logo

WestGodavari: రైలు పట్టాల వెంబడి మృతదేహాలు..ఎలా చనిపోయారో ఏమో!

రైలు పట్టాల వెంబడి మృతదేహాలు కనిపించడం సాధారణంగా మారింది. రైలు ఢీకొని, రైల్లో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు కిందపడి కొందరు మృతి చెందుతుండగా.. మరికొందరు ఆత్మహత్య  చేసుకుంటున్నారు.

Updated : 10 Jul 2023 10:22 IST

సకాలంలో గుర్తించకుంటే చాలా కష్టం

ఏలూరు టూటౌన్‌, న్యూస్‌టుడే: రైలు పట్టాల వెంబడి మృతదేహాలు కనిపించడం సాధారణంగా మారింది. రైలు ఢీకొని, రైల్లో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు కిందపడి కొందరు మృతి చెందుతుండగా.. మరికొందరు ఆత్మహత్య  చేసుకుంటున్నారు. హతమార్చి పట్టాలపై పడేసిన ఘటనలూ లేకపోలేదు. ఈ క్రమంలో సకాలంలో గుర్తిస్తే కారణాలను పోలీసులు తెలుసుకునే వీలుంటుంది. లేదంటే అంతా తారుమారవుతుంది. వాటిని స్వాధీనం చేసుకుని అంతిమ సంస్కారాలు చేయడం తప్ప చేసేదేమీ ఉండదని పలువురు అంటున్నారు.

రైలు పట్టాల భద్రత, వాటిని ఎప్పటికప్పుడు సరిచూడటంతో పాటు మృతదేహాలు లేదా జంతు కళేబరాలు ఉంటే వాటిని గుర్తించడం రైల్వే ట్రాక్‌మెన్ల పని. రాత్రీపగలు తేడా లేకుండా షిప్టుల వారీగా వీళ్లు పనిచేస్తుంటారు. ప్రతి 4 కిలోమీటర్లకు ఓ ట్రాక్‌మ్యాన్‌ పట్టాల వెంబడి విధులు నిర్వహిస్తుంటారు.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో గన్నవరం నుంచి భీమడోలు వరకు ఏలూరు రైల్వే స్టేషన్‌ పరిధి, కైకలూరు నుంచి నరసాపురం వరకు భీమవరం రైల్వే స్టేషన్‌ పరిధి. భీమవరం నుంచి తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొవ్వూరు వరకు తాడేపల్లి గూడెం రైల్వే స్టేషన్‌ పరిధిలో ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో సుమారు 180 కిలోమీటర్ల మేర రైల్వే లైన్లు విస్తరించి ఉండగా 120 మంది ట్రాక్‌మెన్లు పని చేస్తున్నారు. మృతదేహాల్ని కొందరు ట్రాక్‌మెన్లు సకాలంలో గుర్తించలేకపోతున్నట్లు తెలుస్తోంది.

* కొద్ది రోజుల కిందట నగర శివారు వట్లూరు సమీపంలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాల పక్కనున్న రైల్వే ట్రాక్‌కు 30 అడుగుల దూరంలో సుమారు 30 నుంచి 35 సంవత్సరాల వయసున్న వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. ఇతను చనిపోయి నెల రోజులై ఉంటుందని భావిస్తున్నారు. శరీరమంతా కుళ్లిపోయి అస్థిపంజరంలా మారింది. రైల్వే పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

* గత నెలలో నూజివీడు రైల్వేస్టేషన్‌ పరిధిలోని కొయ్యూరు గేటు సమీపంలో బాగా కుళ్లిన మృతదేహాన్ని గుర్తించారు. సకాలంలో గుర్తించలేకపోవడంతో ఆనవాళ్లు లేని విధంగా ముఖం తయారైంది. ఏ కారణాలతో చనిపోయాడో తెలియని పరిస్థితి నెలకొంది.

హత్యలుగా నిర్ధారణ

మృతదేహాలను సకాలంలో గుర్తించడంతో రెండు హత్య కేసులు వెలుగు చూశాయి. మృతి చెందిన ఒకట్రెండు రోజుల్లో వీటిని గుర్తించడం ద్వారా ఇది సాధ్యపడింది. నూజివీడు రైల్వే స్టేషన్‌ పరిధిలోని వేలేరు శివారులో పట్టాల పక్కనే ఓ మృతదేహాన్ని గుర్తించారు. రైలు నుంచి పడి చనిపోయి ఉంటాడని రైల్వే పోలీసులు భావించారు. కానీ ఘటనా స్థలానికి వెళ్లిన ఓ రైల్వే పోలీసుకు మృతదేహం ఉన్న తీరు చూసి సందేహం కలిగింది. జాగ్రత్తగా గమనించగా మృతదేహం పడి ఉన్న ప్రాంతం నుంచి కొన్ని రక్తపు మరకలు ఆ పక్కనే ఉన్న తోటలోకి ఉన్నాయి. వాటి వెనుకాలే ఆ కానిస్టేబుల్‌ వెళ్లారు. తోటలోకి వెళ్లాక రక్తపు మడుగు కనిపించింది. దీంతో అతన్ని హత్య చేసి ఈడ్చుకొచ్చి పట్టాల పక్కన పడవేశారని భావించారు. ఈ క్రమంలో హత్య కేసుగా నమోదుచేసి హనుమాన్‌ జంక్షన్‌ పోలీసులకు కేసు అప్పగించారు. రెండేళ్ల కిందట ఈ ఘటన జరిగింది.

* ఏలూరు శివారు ఆటోనగర్‌ సమీపంలోని పట్టాల వద్ద ఓ మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. రైల్వే పోలీసులు హత్య కేసుగా పరిగణించి పోలీసులకు అప్పగించారు. వీటిని ఆలస్యంగా గుర్తిస్తే కేసులు తారుమారు అయ్యేవి.

సమాచారం తెలిసిన వెంటనే చర్యలు.. రైలు ప్రమాదాల్లో ఫలానా ప్రాంతంలో ఎవరైనా మృతి చెందారనే సమాచారం తెలియగానే సిబ్బంది వెళ్లి పరిశీలిస్తారు. మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతాం. మృతుని వివరాలు, కారణాలు తెలుసుకుంటాం. కొన్ని సందర్భాల్లో ట్రాక్‌మెన్‌లు గుర్తించకపోవడంతో కుళ్లిన దశలో చూడాల్సి వస్తోంది. దీనివల్ల మృతుల వివరాలు తెలుసుకోవాలంటే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.

డి.నరసింహారావు, రైల్వే ఎస్సై ఏలూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు