logo

వర్షపాతం పెరిగినా భూమిలో నీరేది!

ఈ ఏడాది రాష్ట్రంలో వర్షపాతం పెరిగినా భూమిలో నీరు మాత్రం అప్పుడే అడుగంటింది. చెన్నైలో రుతుపవనాల వర్షాల తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో భూగర్భ జలాలు 8 అడుగుల మేర తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

Updated : 24 Apr 2024 06:53 IST

మార్చి నెలలో అడుగంటిన భూగర్భ జలాలు
పలు కారణాలతో మట్టిలో ఇంకని నీరు

న్యూస్‌టుడే, విల్లివాక్కం: ఈ ఏడాది రాష్ట్రంలో వర్షపాతం పెరిగినా భూమిలో నీరు మాత్రం అప్పుడే అడుగంటింది. చెన్నైలో రుతుపవనాల వర్షాల తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో భూగర్భ జలాలు 8 అడుగుల మేర తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2022, 2023లో మార్చి నెలతో పోలిస్తే 2024 మార్చిలో భూగర్భ నీటిమట్టం చాలా వరకు తగ్గింది. అయినా చెరువులలో అవసరం మేరకు నీరు నిల్వ ఉన్నందున చెన్నై తాగునీటి అవసరాలు పూర్తి చేయనున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు.

పెరిగిన వినియోగం

రకరకాల కారణాలు, అవసరాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి చెన్నైకి వచ్చి నివసించే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండటంతో తాగునీటి అవసరం కూడా పెరిగింది. రోజుకు 85 లక్షలకు పైగా కుటుంబాలకు 100 కోట్ల లీటర్ల తాగునీరు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం వేసవి కావడంతో 106-107 కోట్ల లీటర్ల వరకు పంపిణీ చేస్తున్నారు. ఇందులో 104 కోట్ల లీటర్లు 5,500 కిలోమీటర్ల దూరం పైపుల ద్వారా, 3 కోట్ల లీటర్లు ట్యాంకరు లారీల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఈ నీటిని 5 చెరువులు, నిర్లవణీకరణ కేంద్రాల నుంచి పొందుతున్నారు. చెరువుల నుంచి 81.80 కోట్ల లీటర్లు, బావుల ద్వారా 2 కోట్ల లీటర్లు, మీంజూర్‌, నెమ్మేలి నిర్లవణీకరణ ప్లాంట్ల ద్వారా 23.3 కోట్ల లీటర్లు సేకరించి ఉపయోగిస్తున్నారు. మహానగరం విస్తరించిన ప్రాంతాల్లో తాగునీటి పథకం పూర్తి స్థాయిలో లేని కారణంగా ఎక్కువగా భూగర్భ జలాలను తోడేస్తున్నారు.

సరిగాలేని నీటి నిల్వ వ్యవస్థ

జలవనరుల ఆక్రమణ, వర్షపునీటి సేకరణలో దూరదృష్టి లేమి, నీటినిల్వ వ్యవస్థను సక్రమంగా పరిరక్షించకపోవడం తదితర కారణాల వలన వర్షపునీరు భూమిలో ఎక్కువగా ఇంకడం లేదు. చెన్నై కార్పొరేషన్‌ పరిధిలో ఇసుక, బంకమట్టి, రాళ్లతో కూడిన మూడంచెలతో కూడిన స్థల విస్తీర్ణం, భూగర్భ జలాలను లెక్కగట్టడానికి 200 వార్డులలో కొలమానాలు ఏర్పాటు చేశారు. ప్రతి నెలా భూగర్భ జలమట్టాన్ని కొలుస్తున్నారు. 2021 కన్నా 2022లో 25 శాతం వర్షపాతం తగ్గింది. గతేడాది జూన్‌లో బాగానే వర్షం కురిసింది. 2022లో నైరుతి రుతుపవనాల వర్షం 44 సెం.మీ, 2023లో 78 సెం.మీ వర్షం పడింది. అదేవిధంగా ఈశాన్య రుతువపనాల వర్షం 2022లో 92 సెం.మీ, 2023లో 18 సెం.మీ వర్షం అదనంగా కురిసింది. గతేడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలను పోలిస్తే ఈ ఏడాది ఈ మూడు నెలలు భూగర్భ జలమట్టం తగ్గింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలకన్నా మార్చిలో మాధవరం జోన్‌లో నీటిమట్టం 8 అడుగుల వరకు తగ్గింది. ఇతర జోన్‌లలో 1-2 అడుగుల వరకు తగ్గింది. కాగా, గతేడాది మార్చి నెలకన్నా ఈ ఏడాది మార్చిలో 2-4 అడుగుల వరకు తగ్గుముఖం పట్టింది. 2022 కన్నా గతేడాది వర్షపాతం అధికంగా నమోదైనా భూమిలో నీరు ఆశించిన మేరకు నిలవలేదు. అందువల్ల వచ్చే నెలలో నీటి అవసం పెరుగుతందని జలమండలి అధికారులు తెలిపారు. అదే సమయంలో వర్షపునీరు భూమి లోపలికి ఇంకే విధంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి పరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని