేట్పేట్ స్టేషనుకు సమీపించే సమయంలో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు 35 నుంచి 40 కి.మీ వేగంతో నడుస్తున్నాయని సీఎంఆర్‌ఎల్‌ ఇంజినీరు ఒకరు పేర్కొన్నారు. ఎగ్మూరులో ఆగే రైళ్లు 80 నుంచి 100 కి.మీ వేగంతో నడుస్తాయని, భూగర్భంలో జరుగుతున్న పనుల కారణంగా అక్కడక్కడా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సూచికలు ఏర్పాటు చేసి తరచూ మట్టి పరీక్షలు జరుపుతామని తెలిపారు. అదేవిధంగా మార్చిలో పెరంబూరులో జరుగుతున్న భూగర్భ పనుల కారణంగా ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేగాన్ని నియంత్రించినట్టు చెప్పారు.

యథావిధిగా బోటు షికారు

రైల్వే మార్గంలో జరుగుతున్న పనులు పూర్తయ్యాక టీబీఎం చేట్పేట్ చెరువుకు రెండు నెలల్లోగానే చేరుకోగలదు. భూగర్భ పనుల కారణంగా చెరువులో బోటు షికారుకు ఎలాంటి సమస్యలు కలగవని సీఎంఆర్‌ఎల్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు. చేట్పేట్ మెట్రో స్టేషను నుంచి టీబీఎం స్టెర్లింగ్‌ రోడ్డు వైపునకు భూగర్భంలో తవ్వుకుంటూ వెళ్తోందని, ఈ పనులు జరగడానికి మూడు నెలలు పడుతుందని గతంలో ప్రాజెక్ట్స్‌ డైరెక్టరు అర్జునన్‌ పేర్కొన్నారు. ఇదే మార్గంలో చేట్పేట్ నుంచి స్టెర్లింగు రోడ్డు వరకు రెండో భూగర్భ పనులు కూవం నదిని దాటాయి.  మాధవరం మిల్క్‌ కాలనీ నుంచి సిరుసేరి సిప్కాట్ వరకు మూడో మార్గంలో 45.8 కిలోమీటర్ల దూరంలో చేట్పేట్ స్టేషను ఆవిర్భవిస్తోంది. ఈ స్టేషను మాధవరం, మూలక్కడై, పెరంబూరు, పురసైవాక్కంతో పాటు నుంగంబాక్కం, థౌజండ్‌లైట్్స, రాయపేట, మైలాపూరు వంటి ప్రధాన ప్రాంతాలకు అనుసంధానం కాగలదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని