logo

గంటా వెంట జన సాగరం

భీమిలి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు నామినేషన్‌ కార్యక్రమానికి గురువారం జనం పోటెత్తారు.

Published : 19 Apr 2024 04:42 IST

నామినేషన్‌కు పోటెత్తిన అభిమానులు

మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు

గ్రామీణభీమిలి, తగరపువలస, న్యూస్‌టుడే: భీమిలి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు నామినేషన్‌ కార్యక్రమానికి గురువారం జనం పోటెత్తారు. పెద్ద సంఖ్యలో జనం రావడంతో భీమిలి వీధులు నిండిపోయాయి. ఇటు బీచ్‌రోడ్డు నుంచి వచ్చే ద్విచక్ర వాహనాలు, ఆటోలను; అటు మధురవాడ, ఆనందపురం; మరోవైపు తగరపువలస, పద్మనాభం ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను దాదాపు ఒకట్రెండు కిలోమీటర్లు దూరంగా నిలిపివేశారు. అయినా జనం మండుటెండలో కాలినడకన పార్టీ కార్యాలయానికి చేరుకుని అభిమాన నేతకు జేజేలు పలికారు. మిట్ట మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ర్యాలీ ప్రారంభమైనా కూడా గంటా వాహన శ్రేణి వెంట కార్యకర్తలు సందడి చేస్తూ అడుగులేశారు. ఊహించని రీతిలో వచ్చిన జన ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఎక్కడికక్కడ జనాన్ని ఆపేసినా తెదేపా కార్యకర్తలు నామినేషన్‌ కేంద్రానికి వందమీటర్ల వరకూ చేరుకుని జై గంటా.. జై తెదేపా నినాదాలు చేశారు. కీలక నేతలు వెంట రాగా మధ్యాహ్నం 1.10 నిమిషాలకు గంటా తన నామపత్రాన్ని రిటర్నింగు అధికారి భాస్కరరెడ్డికి సమర్పించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని తెదేపా భీమిలి మండల శాఖ అధ్యక్షుడు డీఏఎన్‌ రాజు సంతకం చేసి ప్రతిపాదించారు. కేవలం అరగంటలోనే నామినేషన్‌ కార్యక్రమాన్ని ముగించుకుని ఆర్డీవో కార్యాలయం నుంచి బయటకొచ్చిన ఆయనకు తెదేపా, దాని మిత్ర పక్షాలైన జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు జై కొట్టారు. భీమిలి నియోజకవర్గం నుంచే కాకుండా అనకాపల్లి, చోడవరం, నగరంలోని పలు ప్రాంతాల నుంచి గంటా అభిమానులు భారీగా భీమిలికి చేరుకున్నారు.

నామినేషన్‌ వేయడానికి భారీ జనసందోహం మధ్య ర్యాలీగా వెళ్తున్న భీమిలి తెదేపా అభ్యర్థి గంటా శ్రీనివాసరావు

తొలిరోజు మందకొడిగా నామపత్రాల దాఖలు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: విశాఖ జిల్లా ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం మొదలైంది. ఈసీ ఆదేశాలకు అనుగుణంగా ఒక లోక్‌సభ స్థానానికి, ఏడు అసెంబ్లీ స్థానాలకు రిటర్నింగ్‌ అధికారులు గురువారం ఉదయం ఎన్నికల నోటిఫికేషన్లు జారీ చేశారు. అనంతరం ఉదయం 11గంటలకు ఆర్‌ఓ కార్యాలయాల్లో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి నామపత్రాల స్వీకరణకు శ్రీకారం చుట్టారు. మధ్యాహ్నం 3గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా కేవలం నాలుగు నియోజకవర్గ పరిధిలో ఏడుగురు నామపత్రాలు దాఖలు చేశారు. విశాఖ తూర్పు, దక్షిణం, పశ్చిమ నియోజకవర్గాలకు తొలిరోజు ఒక్క నామపత్రం కూడా రాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని