logo

జగన్‌.. బటన్‌ నొక్కినా పరిహారం దక్కలే!

‘రైతులను చేయి పట్టి నడిపించే ప్రభుత్వం మాది.. సీˆజన్‌ ముగిసే లోగా పరిహారం అందిస్తాం.. అది కూడా నేరుగా నా రైతన్నల ఖాతాల్లోకే..’ కర్షకులను ఉద్దేశించి సీఎం జగన్‌ మార్చి 6న ఇన్‌పుట్‌ సబ్సిడీ బటన్‌ నొక్కుతూ చేసిన వ్యాఖ్యలు ఇవి.

Published : 19 Apr 2024 04:53 IST

అన్నదాతల ఎదురు చూపులు

సార్వాలో నేలపాలైన వరి (పాత చిత్రం)
 

ఉమ్మడి జిల్లాలోని రైతుల ఖాతాల్లో రూ.54 కోట్లు పైగా జమ కావాల్సి ఉంది. అసలే ఇచ్చేది అరకొర పరిహారం.. ఐదు నెలలు కిందట నష్టపోయారు. బటన్‌నొక్కినా తీవ్ర జాప్యమైంది, అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయని అన్నదాతలు దిగులు చెందుతున్నారు.

ఆచంట, పెనుమంట్ర, పెనుగొండ, నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే: ‘రైతులను చేయి పట్టి నడిపించే ప్రభుత్వం మాది.. సీˆజన్‌ ముగిసే లోగా పరిహారం అందిస్తాం.. అది కూడా నేరుగా నా రైతన్నల ఖాతాల్లోకే..’ కర్షకులను ఉద్దేశించి సీఎం జగన్‌ మార్చి 6న ఇన్‌పుట్‌ సబ్సిడీ బటన్‌ నొక్కుతూ చేసిన వ్యాఖ్యలు ఇవి. గత ఏడాది మిగ్‌జాం తుపాను వస్తే ఇప్పటికీ రైతుల ఖాతాల్లో జమ కాలేదు. నెలా పది రోజులుగా అన్నదాతలు పరిహారం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.
సంక్రాంతికి ఇస్తానన్నారు.. గత ఏడాది సార్వా పంట చేతికందే దశలో తుపాను ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది. డెల్టాలో కొన్ని గ్రామాల్లో పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. డిసెంబరులోనే క్షేత్రస్థాయిలో పంట నష్టాల జాబితా రూపొందించి, సంక్రాంతికి ముందే పరిహారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సంక్రాంతితోపాటు ఉగాది కూడా వచ్చి వెళ్లిపోయింది. పశ్చిమలో ప్రాథమికంగా 59,125 ఎకరాలుగా నిర్ణయించి, చివరికి 44,729 ఎకరాలకు కుదించారు. ఏలూరు జిల్లాలో ప్రాథమికంగా 85 వేల ఎకరాలుగా అంచనా వేసి, 36 వేల ఎకరాలకు తుది జాబితా సిద్ధం చేశారు.


అయిదెకరాల్లో పంట నష్టపోయా. రూ.34 వేలు పెట్టుబడి రాయితీ రావాలి. ఇంకా ఖాతాలో జమ కాలేదు. లక్షకు పైగా అప్పులు మిగిలాయి. వడ్డీలు పెరిగిపోతున్నాయి.

యర్రంశెట్టి శ్రీను, గొంది.


సార్వాలో మూడొంతుల పంట నేలపాలైంది. ప్రభుత్వం ఇప్పటికీ సాయం అందించలేదు. నాకు ఎకరానికి రూ. 20 వేలు నష్టం వచ్చింది.

అప్పారావు, పెనుమంట్ర.


ఏటా వేమవరం నక్కలకాలువ పక్క చేలకు ముంపు తప్పడం లేదు. మూడేళ్లుగా నష్టపోతున్నాం. దాళ్వాలో నీరందడం లేదు. నాకు సార్వా నష్ట పరిహారం ఇంకా రాలేదు.

ఎ.నాగయ్య, ఆచంట వేమవరం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని