logo

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

జాతీయ రహదారిపై వెదుళ్లపాలెం సమీపాన శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి వ్యతిరేక మార్గంలో వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందగా,

Published : 28 Apr 2024 04:05 IST

ముగ్గురు దుర్మరణం, మరొకరికి తీవ్రగాయాలు

ప్రమాదంలో నుజ్జయిన కారు

నక్కపల్లి, న్యూస్‌టుడే: జాతీయ రహదారిపై వెదుళ్లపాలెం సమీపాన శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి వ్యతిరేక మార్గంలో వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. నక్కపల్లి సీఐ ఎ.విజయకుమార్‌, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

విశాఖ గోపాలపట్నం దరి బుచ్చిరాజుపాలేనికి చెందిన శరగడం వికాస్‌, అతని తల్లి వెంకటలక్ష్మి (45), అగనంపూడికి చెందిన వికాస్‌ మేనమామ కొడుకు దాడి గగన్‌ (14), స్నేహితుడు సుంకర మధుకర్‌ (23)లతో కలిసి కారులో పాయకరావుపేటలో ఉంటున్న అమ్మమ్మ ఇంటికి, అక్కడి నుంచి కాకినాడ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. విశాఖలో బయలుదేరిన వీరి కారు మధ్యాహ్నం వెదుళ్లపాలెం వద్దకు రాగానే అదుపుతప్పి డివైడర్‌ ఢీకొట్టి, దీన్ని దాటుకుని అవతల మార్గంలోకి వెళ్లింది. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న కంటైనర్‌ లారీని బలంగా ఢీకొట్టింది. వికాస్‌ తీవ్రంగా గాయపడగా, మిగిలిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. ప్రమాదంలో కారు లారీ ఇంజిన్‌ కింద భాగం నుంచి అవతలకు దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన తర్వాత కొద్ది నిమిషాల పాటు కొన ఊపిరితో అల్లాడారని, కారులో  చిక్కుకుపోవడంతో బయటకు తీసే వీల్లేక అందులోనే మరణించినట్లు స్థానికులు వెల్లడించారు. 108కు పలుమార్లు ఫోన్‌ చేసినా అందుబాటులో లేవని, తుదకు హైవే అంబులెన్స్‌ వచ్చి తీవ్రంగా గాయపడిన వికాస్‌ను నక్కపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రాథమిక చికిత్స అనంతరం వికాస్‌ను అనకాపల్లి ఆసుపత్రికి పంపించారు. కారులో చిక్కుకున్న మృతదేహాలను సీఐ ఎ.విజయకుమార్‌, సిబ్బంది, స్థానికుల సాయంతో బయటకు తీసి శవ పరీక్ష నిమిత్తం నక్కపల్లి ఆసుపత్రికి తరలించారు.

వెంకటలక్ష్మి, గగన్‌, మధుకర్‌ (పాత చిత్రాలు)

ప్రమాదంపై అనిత ఆరా.. ఇదే సమయంలో తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత పాయకరావుపేట వెళుతూ సంఘటనా స్థలం వద్దకు వచ్చి ప్రమాదం జరిగిన తీరుని సీఐ విజయకుమార్‌తో మాట్లాడి తెలుసుకున్నారు. మృతులు వెంకటలక్ష్మి, గగన్‌ వైకాపా జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌కు బంధువులు కావడంతో ఆయన నక్కపల్లి ప్రభుత్వాసుపత్రికిచేరుకుని మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు. వికాస్‌, మధుకర్‌ స్నేహితులు, బీటెక్‌ పూర్తి చేశారు. త్వరలోనే పై చదువుల నిమిత్తం అమెరికా, జర్మనీ వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా ప్రమాదంలో మూడు కుటుంబాలకు చెందిన ముగ్గురు దుర్మరణం చెందడంతో వారి బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రమాదానికి గురైన కారుకు ఎయిర్‌ బ్యాగులు లేకపోవడం ప్రాణనష్టం తీవ్రత పెరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని