logo

కోణార్క్‌కు వందేభారత్‌ కష్టాలు

సికింద్రాబాద్‌ నుంచి విశాఖ వెళ్లే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ కోసం ఇతర రైళ్లను ఎక్కడ పడితే అక్కడ గంటల తరబడి నిలిపి వేస్తున్నారు. శుక్రవారం చింతపల్లి రైల్వే స్టేషన్‌ సమీపంలో ముంబయి నుంచి భువనేశ్వర్‌ వెళ్లు కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ (11019)ను గంట పాటు నిలిపి వేశారు.

Published : 23 Mar 2024 06:04 IST

న్యూస్‌టుడే, కాజీపేట

చింతలపల్లి వద్ద నిలిచిపోయిన కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌

సికింద్రాబాద్‌ నుంచి విశాఖ వెళ్లే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ కోసం ఇతర రైళ్లను ఎక్కడ పడితే అక్కడ గంటల తరబడి నిలిపి వేస్తున్నారు. శుక్రవారం చింతపల్లి రైల్వే స్టేషన్‌ సమీపంలో ముంబయి నుంచి భువనేశ్వర్‌ వెళ్లు కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ (11019)ను గంట పాటు నిలిపి వేశారు. ఇలా ప్రతి రోజూ జరుగుతుండడంతో మహబూబాబాద్‌, ఖమ్మం రోజువారీగా వెళ్లే ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.

  • కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు సికింద్రాబాద్‌కు రావాల్సి ఉండగా 4.31 గంటలకు వచ్చింది. ముంబయి నుంచి ఆలస్యంగా వచ్చిన సమయంలో వందేభారత్‌, కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల సమయం కొద్ది తేడాతో ఉండటం వల్ల కాజీపేట లేదా వరంగల్‌ పరిసర ప్రాంతాల్లో కోణార్క్‌ను నిలిపి వేస్తున్నారు. వరంగల్‌కు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఉదయం 6.40 గంటలకు వస్తుంది. ఈసమయంలో శుక్రవారం కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ చింతలపల్లి రైల్వే స్టేషన్‌ దాటి వెళ్లింది. వందేభారత్‌ ను పంపడానికి దాన్ని చింతపల్లి రైల్వే స్టేషన్‌లో నిలిపి వందేభారత్‌ను పంపారు. ఇదే సమయంలో రెండు గూడ్సు రైళ్లు, ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల సమయం ఉండటంతో వాటిని పంపడానికి కోణార్క్‌ను అరగంట పాటు అక్కడే నిలిపి వేశారు. మహబూబాబాద్‌కు ఉదయం 6.32 గంటలకు వెళ్లాల్సి ఉండగా 9.06కు, ఖమ్మంకు 7.20 బదులు 9.45కు వెళ్లింది. కాజీపేట నుంచి ఉదయం ఖమ్మం, మహబూబూబాద్‌ వెళ్లే ఉద్యోగులు, వ్యాపారులు కోణార్క్‌ను ఆశ్రయిస్తున్నారు.
  • వందేభారత్‌ వచ్చాక కోణార్క్‌ వేళలు గందరగోళంగా మారాయని, దీంతో ప్రయాణికులకు రైల్వే మీద నమ్మకం పోతుందని మాధవ్‌ అనే ప్రయాణికుడు వాపోయారు.
  • ఉదయం కాజీపేట నుంచి ఖమ్మం వెళ్లు పుష్‌పుల్‌, ఇతర రైళ్లు ఆలస్యం అవుతున్నాయని.. కోణార్క్‌ను ఆశ్రయిస్తే ఇది కూడా అలాగే అవ్వడం వల్ల విలువైన సమయం వృథాకావడంతో పాటు కార్యాలయాలకు, వ్యాపారం, కళాశాలలకు సమయానికి వెళ్లలేకపోతున్నామని శోభ అనే ప్రయాణికురాలు తెలిపారు.
  • ఈ విషయంపై స్థానిక రైల్వే ట్రాఫిక్‌ అధికారులను వివరణ కోరగా ముంబయి నుంచి వచ్చే కోణార్క్‌ ఆలస్యం కావడం వల్ల ఇబ్బంది కలుగుతుందని చెప్పారు. ముంబయి రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లి కోణార్క్‌ సరైన సమయానికి నడిచేలా చూస్తామని చెప్పారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు