logo

దక్షిణాది నుంచే భాజపాకు పతనం ఆరంభం

భారతీయ జనతా పార్టీ (భాజపా)కు దక్షిణాది నుంచే పతనం ప్రారంభమైందని పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి నారాయణస్వామి ధ్వజమెత్తారు.

Published : 23 Apr 2024 01:13 IST

పుదువై మాజీ సీఎం నారాయణస్వామి

భారతీయ జనతా పార్టీ (భాజపా)కు దక్షిణాది నుంచే పతనం ప్రారంభమైందని పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి నారాయణస్వామి ధ్వజమెత్తారు. లోక్‌సభ ఎన్నికల్లో మొదటి విడత పోలింగ్‌ ముగిసిన నేపథ్యంలో ఎన్నికల క్షేత్రస్థాయి పరిస్థితులు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆయన ఓ ఇంటర్వ్యూలో చర్చించారు.

న్యూస్‌టుడే, ఆర్కేనగర్‌


ప్రశ్న: పుదుచ్చేరి నియోజకవర్గంలో విజయమెవరిది?
జవాబు: పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ అభ్యర్థి వైద్యలింగం విజయం ఖాయమైంది. కారణం ప్రధాని మోదీ పుదుచ్చేరికి ఇచ్చిన వాగ్దానాలేవి నేరవేర్చకపోవడమే. ప్రస్తుతం ఎన్డీయే కూటమి పాలనలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న భాజపా అభ్యర్థి నమశ్శివాయం ఏ పథకమూ పుదుచ్చేరికి తీసుకురాలేదు. కొత్త పరిశ్రమలూ రాలేదు. బార్లు మాత్రమే తెరవడంతో సారాయి నదిలా పారుతోంది. ఇక్కడే ఏమి చేయలేని ఆయన పార్లమెంట్‌కు వెళ్లి ఏమి చేయగలరన్న ప్రశ్న ప్రజల్లో నెలకొంది. అందువలన కాంగ్రెస్‌ ఘన విజయం సాధిస్తుంది.


ప్ర: వైద్యలింగం గత ఐదేళ్లలో రాష్ట్రానికేం చేశారు?
జ: రాష్ట్రంలోని పలు సమస్యల గురించి పార్లమెంట్‌లో ప్రశ్నించి మంచి పరిష్కారం పొందారు. రహదారుల పథకాలు, రైల్వే పనులు, కొత్త రైళ్లు ఇలా చాలా ప్రాజెక్టులు రాష్ట్రానికి తీసుకొచ్చారు. ఇప్పటికే ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా, మంత్రిగా పలు పదవుల్లో ప్రజల కోసం పనిచేశారు.


ప్ర: తమిళనాడు ఎన్నికల ఫలితాలు ఎలా ఉండనున్నాయి?
జ: ఇది ఇప్పటికే రాసి ఉంచిన తీర్పు. 39 నియోజకవర్గాలలో ఇండియా కూటమే గెలుస్తుంది. అందుకు కారణం కేంద్రంలోని భాజపా ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి. వరదల కారణంగా అల్లాడిపోయిన తమిళనాడుకు నిధులు ఇవ్వని మోదీ ప్రభుత్వంపై తమిళనాడు ప్రజలు కోపంతో ఉన్నారు. తమిళనాడు నుంచి పన్ను వసూలు చేస్తూ అందులో నుంచి 29 పైసలు మాత్రమే తిరిగి ఇస్తుంది. సామాజిక న్యాయానికి వ్యతిరేకమైనది భాజపా. తమిళనాడుకు రూ.10 వేల కోట్లు ఇచ్చినట్లు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. గవర్నర్‌గా ఒకరిని నియమించి వారిచే ప్రభుత్వ పనులకు అడ్డంకులు కలిగించేలా చేస్తున్నారు. వీటన్నింటిని ప్రజలు మనసులో పెట్టుకొని డీఎంకే కూటమికి ఓటు వేశారు.


ప్ర: భాజపాకు 400 స్థానాలు వస్తాయంటారా?
జ: 2019లో మోదీ అధిక ప్రజాదరణ కలిగినవారుగా ఉన్నప్పుడే భాజపా 303 స్థానాలను దాటలేకపోయింది. నేడు మోదీకి ఆదరణ తగ్గింది. ధరలు పెరిగాయి. వంటగ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిని సరిచేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దేశాన్ని 2047 నాటికి అభివృద్ధి బాటలో నడిపిస్తానని మోదీ అంటున్నారు. కానీ అవన్ని చూడడానికి దేశ ప్రజలు ఉండనవసరం లేదా?. ఈ 10ఏళ్లలో రూ.155 వేల కోట్లు విదేశాల్లో రుణం తీసుకున్నారు. కాంగ్రెస్‌ 60ఏళ్ల పాలనలో రూ.55 వేల కోట్లు మాత్రమే అప్పు తీసుకుంది. ఒక అబద్ధాన్ని 10సార్లు తిప్పితిప్పి చెబితే ప్రజలు నమ్ముతారనే 400 స్థానాలను చేజిక్కించుకుంటామని భాజపా చెప్పుకుంటోంది.


ప్ర: ఇండియా కూటమికి ఎన్ని స్థానాలు రావచ్చు?
జ: నేను సంఖ్య రూపంలో చెప్పడం ఇష్టపడటం లేదు. కానీ ఇండియా కూటమే అధికారంలోకి వస్తుంది. గత మూడు నెలల్లో అందుకుగాను అతిపెద్ద మార్పు ప్రజల్లో మొదలైంది.


ప్ర: ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని ఎవరు?
జ: ఆ సమయంలో కూటమి పార్టీల నేతలు చర్చించి నిర్ణయిస్తారు. కానీ అదే సమయంలో ఒక కాంగ్రెస్‌ నేతగా నాకు రాహుల్‌గాంధీ ప్రధాని అవ్వాలనే ఆశగా ఉంది. భారత్‌లోని ప్రతి కాంగ్రెస్‌ నేతకు ఉన్న కోరిక ఇదే.


ప్ర: గతసారి, ఈ ఎన్నికల్లో ఎందుకు పోటీచేయలేదు?
జ: ఎన్నికల్లో గతసారి నిలబడిన వైద్యలింగానికే ఈసారి కూడా అవకాశం ఇద్దామని అధిష్ఠానం నిర్ణయించింది. అందువలనే నేను పోటీ చేయలేదు. అవకాశం వస్తే ఎన్నికల్లో పోటీ చేస్తా. రాజకీయాల నుంచి, ప్రజలను వదిలేసి ఎప్పుడు వైదొలగబోను.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని