logo

తొలిరోజే సుందరపు నామినేషన్‌

నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజయిన గురువారమే ఎలమంచిలి నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా సుందరపు విజయ్‌కుమార్‌ నామినేషన్‌ దాఖలు చేశారు.

Published : 19 Apr 2024 04:39 IST

ఎన్నికల అధికారి మనోరమకు నామపత్రం అందిస్తున్న విజయ్‌కుమార్‌, చిత్రంలో సీఎం రమేశ్‌, ప్రగడ నాగేశ్వరరావు, చలపతిరావు, తాతయ్యబాబు

ఎలమంచిలి, న్యూస్‌టుడే: నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజయిన గురువారమే ఎలమంచిలి నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా సుందరపు విజయ్‌కుమార్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఎలమంచిలి తహసీల్దార్‌ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు పత్రాలను ఎన్నికల అధికారిణి మనోరమకు అందించారు. రెండు సెట్ల పత్రాలను సమర్పించారు. డమ్మీగా ఆయన సోదరుడు సుందరపు రవికుమార్‌ నామినేషన్‌ వేశారు. అచ్యుతాపురం నుంచి భారీ ఊరేగింపుగా ఎలమంచిలి చేరుకున్న ఆయన తెదేపా నాయకులు పప్పల చలపతిరావు, నియోజకవర్గ ఇన్‌ఛార్జి ప్రగడ నాగేశ్వరరావుతో కార్యాలయానికి చేరుకున్నారు. తరవాత అనకాపల్లి భాజపా ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌, ఆయన సోదరుడు రాజేష్‌, తెదేపా నాయకులు తాతయ్యబాబు, లాలం భవానీ మద్దతుగా తరలివెళ్లారు. వీరందరి సమక్షంలో విజయ్‌కుమార్‌ నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైకాపా అభ్యర్థి ఎమ్మెల్యే రమణమూర్తిరాజుపై భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. గత అయిదేళ్లగా ప్రజలు పడుతున్న కష్టాలు తీరే సమయం ఆసన్నమైందన్నారు. తనను అందరూ అభిమానంతో ఆశీర్వదించడం ఆనందంగా ఉందన్నారు. నామినేషన్‌ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన అభిమానులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. జనసేన నాయకులు బొద్దపు శ్రీను, రమేష్‌నాయుడు, జనపరెడ్డి శ్రీనివాసరావు, రామదాసు, పల్లా సత్యనారాయణ, మోటూరు శ్రీవేణి, కొఠారు సాంబశివరావు, నైదాన రమేష్‌, గొర్లె బాబూరావు, డ్రీమ్స్‌ నాయుడు, పప్ప ఈశ్వరరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆస్తులు రూ. 8.32 కోట్లు.. అప్పులు రూ. 1.89 కోట్లు

ఎలమంచిలి, న్యూస్‌టుడే: కుటుంబ సభ్యులతో కలిపి తనకు రూ. 8.32 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు సుందరపు విజయకుమార్‌ ప్రకటించారు. నామినేషన్‌ సందర్భంగా ఇచ్చిన అఫిడవిట్‌లో తన పేరిట రూ. 1.89 కోట్లు అప్పులున్నాయని పేర్కొన్నారు. చరాస్తి రూ.3.98 కోట్లు, స్థిరాస్తి రూ. 2.40 కోట్లు ఉందని తెలిపారు. విశాఖ జిల్లా మధురవాడలో రుషికొండ వద్ద రెండు ఇళ్లు, అచ్యుతాపురం మండలం చోడిపల్లిలో ఒక ఇల్లు ఉన్నట్లు... వీటి విలువ రూ.2.4 కోట్లు ఉందని వివరించారు. భార్య శైలజ పేరున రూ. 53 లక్షల చరాస్తి, కుమార్తె సుకీర్తి పేరున రూ. 22 లక్షలు, రెండో కుమార్తె నేహా శ్రీలక్ష్మి పేరున రూ.18 లక్షల ఆస్తులున్నాయని వెల్లడించారు. తనపేరున బ్యాంకు డిపాజిట్లు రూ. 3.06 లక్షలు, భార్య పేరున రూ. 12.85 లక్షలు, కుమార్తెల పేరున రూ. 1.58 లక్షల డిపాజిట్లు ఉన్నాయి. చేతిలో నగదు రూ. 4.53 లక్షలు, భార్య వద్ద రూ. 2.37 లక్షలు వేలు ఉందని లెక్కలు చూపారు. రూ.6.85 లక్షల విలువైన 101 గ్రాముల బంగారం, భార్య పేరున రూ. 38 లక్షల విలువైన 567 గ్రాముల బంగారం, పెద్ద కుమార్తె వద్ద రూ.15.75 లక్షల విలువైన 232 గ్రాముల బంగారం, చిన్న కుమార్తె పేరున రూ. 14 లక్షల విలువైన 209 గ్రాముల బంగారం ఉందని పేర్కొన్నారు. తన పేరున కార్లు లేవని, బొలెరో ట్రక్‌ ఉందని, దీని విలువ రూ. 2.61 లక్షలుగా చూపించారు. విజయ్‌కుమార్‌ పేరున మూడు బ్యాంకుల్లో రూ. 1.89 కోట్ల గృహ రుణాలు ఉన్నాయని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని