logo

ముందుకెళ్లే వీల్లేక.. మార్గ మధ్యలో నిలిచే..!

గోపాలపట్నం నుంచి బాజీకూడలి మీదుగా ఎన్‌ఏడీకూడలికి వెళ్లే బీఆర్టీఎస్‌ సేవా మార్గంలో నిత్యం ట్రాఫిక్‌ వెతలతో వాహన చోదకులు అవస్థలు ఎదుర్కొంటున్నారు.

Published : 16 May 2024 03:27 IST

ట్రాఫిక్‌ స్తంభించడంతో ప్రయాణికులకు అవస్థలు

ఎన్‌ఏడీకూడలి (బుచ్చిరాజుపాలెం) న్యూస్‌టుడే: గోపాలపట్నం నుంచి బాజీకూడలి మీదుగా ఎన్‌ఏడీకూడలికి వెళ్లే బీఆర్టీఎస్‌ సేవా మార్గంలో నిత్యం ట్రాఫిక్‌ వెతలతో వాహన చోదకులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ట్రాఫిక్‌ సిబ్బంది నిర్లక్ష్యంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహన డ్రైవర్లు అయోమయానికి గురవుతున్నారు. ఆ వివరాలు.. ఎన్‌ఏడీ పైవంతెన కింద మార్గంలో భారీ వాహనాలు వెళ్లే వీల్లేకపోవడంతో... గోపాలపట్నం నుంచి ఎన్‌ఏడీకూడలికి వెళ్లే వాహనాలను బాజీకూడలి వద్ద మధ్య మార్గంలోకి చేరుకునేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు కూడలిలో భారీ వాహనాలకు మార్గం చూపేలా ట్రాఫిక్‌ సిబ్బందిని నియమించారు. బుధవారం సాయంత్రం విధుల్లో ఉన్న సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండడంతో... ఇతర ప్రాంతానికి చెందిన భారీ కంటైనర్‌ సేవా మార్గంలో ముందుకు వెళ్లిపోయింది.

బుచ్చిరాజుపాలెం బస్‌షెల్టర్‌ సమీపంలోకి వెళ్లేసరికి కంటైనర్‌ లారీ డ్రైవర్‌ అప్రమత్తమై... వంతెన కింద నుంచి వెళ్లే వీల్లేదని గుర్తించి.. వాహనాన్ని రోడ్డు మధ్యలో నిలిపేశాడు. ఆ సమయంలో వెనక నుంచి వచ్చిన ఇతర వాహనాలన్నీ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాయి. దాదాపు గంట పాటు ట్రాఫిక్‌ స్తంభించింది. చివరకు లారీ డ్రైవర్‌ అవస్థలు పడి... వాహనాన్ని వెనక్కి తీసుకొచ్చి.. బీఆర్టీఎస్‌ మధ్య మార్గం నుంచి ఎన్‌ఏడీ పైవంతెన మీదుగా వెళ్లాడు. తరచూ ఇదే సమస్య ఎదురవుతుందని, ట్రాఫిక్‌ ఉన్నతాధికారులు స్పందించి... కూడలిలో సమస్య పరిష్కారానికి శాశ్వత పద్ధతిలో చర్యలు చేపట్టాలని వాహనచోదకులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని