logo

సర్వం.. ప్రలోభాల పర్వం

 ‘డబ్బు పంపిణీ చేయాలంటే కూపన్లు.. మద్యం సరఫరా చేయడానికి టోకెన్లు.. చివరికి ప్రచారంలో వెంట తిప్పుకోవడానికి పెట్రోలు కూపన్లు’ ఇలా ఓటర్లకు ఎర వేసేందుకు వైకాపా నేతలు పలువురు కూపన్ల రాజకీయానికి తెర తీశారు.

Published : 29 Apr 2024 04:09 IST

 మద్యం.. నగదు... చీరలు.. కుట్టు మిషన్ల పంపిణీ
 ఎన్నికల వేళ వైకాపా నేతల కుయుక్తులు

 ‘డబ్బు పంపిణీ చేయాలంటే కూపన్లు.. మద్యం సరఫరా చేయడానికి టోకెన్లు.. చివరికి ప్రచారంలో వెంట తిప్పుకోవడానికి పెట్రోలు కూపన్లు’ ఇలా ఓటర్లకు ఎర వేసేందుకు వైకాపా నేతలు పలువురు కూపన్ల రాజకీయానికి తెర తీశారు.

ఈనాడు, విశాఖపట్నం: కూపన్ల సంస్కృతి తొలుత తూర్పు నియోజకవర్గంలో మొదలైంది. వైకాపా అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ ఫొటోతో కూపన్లు వార్డుల వారీగా పంపిణీ చేశారు. ఇంకేముంది.. ఆయన ప్రసంగం వినడం, భోజనం చేయడం ఆ తర్వాత కూపన్లు చేతికిస్తే రూ.వెయ్యి నగదు ఇవ్వడం పరిపాటిగా మారిందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే నియోజకవర్గంలో మందుబాబులకు టోకెన్లు సైతం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ కూపన్‌ చూపిస్తే ఆ నియోజకవర్గ పరిధిలోని ఏ బార్‌లోనైనా సరే క్వార్టర్‌ సీసా చేతిలో పెడతారన్నమాట. ఇదే పంథాలో నామినేషన్‌ ర్యాలీ సమయంలో పాల్గొన్న యువతకు పెట్రోలు కూపన్లు ఇచ్చినట్లు పశ్చిమ నియోజకవర్గంలో అధికారులు గుర్తించారు.

స్వీట్లతో మొదలై చీరలతో కదిలి: వైకాపా అభ్యర్థులు ఎన్నికల కోడ్‌ కూయగానే తాయిలాల గాలాలు మొదలు పెట్టారు. తొలుత స్వీటు బాక్సులపై జగన్‌, అభ్యర్థి ఫొటోలు ముద్రించి ఇంటింటికీ పంపిణీ చేశారు. ఆ వెంటనే సిద్ధం కవర్లలో చీరలు పెట్టి మహిళా ఓటర్లకు పంపిణీ చేశారు. ఉత్తర నియోజకవర్గంలో ఆటో డ్రైవర్లు, క్రీడాకారులు, రజకులు, పద్మశాలీలు ఇలా సామాజిక వర్గాల వారీగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఒక జత దుస్తులు, చీరతో కూడిన కవరు అందించారు. పశ్చిమం, తూర్పులో పలుచోట్ల రైస్‌ కుక్కర్లు పంపిణీ చేశారు. దక్షిణంలో ఏకంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. సదరు వైకాపా నేత తన కళాశాల వేదికగా మద్యం సీసాలు అందించడం తీవ్ర విమర్శలు దారి తీసింది.

ఇంతేనా: ప్రచారానికి సైతం ఒక్కొక్కరికి రూ.300 ఇచ్చి అద్దె జనాలను తెచ్చుకుంటున్నారు. తూర్పు వైకాపా అభ్యర్థిగా ఎంవీవీ సత్యనారాయణను ప్రకటించిన తొలినాళ్లలో ఒక్కొక్కరికి రూ.వెయ్యి ఇచ్చుకుంటూ వచ్చారని సమాచారం. ఆయన నామినేషన్‌ సమయంలో రూ.300 ఇవ్వగా, ‘ఇప్పటి వరకు రూ.వెయ్యి ఇచ్చి.. ఇప్పుడు తక్కువ ఇస్తున్నారేంటి’ అంటూ అద్దె కార్యకర్తలు ఎదురుతిరిగిన పరిస్థితి కొన్ని చోట్ల కనిపించింది.

 కోడ్‌ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఈ నెల 27వ తేదీ జిల్లా వ్యాప్తంగా  రూ.13.22 కోట్ల విలువైన మద్యం, డబ్బు, కానుకలు ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు కలెక్టర్‌ మల్లికార్జున తెలిపారు.

నోట్ల కట్టలు మాట్లాడుతున్నాయ్‌: ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ ముగియడంతో విందు, మందు రాజకీయాలు పక్కన పెట్టారు. ప్రస్తుతం నోట్ల కట్టలు రాజ్యమేలుతున్నాయి. ఇప్పటికే యూసీడీ ఆర్పీలు, వాలంటీర్లకు వైకాపా అభ్యర్థులు నోట్ల కట్టలు పంపిణీ చేశారు. డ్వాక్రా మహిళలకు, ఇంటింటికీ డబ్బులు పంపిణీ చేసే బాధ్యత వారికే అప్పగించినట్లు సమాచారం. తాజాగా దక్షిణ నియోజకవర్గం వైకాపా అభ్యర్థి వాసుపల్లి గణేష్‌కుమార్‌కు చెందిన మర్రిపాలెంలోని రామబాణం కళాశాలలో రూ.67లక్షల నగదు పట్టుబడింది. ఈ కళాశాల నుంచి ఓటర్లకు డబ్బు వెదజల్లుతూ ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు ఫిర్యాదు అందడంతో అధికారులు కదిలారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని