logo

ట్రిపుల్‌ ఐటీ విద్యకు ఏమైంది?

పేదలకు సాంకేతిక విద్య అందించాలన్న ఆశయంతో ట్రిపుల్‌ ఐటీలను ప్రారంభించారు. ప్రస్తుతం ఆ సంకల్పం మసకబారుతోంది.

Published : 12 Aug 2023 05:35 IST

ఇతర కళాశాలతో పోలిస్తే ప్రవేశాల్లో జాప్యం
మొదటి కౌన్సెలింగ్‌లో భర్తీ కాని సీట్లు

నూజివీడు ట్రిపుల్‌ఐటీలో రెండో విడత కౌన్సెలింగ్‌కు వచ్చిన విద్యార్థులు

ఈనాడు, ఏలూరు, న్యూస్‌టుడే, నూజివీడు పట్టణం: పేదలకు సాంకేతిక విద్య అందించాలన్న ఆశయంతో ట్రిపుల్‌ ఐటీలను ప్రారంభించారు. ప్రస్తుతం ఆ సంకల్పం మసకబారుతోంది. ప్రవేశాల్లో మితిమీరిన జాప్యంతో అర్హత ఉన్న విద్యార్థులు ప్రైవేటు కళాశాలల్లో చేరుతున్నారు. దీంతో మొదటి కౌన్సెలింగ్‌లో 771 సీట్లు మిగిలిపోయాయి.

రాష్ట్రంలో నూజివీడు, ఒంగోలు, ఇడుపులపాయ, శ్రీకాకుళంలో ట్రిపుల్‌ ఐటీలున్నాయి. ఒక్కో చోట వెయ్యి చొప్పున ఏటా 4 వేల సీట్లు భర్తీ చేస్తారు. ఇందుకు ఈ ఏడాది దాదాపు 36 వేల మంది దరఖాస్తు చేశారు. అన్ని కళాశాలలకు నూజివీడు ప్రాంగణంలోనే జులై చివరిలో మొదటి కౌన్సెలింగ్‌ జరిగింది. అందులో 771 సీట్లు మిగిలిపోయాయి. తాజాగా రెండో విడత కౌన్సెలింగ్‌ కూడా పూర్తయి 240 సీట్లు మిగిలాయి.  గతంలో మొదటి కౌన్సెలింగ్‌లోనే దాదాపు అన్ని సీట్లూ భర్తీ అయ్యేవి. మిగిలిన వాటి సంఖ్య 10 నుంచి 50లోపు ఉండేది. ఈసారి మూడో విడత కౌన్సెలింగ్‌ కూడా నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రెండు నెలల జాప్యమా!.. ఏటా మే నెలలోనే పదో తరగతి పరీక్ష ఫలితాలు వచ్చేస్తాయి. అప్పటి నుంచి కార్పొరేట్‌ మొదలు చిన్న చిన్న కళాశాలల ప్రతినిధుల వరకు ఇంటింటికీ తిరిగి విద్యార్థులను తమ కళాశాలల్లో చేర్పించుకుంటారు. జూన్‌ మొదటి వారంలోనే తరగతులు మొదలవుతున్నాయి. ట్రిపుల్‌ ఐటీల్లో మాత్రం ఆగస్టు రెండో వారం వచ్చినా ఇంకా ప్రవేశాలే పూర్తి కాలేదు. నెలాఖరుకు కూడా తరగతులు మొదలవుతాయో లేదో ప్రశ్నార్థకమే.

కళాశాలల్లో ఫీజులు కట్టి మళ్లీ వెనక్కి

ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలు ఆలస్యం కావడంతో వందల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రిపుల్‌ ఐటీ కోసం ఎదురు చూసి తీరా సీటు రాకుంటే ఆ సమయానికి ప్రైవేటు కళాశాలల్లో కూడా సీట్లు ఉండవని విద్యార్థులు జూన్‌లోనే కార్పొరేట్‌ కళాశాలల్లో చేరిపోయారు. అక్కడ ప్రవేశ రుసుము మొదలు, పుస్తకాలు, మెస్‌, మొదటి విడత ఫీజు.. ఇలా అన్నీ కలిపి రూ.30 వేల నుంచి 50 వేల వరకు చెల్లించారు. రెండు నెలలు గడిచాక ట్రిపుల్‌ ఐటీలో కౌన్సెలింగ్‌కు పిలుస్తుండటంతో ఆయా కళాశాలలు వదిలి కౌన్సెలింగ్‌కు వస్తున్నారు. ఈ కారణంగా ఆయా కళాశాలల్లో చెల్లించిన ఫీజులు వృథా అవుతున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. కళాశాలల్లో మెస్‌ నిర్వహణ బాగోక, అక్కడి ఆహారం ఇమడక చాలా మంది విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు, జగనన్న వసతి దీవెన, విద్యాదీవెన సక్రమంగా అందడం లేదు. ఈ కారణాలతో ట్రిపుల్‌ ఐటీల్లో తమ పిల్లలను చేర్పించేందుకు వెనుకంజ వేస్తున్నారు. దీనిపై ట్రిపుల్‌ఐటీలోని సంబంధిత అధికారులను సంప్రదించగా.. వివరణ ఇచ్చేందుకు అంగీకరించలేదు.

ప్రైవేటు కళాశాలలో రూ.36 వేలు చెల్లించా

మా అబ్బాయికి పదో తరగతిలో మంచి మార్కులు వచ్చాయి. మాది పేద కుటుంబం కావడంతో ట్రిపుల్‌ ఐటీలో సీటు వస్తుందనుకున్నా. ఫలితాలు వచ్చి నెలలు గడుస్తున్నా కౌన్సెలింగ్‌కు పిలవకపోవడంతో ఓ ప్రైవేటు కళాశాలలో చేర్పించా. మెస్‌, ఫీజులన్నీ కలిపి రూ.36 వేలు చెల్లించా. కొద్ది రోజులకు కౌన్సెలింగ్‌కు పిలవడంతో అక్కడి నుంచి టీసీ తీసుకుని నూజివీడు వచ్చాం. ముందే నిర్వహిస్తే బాగుంటుంది. 

చిన్నోడు, శ్రీకాకుళం, విద్యార్థి తండ్రి

ప్రవేశాల ఆలస్యంతో నష్టపోయాం

ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశాలు చాలా ఆలస్యమవుతున్నాయి. మేలో పది ఫలితాలు వస్తే ఇప్పటి వరకు ఇంకా కౌన్సెలింగ్‌ పూర్తి కాలేదు. ట్రిపుల్‌ ఐటీలో సీటు వస్తుందో లేదో అని మా అబ్బాయిని ప్రైవేటు కాలేజీలో చేర్పించా. ఫీజుల రూపంలో రూ.15 వేలు చెల్లించా. ఇప్పుడు కౌన్సెలింగ్‌కు పిలవడంతో తిరుపతి నుంచి వచ్చాం. ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది.

శివారెడ్డి, తిరుపతి, విద్యార్థి తండ్రి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని