logo

జగన్‌ ఏలుబడి.. తలకిందులే బతుకుబండి!!

ఏటా ధరలు పెరుగుతున్నా వాటిని అదుపు చేసేందుకు జగన్‌ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోలేదు. దీంతో ఏం కొనాలో, ఏంతినాలో తెలియక సాధారణ, మధ్యతరగతి కుటంబాలు లబోదిబోమంటున్నాయి.

Updated : 19 Apr 2024 05:44 IST

నింగినంటుతున్న నిత్యావసరాల ధరలు
ప్రతి ఇంటిలో కలవరమే
ఈనాడు, విశాఖపట్నం, న్యూస్‌టుడే, వన్‌టౌన్‌

టా ధరలు పెరుగుతున్నా వాటిని అదుపు చేసేందుకు జగన్‌ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోలేదు. దీంతో ఏం కొనాలో, ఏంతినాలో తెలియక సాధారణ, మధ్యతరగతి కుటంబాలు లబోదిబోమంటున్నాయి. ధరలు పెరిగినంత వేగంగా తమ ఆదాయాలు పెరగలేదని, ఏటా సరకులు ధరలు అమాంతం పెరగడం వల్ల వంటింటి ఖర్చులు రెట్టింపు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారిశ్రామిక నగరమైన విశాఖకు అవసరమైన నిత్యావసరాలన్నీ ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి అవుతాయి. ఇందుకు రవాణా ఖర్చులు తోడై.. ఇతర ప్రాంతాల్లో పోల్చితే విశాఖలో ధరలు మరింత అధికంగా ఉంటున్నాయి. జగన్‌ ఏలుబడిలో నిత్యావసరాల ధరల అదుపునకు ప్రత్యేక చర్యలు చేపట్టలేదు. ఇదే సమయంలో తక్కువ ధరలకు రేషన్‌ డిపోల్లో పంపిణీ చేసిన సందర్భం లేదు. దీంతో సామాన్యుడి బతుకు బండి తలకిందులై నానా అవస్థలు పడుతున్నారు.

కుటుంబంపై రూ. 1.20 లక్షల భారం..

నలుగురు కుటుంబ సభ్యులున్న ఒక ఇంటికి గతంలో రూ.300 ఖర్చు చేస్తే వారానికి సరిపడ కాయగూరలన్నీ వచ్చేవి. ఇప్పుడు రూ.600 ఖర్చు చేసినా సంచి నిండడం లేదు. రెండు రకాలు కొనుగోలు చేస్తేనే రూ.వంద దాటిపోతుంది. కొన్ని రకాలు కొనుగోలు చేయాలంటే కిలోకు రూ.50 వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది.

వైకాపా ప్రభుత్వం రాకముందు నలుగురు సభ్యులున్న ఒక కుటుంబం సరకుల కోసం నెలకు రూ.3 వేలు ఖర్చు చేస్తే... ఇప్పుడు అది రూ.5 వేల నుంచి రూ.6 వేలకు చేరింది. ఒక్కో ఇంటిపై సగటున రూ.2 వేలు పెరిగిందనుకున్నా జగన్‌ అయిదేళ్ల పాలనలో సరకుల రూపంలోనే రూ.1.20 లక్షల భారం పడింది. పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు ఊదరగొడుతున్న జగన్‌ పాలనలో ఇలా అయితే పేదలకు జరిగిన మేలేమిటో! దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజల వంటిళ్లలో మంటలురేగుతున్నాయి.

నియంత్రణ చర్యలేవి?: ధరల నియంత్రణపై పాలకులకు కనీస శ్రద్ధ లేదు.  తెదేపా పాలనలో ప్రతి నెలా జిల్లాస్థాయిలో ధరల నియంత్రణ కమిటీ సమావేశం జేసీ అధ్యక్షతన జరిగేది. నెల రోజుల వ్యవధిలో వివిధ రకాల ధరలను సమీక్షించేవారు. ఏవైనా సరకుల ధరలు పెరిగితే ఇతర ప్రాంతాల నుంచి వాటిని రప్పించి తక్కువ ధరకు రైతు బజార్లలో విక్రయించేవారు.  స్థానికంగా టోకు, చిల్లర వర్తకులతో చర్చించి  నియంత్రణకు చర్యలు చేపట్టేవారు. ఇప్పుడు జేసీ అధ్యక్షతన కమిటీలున్నా సమావేశమవడమే అరుదుగా మారింది. బహిరంగ మార్కెట్‌లో ధరలు పెరిగినా పట్టించుకొనే వారే లేరు.

నాటితో పోలిస్తే..

వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిత్యావసరాల ధరలు సగటున 30 శాతం నుంచి 50 శాతం వరకు పెరిగాయి. బియ్యం, కంది పప్పు, పంచదార, నూనెల ధరలు ఆకాశాన్నంటాయి. అయిదేళ్ల కిందటితో పోలిస్తే ఉప్పులు, పప్పులు ఇతర సరకుల రూపంలో నెలకు రూ.2వేలకుపైగా అదనపు భారం పెరిగిందని మధ్యతరగతి వర్గాలు ఆవేదన చెందుతున్నాయి. సన్న బియ్యం ధర క్రమంగా పెరుగుతోంది. గతంలో రూ.40 ఉండగా ఇప్పుడు అది రూ.55పైగానే ఉంది. అలాగే కంది పప్పు ధర సగటున రూ.వంద వరకు భారమైందంటే ఆశ్చర్యపోనవసరం లేదు. గతంతో పోల్చుకుంటే ఒక కుటుంబం నెలకు కేజీ కంది పప్పు వినియోగిస్తే ఏడాదికి అదనంగా రూ.1200 వరకకూ భారం పడుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని