logo

తండా ఒక్కటే ‘లోక్‌సభ’ నియోజకవర్గాలే వేరు

ఒక పల్లె ప్రజలంతా పంచాయతీ, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవడం సాధారణం.

Published : 29 Apr 2024 04:20 IST

ఒక పల్లె ప్రజలంతా పంచాయతీ, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవడం సాధారణం. కానీ ఇందుకు భిన్నంగా జనగామ-రఘునాథపల్లి మండలాల సరిహద్దులో అనేక దశాబ్దాల కింద వెలిసిన నక్కబొక్కలతండా నిలిచింది. ఈ తండాలో ప్రస్తుతం 190 పై చిలుకు ఓటర్లు ఉన్నారు. రెండు మండలాల సరిహద్దు రేఖ తండా మధ్యలో ఉండటంతో ఐదు గృహాలు జనగామకు, మరో 40 గృహాలు రఘునాథపల్లి మండలాలకు వర్తిస్తున్నాయి. జనగామ భువనగిరికి, రఘునాథపల్లి మండలం వరంగల్‌ లోక్‌సభ స్థానాల పరిధిలో ఉన్నాయి. ఇందులో భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 15 ఓట్లు, వరంగల్‌ పార్లమెంటు పరిధిలో 180 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఒకే తండా వాసులంతా రెండు స్థానాలకు (ఆయా నియోజకవర్గాల పరిధిలో) ఓటు వేయడం ఆసక్తికరంగా మారింది. అంతే కాకుండా గ్రామ పంచాయతీ, అసెంబ్లీ స్థానాలకూ ఆయా పరిధిని బట్టి తండా వాసులు భిన్నంగా ఓటును వినియోగించుకోవడం విశేషం. 

జనగామ రూరల్‌, న్యూస్‌టుడే


ఎంపీపీ నుంచి ఎంపీ వరకు..

మహబూబాబాద్‌, న్యూస్‌టుడే: జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని వ్యవసాయ కుటుంబంలో జన్మించిన బోడకుంటి వెంకటేశ్వర్లు బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశారు. తెదేపాలో చేరి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి 1987లో బచ్చన్నపేట మండల ప్రజాపరిషత్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఎంపీపీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి జడ్పీ ఛైర్మన్‌, ఎంపీగా, ఎమ్మెల్సీగా రెండు పర్యాయాలు ఎన్నిక కావడంతో పాటు శాసనమండలి ప్రభుత్వ విప్‌గా బాధ్యతలను నిర్వహించారు.

వెంకటేశ్వర్లు వివాదరహితుడిగా పేరుపొందారు. 1987 నుంచి 1992 వరకు ఎంపీపీగా బాధ్యతలు నిర్వహించారు. 1995 నుంచి 1999 వరకు జడ్పీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తెదేపా వ్యూహాత్మకంగా బీసీ అభ్యర్థిగా బోడకుంటి వెంకటేశ్వర్లును బరిలో నిలిపింది. కాంగ్రెస్‌ అభ్యర్థి టి.కల్పనాదేవిపై 13,366 ఓట్ల మెజార్టీతో వెంకటేశ్వర్లు విజయం సాధించారు. 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తెదేపా తరఫున రెండోసారి పోటీ చేసిన వెంకటేశ్వర్లు తెరాస(భారాస) అభ్యర్థి డి.రవీంద్రనాయక్‌ చేతిలో 19,262 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. అనంతరం ఆయన  తెరాసలో చేరారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. రెండోసారి ఎమ్మెల్సీగా నియమించడంతో పాటు శాసనమండలి ప్రభుత్వ విప్‌గా నియమించారు. ఇలా రాజకీయంగా గల్లీ నుంచి దిల్లీ వరకు ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రధానమైన రెండు చట్టసభల్లో అడుగుపెట్టారు రైతుబిడ్డ బోడకుంటి వెంకటేశ్వర్లు.


ఎన్నికల సంఘం వాట్సాప్‌ ఛానల్‌  

సామాజిక మాధ్యమం వేదికగా ఇటు రాజకీయ పక్షాలు, అటు ప్రభుత్వ యంత్రాంగం సాంకేతికతను అందిపుచ్చుకున్నాయి. ప్రచారానికి అభ్యర్థులు, ఓటర్ల చైతన్యానికి అధికారులు.. అందరి అరచేతిలో నానిన వాట్సాప్‌ వినియోగానికి ప్రాధాన్యమిస్తున్నారు. అందుకే కాబోలు గత శాసనసభ ఎన్నికలప్పుడు ఎన్నికల సంఘం వాట్సాప్‌ ఛానల్‌ ఒకటి ప్రారంభించింది. ఇప్పుడిది బహుళ ప్రాచుర్యం పొందింది. ఇందులో ఎన్నికలకు సంబంధించిన తాజా సమాచారం ఉంటుంది. దేశంలో దశల వారీగా జరుగుతున్న పోలింగ్‌ తాలూకు వివరాలను సైతం ఎప్పటికప్పుడు పొందుపరుస్తున్నారు. ఎన్నికల అధికారులు, సిబ్బంది విధుల నిర్వహణకు శ్రమకోర్చి పోలింగ్‌ కేంద్రాలకు వెళుతున్న తీరుకు తోడు ఓటు హక్కు వినియోగించుకున్న వివిధ వర్గాల వీడియోలు, చిత్రాలు, స్ఫూర్తిదాయక అంశాలు పోస్టింగ్‌ చేస్తున్నారు.    

న్యూస్‌టుడే, డోర్నకల్‌


ముద్ర లేకుండానే తొలి ఎన్నికలు

ఎన్నికల సంఘం నిర్దేశించిన ఈవీఎంల ద్వారా మనం ప్రస్తుతం ఓటు వేస్తున్నాం. అంతకుముందు బ్యాలెట్‌ పత్రాలపై ప్రచురించిన అభ్యర్థి పేరు, గుర్తుపై స్వస్తిక్‌ ముద్ర వేయడం ద్వారా ఓటింగ్‌ జరిగేది. 1952లో బ్యాలెట్‌ పేపర్‌పై ముద్ర వేయకుండానే మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. భారత ప్రథమ ఎన్నికల కమిషనర్‌ సుకుమార్‌సేన్‌ ఆధ్వర్యంలో దేశంలోని 489 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించగా.. ప్రతి పార్టీకి ఓ గుర్తు కేటాయించి బ్యాలెట్‌ పత్రాలపై ముద్రించింది. అలాగే వివిధ గుర్తులు కలిగిన బ్యాలెట్‌ పెట్టెలను పోలింగ్‌ కేంద్రంలో విడివిడిగా ఏర్పాటు చేశారు. ఓటర్లు తమకు నచ్చిన గుర్తుకు సంబంధించిన పెట్టెలో బ్యాలెట్‌ పత్రం వేశారు. గుర్తుల ఆధారంగా ఏర్పాటు చేసిన పెట్టెలలో వేసిన ఓట్లను లెక్కిస్తే ఎక్కువ వచ్చిన వారు విజేతలుగా ప్రకటించారు.

న్యూస్‌టుడే, వరంగల్‌ వ్యవసాయం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని