logo

గుకేశ్‌కు రూ.75 లక్షల ప్రోత్సాహక నగదు

రాష్ట్రానికి చెందిన భారత గ్రాండ్‌మాస్టర్‌ గుకేశ్‌కు రూ.75 లక్షల ప్రోత్సాహక నగదును ముఖ్యమంత్రి అందించారు.

Published : 29 Apr 2024 00:16 IST

గుకేశ్‌కు బ్యాంకు చెక్‌ అందిస్తున్న ముఖ్యమంత్రి

చెన్నై, న్యూస్‌టుడే: రాష్ట్రానికి చెందిన భారత గ్రాండ్‌మాస్టర్‌ గుకేశ్‌కు రూ.75 లక్షల ప్రోత్సాహక నగదును ముఖ్యమంత్రి అందించారు. కెనడాలో జరిగిన క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలోని అండర్‌-17 విభాగంలో గుకేశ్‌ ఛాలెంజర్‌గా గెలిచి చరిత్ర సృష్టించాడు. శనివారం నగరానికి చేరుకున్న నేపథ్యంలో ఆదివారం ఆయన్ను తన క్యాంపు కార్యాలయానికి ముఖ్యమంత్రి స్టాలిన్‌ పిలిపించారు. గుకేశ్‌ను అభినందించి ప్రభుత్వం తరఫున రూ.75 లక్షల ప్రోత్సాహక నగదుకు సంబంధించిన బ్యాంకు చెక్‌ను, షీల్డును అందించి శాలువాతో సత్కరించారు. ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలోనూ గెలవాలంటూ శుభాకాంక్షలు తెలిపారు. వెంట మంత్రి ఉదయనిధి, యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధిశాఖ అదనపు ప్రధానకార్యదర్శి అతుల్య మిశ్రా, రాష్ట్ర క్రీడాభివృద్ధి ప్రాధికార సంస్థ మెంబర్‌ సెక్రటరి మేఘనాథ రెడ్డి, జనరల్‌ మేనేజర్లు (పరిపాలన) మణికంఠన్‌, మెర్సి రెజినా, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉన్నారు.

సీఎంకు గేయ రచయిత వైరముత్తు ప్రశంసలు

చెన్నై: సీఎం స్టాలిన్‌ను ప్రముఖ సినీ గేయ రచయిత వైరముత్తు ప్రశంసించారు. ఆయన తన ఎక్స్‌ పేజీలో... ముఖ్యమంత్రిని కలిసేందుకు ఉదయం 10.15 గంటలకు అపాయింట్‌మెంట్‌ తీసుకొని నిమిషం ముందుగా క్యాంపు కార్యాలయానికి చేరుకోగా సరిగ్గా 10.15 గంటలకు ఆయన తనను ఆహ్వానించారని తెలిపారు. సమయ పాలనలో ఆయన అంతర్జాతీయ క్రమశిక్షణను పాటిస్తున్నారని ప్రశంసించారు. 40 ఏళ్లుగా ఆయనతో పరిచయం ఉందని, సంవత్సరాలు పెరిగే కొద్ది ఆయనలో పరిపక్వత కూడా పెరిగిందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని