logo

భక్తులను మరిచి.. నేతలకు ఎర్రతివాచీ

వైకాపా ప్రభుత్వ హయాంలో దేవాలయాల నిర్వహణ అగమ్యగోచరంగా మారింది. ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేసింది. కొన్నింటిని రాజకీయాలకు నెలవుగా మార్చేసింది. ట్రస్టు బోర్డుల నియామకాలను ఇష్టానుసారంగా చేపట్టారు.

Updated : 29 Apr 2024 06:36 IST

ఆలయాల్లోనూ వైకాపా ప్రభుత్వ రాజకీయాలు
ఇష్టానుసారంగా ట్రస్టు బోర్డుల నియామకం 

వైకాపా ప్రభుత్వ హయాంలో దేవాలయాల నిర్వహణ అగమ్యగోచరంగా మారింది. ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేసింది. కొన్నింటిని రాజకీయాలకు నెలవుగా మార్చేసింది. ట్రస్టు బోర్డుల నియామకాలను ఇష్టానుసారంగా చేపట్టారు.

ప్రవేశ రుసుముల ధరలు పెంచేసి.. కొన్ని దర్శనాలను రద్దు చేసి ఆలయాల ప్రాశస్త్యాన్ని, భక్తుల విశ్వాసాన్ని ప్రభుత్వం దెబ్బతీసింది. ప్రత్యేక ఉత్సవాల సమయంలో వైకాపా నేతలకు పెద్ద పీట వేసి సామాన్య భక్తులకు నరకం చూపించారు. హుండీలకుభద్రతే కరవయింది. వందల సంఖ్యలో హుండీలు చోరీకి గురయ్యాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా విశాఖ దేవాదాయశాఖ నవ్వులపాలైంది. కీలక అధికారుల మధ్య వివాదాలు రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. దాదాపు 20 ఆలయాలకు ట్రస్టు బోర్డులను ఎన్నికల ప్రకటనకు ముందు ఏర్పాటు చేయడం గమనార్హం. ఇదంతా రాజకీయ లబ్ధికోసమేనన్నది అందరికీ తెలిసిన సత్యమే.

 వైకాపా ప్రభుత్వం వచ్చాక... ఒక్కసారిగా సింహాద్రి అప్పన్న దేవస్థానం అనువంశిక ధర్మకర్త అశోక్‌గజపతిరాజు స్థానంలోకి సంచైత గజపతిరాజును ధర్మకర్తల మండలి ఛైర్మన్‌గా తీసుకోవడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఆమె చేపట్టిన కొన్ని పనులు వివాదాస్పదమయ్యాయి. అదే సంవత్సరం గిరిప్రదక్షిణ నిర్వహణలో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. కొండ చుట్టూ ఉన్న రహదారులను అధ్వానంగా ఉన్నా పట్టించుకున్న నాథుడు లేడు. భక్తులు తీవ్ర అవస్థలుపడ్డారు. గత ఏడాది చందనోత్సవం ఎన్నడూ లేని రీతిలో భక్తులకు చుక్కలు చూపించింది. అధికారుల సమన్వయలోపం, వైకాపా నేతల దర్శనాలకే ప్రాధాన్యం ఇవ్వడంతో సామాన్యులు ఇక్కట్లపాలయ్యారు. కొన్ని గంటల పాటు వరసలోనే ఉండిపోవడంతో చిన్నారులు, వృద్ధులతో వచ్చిన వారు మధ్యలోనే వెనుతిరిగారంటే  పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆలయ ట్రస్టు బోర్డు సభ్యులతో పాటు మరికొందర్ని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడం వంటివి వివాదాస్పదమయ్యాయి.

ట్రస్టు బోర్డులోని కొందరు సభ్యులు ఆలయ అభివృద్ధికి కాకుండా తమ సొంత వ్యవహారాలు చక్కబెట్టుకునే రీతిలో వ్యవహరిస్తుండటంపై పలు ఆరోపణలు వస్తున్నాయి.

ఒత్తిళ్లు: స్వతంత్రంగా ఉన్న కొన్ని ఆలయాలను దేవాదాయశాఖ పరిధిలోకి తీసుకొస్తామని ఒత్తిళ్లు తీసుకొచ్చి మరీ భక్తులను వైకాపా నేతలు భయపెట్టారు. మాధవధారలోని వైభవ వేంకటేశ్వరస్వామి ఆలయం విషయంలో ఆ విధంగానే వ్యూహాలు పన్నారు. ఓ స్వామీజీకి అప్పగించేలా ప్రణాళిక చేశారు. దీన్ని స్థానిక భక్తులు వ్యతిరేకించారు. విలువైన ఆస్తులున్న ప్రేమ సమాజంపైనా కన్నేశారనే విషయం గతంలో కలకలం రేపింది.

నిర్వహణలో దారుణాలు: వైకాపా హయాంలో ప్రముఖ దేవాలయాల నిర్వహణ తీసికట్టుగా మారింది. సింహాచలం క్షేత్రంలో మెట్లదారి బాగుచేయండి మహాప్రభో అని మొత్తుకున్నా...ఈ ప్రభుత్వం ఐదేళ్లు గడిపేసింది. చివరికి ప్రసాదం పథకంలో పనులు ఆరంభించారు.  కనకమహాలక్ష్మి ఆలయం, పోలమాంబ, ఎర్నిమాంబ, ఎరుకమాంబ వంటి ఆలయాల నిర్వహణతీరు కూడా వివాదాస్పదమయింది. కొన్ని చోట్ల ప్రవేశ రుసుం పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నా ఆలయాల నిర్వహణ మాత్రం మరిచారు.

దర్శనాలు, ప్రత్యేక దర్శనాలు పేరుతో సొమ్ములు వసూలు చేస్తున్నా భక్తులకు నాణ్యమైన సేవలందడం లేదు. సింహాచలం దేవాలయంలో దాతలు ఇచ్చిన డబ్బులతో చేపట్టిన పనుల్లో అనేక ఆరోపణలు వచ్చాయి. ఎర్నిమాంబ, కనకమహాలక్ష్మి ఆలయం వంటి చోట్లా ఇదే పరిస్థితి ఉంది.

బరువు తగ్గిన అమ్మవారి వడ్డాణం..

సింహాచలం ఆలయ ప్రధాన మండపంలోని ఆండాల్‌ అమ్మవారి వడ్డాణం విరిగిపోవడంతో పాటు కొంత బంగారం తగ్గడం అప్పట్లో దేవస్థానం వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆలయ ఏఈవో ఆధ్వర్యంలో భాండాగారంలో భద్రపరిస్తే ఎలా బరువు తగ్గిందనేదానిపై విస్మయం వ్యక్తమైంది. ఆ తర్వాత ఇదే ఆలయంలో దుస్తులు ధరించిన కొందరు డబ్బులు లెక్కింపు వద్దకు వచ్చి హడావుడి చేశారు. హుండీ లెక్కింపులో ఓ ఏఈవో చొక్కా వేసుకొని దేవాదాయశాఖకు చెందిన పర్యవేక్షణ అధికారితో ఫొటోలు దిగడం నోటీసులు వరకు వెళ్లింది.

హుండీలకు భద్రతలేదు..

జిల్లాలోని పలు దేవాలయాల్లో హుండీలు అపహరణకు గురయ్యాయి. వాటి లెక్కింపు తీరు కూడా తరచూ వివాదాస్పదమవడం  భక్తులను తీవ్రంగా కలచివేసింది. రెండేళ్ల కిందట ఎర్నిమాంబ ఆలయ హుండీ సొమ్ములు పక్కదారి పట్టాయన్న ఆరోపణలు బలంగా వచ్చాయి. భక్తులు సమర్పించిన కానుకలను హుండీల నుంచి తీసినట్లు ప్రచారం జరిగింది. అందుకు కారణమైన ఉద్యోగులను జిల్లా అధికారులు కాపాడుకుంటూ వస్తున్నారనే విమర్శలు వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని