logo
Updated : 06 Aug 2022 06:47 IST

పదేళ్లగా భద్రం.. ఇప్పుడేంటీ ‘చిత్రం’!


సీడ్స్‌ పరిశ్రమ

బ్రాండిక్స్‌ అపెరల్‌ సిటీ పరిశ్రమలు ఉత్పత్తులు ప్రారంభించిన పుష్కరకాలంలో ఎన్నడూ జరగని ప్రమాదాలు రెండు నెలల వ్యవధిలో జరగడంపై కంపెనీ ప్రతినిధులతోపాటు కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలో బ్రాండిక్స్‌ అపెరల్‌ సిటీ పరిధిలో 11 దుస్తుల అనుబంధ పరిశ్రమలను 2008 తరువాత ప్రారంభించారు. పరిశ్రమల పేర్లు వేరైనా ఇక్కడ తయారైన దుస్తులు అమెరికా, యూరోప్‌లోని దేశాలకు ఎగుమతి చేస్తారు. ఎగుమతి చేసే దుస్తుల్లో హానికరమైన రసాయన అవశేషాలు ఉన్నా, నాణ్యత లేకపోయినా ఆ దుస్తులను వెనక్కి పంపిస్తారు. గ్రీన్‌ జోన్‌ పరిశ్రమగా పేరున్న సీడ్స్‌లో విషవాయువులు విడుదల అవ్వడంపై సెజ్‌లోని మిగిలిన పరిశ్రమల ప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బ్రాండిక్స్‌ పార్క్‌లోని 11 పరిశ్రమల్లో వినియోగించే చెదల నివారణ మందే సీడ్స్‌లోనూ వినియోగిస్తున్నారు. బ్రాండిక్స్‌ పరిశ్రమల్లో ఎక్కడ చెదల నివారణ మందు వినియోగించాలన్నా ముందుగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేసే కస్టమ్స్‌ అధికారులు ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. వినియోగించే చెదల మందు కూడా బి-షిఫ్ట్‌ విధులు ముగించుకొని ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయంలో రాత్రి 10.30గంటలకు పిచికారి చేస్తారు. సీడ్స్‌ దుర్ఘటనకు చెదల నివారణ మందే కారణమని జూన్‌ 3న జరిగిన ప్రమాదంపై అధ్యయనం చేసిన ఐఐసీటీ, జేసీ కల్పనాకుమారి ఆధ్వర్యంలో నియమించిన కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఇదే నిజమైతే ఇదే మందును వినియోగిస్తున్న మిగిలిన యూనిట్‌లోని ఒక్క మహిళా ఉద్యోగికి ఎటువంటి ఇబ్బంది ఎదురుకాలేదు. ఈనెల 2న జరిగిన ప్రమాదంలోనూ చెదల మందు వల్లే జరిగి ఉంటుందని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అధికారులు అనుకున్నట్లే చెదల నివారణ మందే కారణం అనుకుంటే ఉదయం ఎ-షిఫ్ట్‌ విధులకు వచ్చిన ఉద్యోగులు రాత్రి 7 గంటలవరకు ఏవిధంగా విధులు నిర్వహించారని మరో ప్రశ్న ఎదురవుతోంది. 

క్వాంటం విలీనం తరవాతే... 

బ్రాండిక్స్‌ అపెరల్‌ పార్క్‌లోని క్వాంటం కంపెనీకి ఉండే ఆర్డర్లు తగ్గిపోవడంతో ఆ పరిశ్రమను తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది. దీనిలో పనిచేసే 2 వేల మంది వరకు మహిళా కార్మికులను తొలగించడానికి కంపెనీ యాజమాన్యం చర్యలు ప్రారంభించింది. మహిళల ఉపాధిని దృష్టిలో ఉంచుకుని బ్రాండిక్స్‌ భారతీయ భాగస్వామి దొరస్వామి వీరికి సీడ్స్‌ పరిశ్రమలో ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించారు. సీడ్స్‌లో విలీనం కావడానికి ఏమాత్రం ఇష్టంలేని క్వాంటం కార్మికులు ఆందోళన చేశారు. పరిస్థితిని వివరించి సీడ్స్‌లో పనిచేయడానికి కష్టంగా ఒప్పించారు. అప్పటి నుంచి తమ పరిశ్రమలో ప్రమాదాలు జరగడం ప్రారంభమైందని సీడ్స్‌ యాజమాన్యం అంటోంది. అందుకే విషవాయువు విడుదల వెనుక కుట్ర కోణం దాగి ఉండొచ్చని, దీనిపై విచారణ చేయాలని కంపెనీ యాజమాన్యమే పోలీసులను కోరుతోంది. సీడ్స్‌ కంపెనీ ఆవరణలో ప్రమాదకరమైన వాయువులను గుర్తించే ఆధునిక సాంకేతిక పరికరాలను సైతం ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థను క్షుణ్నంగా పరిశీలించిన పీసీబీ సభ్య కార్యదర్శి విజయ్‌కుమార్‌ సైతం ప్రమాదానికి కారణాలు అంతుచిక్కడం లేదని మాట్లాడారు. 

ఐసీఎంఆర్‌ బృందం పరామర్శ 

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: విషవాయువుతో అస్వస్థతకు గురై ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళా కార్మికులను ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) బృందం శుక్రవారం పరామర్శించింది. చెన్నై నుంచి వచ్చిన డాక్టర్‌ లోకేష్‌ నేతృత్వంలో సభ్యులు బాధితులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. ఇద్దరు మినహా అందరూ డిశ్ఛార్జ్‌ అయినట్లు డీఎంహెచ్‌వో హేమంత్‌ తెలిపారు. కర్మాగారంలో విషవాయువు లీకయిన ప్రాంతాన్ని బృందం పరిశీలించింది. 

కంపెనీ మనుగడకే ప్రమాదం 

సకాలంలో దుస్తులను విదేశాలకు ఎగుమతి చేయకపోతే ఆర్డర్లు రద్దయ్యే ప్రమాదం ఉందని సీడ్స్‌ యాజమాన్యం ఆందోళనలో ఉంది. బ్రాండిక్స్‌ అపెరల్‌ సిటీ పరిధిలోని పరిశ్రమలకు రెండేళ్ల ముందే ఇతర దేశాల నుంచి ఆర్డర్లు వస్తుంటాయి. నెలనెలా లక్ష్యాలను నిర్దేశించి ఎగుమతి చేస్తుంటారు. కొవిడ్‌ కారణంగా రెండేళ్లపాటు పూర్తిగా చితికిపోయిన దుస్తుల తయారీ పరిశ్రమలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. ఈ తరుణంలో సకాలంలో ఎగుమతి చేయకపోతే చైనా, బంగ్లాదేశ్‌లకు ఆర్డర్లు వెళ్లిపోయే ప్రమాదం ఉందని కంపెనీ ప్రతినిధులు భయపడుతున్నారు.

Read latest Visakhapatnam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts