logo

ఎర్రమట్టి దిబ్బలకు గండం

విశాఖ నగరం, సమీప ప్రాంతాల్లోని భూములపై కన్నేసిన అధికార వైకాపా నేతల కన్ను భీమిలికి సమీపంలోని భౌగోళిక వారసత్వ ప్రదేశం (జియోహెరిటేజ్‌ సైట్‌)గా గుర్తించిన ఎర్రమట్టిదిబ్బలపై పడింది.

Updated : 30 Apr 2024 06:12 IST

భౌగోళిక వారసత్వ ప్రదేశంపై వైకాపా నేతల కన్ను
అటు వైపు ఎవరూ వెళ్లకుండా కంచె
పట్టించుకోని యంత్రాంగం
సమీప భూముల్లో రోడ్లు, కాలువల నిర్మాణం
ఈనాడు, విశాఖపట్నం

ఎర్రమట్టి దిబ్బలకు సమీపంలో  సిమెంటు కాలువల నిర్మాణం

విశాఖ నగరం, సమీప ప్రాంతాల్లోని భూములపై కన్నేసిన అధికార వైకాపా నేతల కన్ను భీమిలికి సమీపంలోని భౌగోళిక వారసత్వ ప్రదేశం (జియోహెరిటేజ్‌ సైట్‌)గా గుర్తించిన ఎర్రమట్టి దిబ్బలపై పడింది. ఎక్కడెక్కడి నుంచో తిలకించేందుకు ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు. అయితే... అసలు అటువైపే ఎవరూ వెళ్లకుండా చుట్టూ కంచె నిర్మించడం కలకలం రేపుతోంది. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం విస్తుగొలుపుతుంది. పర్యాటకులు  జేవీ అగ్రహారం గ్రామం నుంచి మట్టి దారిలో వెళ్లి అక్కడున్న ‘వీక్షణ స్తంభం’ పైనుంచి ఎర్రమట్టి దిబ్బలను తిలకించేవారు. ప్రస్తుతం అక్కడి వరకు వెళ్లడానికి వీలు లేకుండా మధ్యలోనే కొందరు కంచె ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఆ దిబ్బలకు సమీపంలోనే పలు చోట్ల స్థలాలను స్వాధీనం చేసుకున్నట్లు హద్దులు ఏర్పాటు చేశారు. ఈ దిబ్బల్లోకి వెళ్లాలంటే ఈ మార్గం తప్ప మరొకటి లేదు. వీటికి ఆనుకొని భీమునిపట్నం ఎయిడెడ్‌ కోఆపరేటివ్‌ సొసైటీకు స్థలాలున్నాయి. ఇక్కడ నిర్మాణాలు చేపట్టడం వివాదాస్పదమవడం, కోర్టు కేసుల వల్ల ఇప్పటి వరకు ఎటువంటి పనులు చేపట్టలేదు. కానీ, వైకాపా ప్రభుత్వం వచ్చాకే కదలిక వచ్చింది. కొందరు అధికార పార్టీ పెద్దలు అందులో స్థలాలు దక్కించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతాన్ని జనావాసాలకు వీలుగా, విలువైన ప్రాంతంగా మార్చే వ్యూహానికి తెరతీశారన్న విమర్శలొస్తున్నాయి.  

ఉనికికే ప్రమాదం: ‘ఎర్రమట్టి దిబ్బలు’ భౌగోళిక చరిత్ర ఆనవాళ్లకు నిదర్శనం. దక్షిణాసియాలో ఇటువంటి ప్రాంతాలు మూడుంటే...అందులో ఇదొకటి. అందుకే జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా 2014లో భౌగోళిక వారసత్వ ప్రదేశం (జియోహెరిటేజ్‌ సైట్‌)గా దీన్ని గుర్తించగా.. 2016లో అప్పటి తెదేపా ప్రభుత్వం సంరక్షణ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తరువాత వచ్చిన వైకాపా ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయటమేకాకుండా...ఉనికే ప్రమాదంలో పడేలా చేసింది. దీంతో ఎక్కడికక్కడ ఆక్రమణలకు గురైంది. ఈ దిబ్బలను తవ్వి మట్టి తరలించేశారు. భీమిలి-భోగాపురం ఆరు వరుసల రహదారి ప్రతిపాదనతో ఇక్కడి స్థలాలకు విలువ పెరిగింది. వైకాపా నేతలు రంగంలోకి దిగి ఈ ప్రాంత భూములను తమ గుప్పిట్లోకి తీసుకుంటున్నారు.

ఎర్రమట్టి దిబ్బలను చూసేందుకు వెళ్లే మార్గంలో వేసిన కంచె

అంతా వ్యూహాత్మకం: ఎర్రమట్టి దిబ్బల్లో వారసత్వ ప్రదేశంగా గుర్తించిన 262 ఎకరాల సంరక్షణను విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రదేశాన్ని ప్రమాదంలోకి నెట్టే పరిస్థితులు ఏర్పడినా కళ్లప్పగించి చూస్తోంది. కొందరు వైకాపా నేతలకు అక్కడ స్థలాలు ఉన్నాయి. వాటి విలువ పెరిగేందుకు వ్యూహాత్మకంగా సమీపంలో విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ)తో ఆధ్వర్యంలో భారీ లేఅవుట్‌ ఏర్పాటు చేయించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దిబ్బలకు అతి సమీపంలో 60 ఎకరాల్లో రోడ్లు, మురుగు నీటి కాలువలు, కల్వర్టులు ఏర్పాటు చేశారు. అక్కడున్న వృక్షాలను తొలగించారు. చెట్లు, పొదలను యంత్రాలతో తీసేయడంతో మున్ముందు వరదలొస్తే ఆ ఉద్ధృతికి ఎర్రమట్టి దిబ్బలు కరిగిపోయే ప్రమాదం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని