logo

సోలార్‌ బస్సు భళా..

సోలార్‌ ప్రత్యేకతను దేశం నలుమూలలా చాటి చెప్పేందుకు మధ్యప్రదేశ్‌ ప్రాంతానికి చెందిన ఆచార్య చేతన్‌సింగ్‌ సోలంకి బస్సునే ఇల్లుగా మలిచి ‘ఎనర్జీ స్వరాజ్‌ యాత్ర (2020-30)’ చేపడుతున్నారు.

Published : 26 May 2022 05:36 IST

నగరానికి చేరుకున్న ‘ఎనర్జీ స్వరాజ్‌ యాత్ర’

కొమ్మాది, న్యూస్‌టుడే: సోలార్‌ ప్రత్యేకతను దేశం నలుమూలలా చాటి చెప్పేందుకు మధ్యప్రదేశ్‌ ప్రాంతానికి చెందిన ఆచార్య చేతన్‌సింగ్‌ సోలంకి బస్సునే ఇల్లుగా మలిచి ‘ఎనర్జీ స్వరాజ్‌ యాత్ర (2020-30)’ చేపడుతున్నారు. ముంబాయి ఐఐటీలో ఆచార్యునిగా విధులు నిర్వర్తించిన చేతన్‌ సోలార్‌ పవర్‌ మీద పీహెచ్‌డీ చేసి దాని ప్రాముఖ్యతను దేశం నలుమూలలా చాటాలని ఇందుకు నడుం బిగించారు. ఆ యాత్ర బుధవారం నగరానికి చేరుకుంది. మధురవాడ గాయత్రీ విద్యాపరిషత్‌ ఇంజినీరింగ్‌ కళాశాలను సందర్శించగా సీఎఫ్‌ఎస్‌ఆర్‌ సోషల్‌ బాడీ నిర్వాహకులు యాత్ర ప్రతినిధులకు ఆహ్వానం పలికారు. ఆచార్య సోలంకి మాట్లాడుతూ ప్రతి ఇంట్లో సోలార్‌ విద్యుత్‌ సాయంతో పలు వస్తువులు ఏ విధంగా వాడుకోవచ్చో తెలిపేందుకే ఈ యాత్ర ఉద్దేశమన్నారు. ఈ విషయంలో తనకు మూడుసార్లు గిన్నిస్‌ బుక్‌ రికార్డులో చోటు లభించిందని పేర్కొన్నారు. తనకు బహుమతిగా లభించిన రూ.70లక్షలతో బస్సును కొనుగోలు చేసి, ఇల్లుగా మలిచి వసతులు సమకూర్చుకున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మెచ్చి తనకు భారత సోలార్‌ గాంధీ అని పేరు కూడా పెట్టారన్నారు. ఇప్పటి వరకు దక్షిణ భారతదేశంలో పదిరాష్ట్రాల పర్యటన పూర్తయిందన్నారు. అనంతరం దీనిపై ఇంజినీరింగ్‌ విద్యార్థులకు అవగాహన కల్పించారు. 

* ఈ బస్సుకు 8 సోలార్‌ ప్యానల్స్‌ అమర్చి సాధారణ వాతావరణంలో కూడా విద్యుదుత్పత్తి జరిగేలా రూపకల్పన చేశారు. దాదాపు 230 నుంచి 250 కిలోవాట్‌ల విద్యుత్తు రెండు మూడురోజుల వరకు సరిపడేలా ఈ ప్యానల్స్‌ ఉపయోగపడతాయి. ఈ బస్సులో మాదిరి ప్రజలంతా వారిళ్ల వద్ద సోలార్‌ పలకలను అమర్చుకుంటే 20 శాతం విద్యుత్తు ఆదా చేయవచ్చునని, ఈ విషయంలో తామంతా ఆచరించేందుకు సిద్ధమంటూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. యాత్ర సభ్యులు ప్రశాంత్‌మిశ్రా, ఆంజనేయస్‌రాయ్, సిద్ధార్థ్‌ గవైలతో పాటు చేతన్‌ను గాయత్రీ కళాశాల యాజమాన్యం, సీఎఫ్‌ఎస్‌ఆర్‌ నిర్వాహకులు తదితరులు సత్కరించి సేవలను కొనియాడారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని