logo

వారం అన్నావ్‌.. వమ్ము చేశావ్‌

‘ తెదేపా సర్కారు అగ్రిగోల్డ్‌ బాధితులను పట్టించుకోలేదు. వచ్చేది మనందరి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే అందరికీ న్యాయం చేస్తాం. చనిపోయిన బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున చెల్లిస్తాం.’..

Published : 20 Apr 2024 06:43 IST

అయిదేళ్లవుతున్నా అమలుకు నోచని జగన్‌ హామీ
అగ్రిగోల్డ్‌ బాధితుల ఆవేదన

భీమవరం: నిరసన దీక్షలో నినదిస్తున్న బాధితులు, సంఘ నాయకులు (పాతచిత్రం)

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ‘ తెదేపా సర్కారు అగ్రిగోల్డ్‌ బాధితులను పట్టించుకోలేదు. వచ్చేది మనందరి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే అందరికీ న్యాయం చేస్తాం. చనిపోయిన బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున చెల్లిస్తాం.’.. గత ఎన్నికల సమయంలో అగ్రిగోల్డ్‌ బాధితులకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ ఇది. అయిదేళ్లు గడిచి మళ్లీ ఎన్నికలొచ్చినా ఈ హామీని అమలు చేయలేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో 1.3 లక్షల మంది..

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 1.30 లక్షల మంది అగ్రిగోల్డ్‌ బాధితులున్నారు. రూ. 10 వేలలోపు డిపాజిట్‌ చేసిన వారికి చెల్లింపులు చేస్తున్నట్లు మూడేళ్ల క్రితం ప్రభుత్వం ప్రకటించింది. దీనికి వేలాదిగా జనం దరఖాస్తు చేసుకున్నారు. పోలీసుల విచారణ తర్వాత నగదు ఇస్తామన్నారు. నిజమని నమ్మిన బాధితులు ఎంతో ఆశతో పోలీసుస్టేషన్ల చుట్టూ తిరిగారు. 90 శాతం మందికి ఇప్పటికీ న్యాయం జరగలేదు. రూ.1000 నుంచి రూ.లక్షకుపైగా డిపాజిట్‌ చేసిన వారు గత కొన్నేళ్లుగా ఉద్యమాలు, నిరసనలు చేసినా వైకాపా సర్కారు ఏమాత్రం పట్టించుకోలేదు. మళ్లీ ఇలాంటి హామీలతో ప్రజల్లోకి వస్తున్న నాయకులకు తగిన గుణపాఠం చెబుతామని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


సొంత ఇల్లు అమ్ముకుని..

అగ్రిగోల్డ్‌ సంస్థలో రూ.15 లక్షలు డిపాజిట్‌ చేశా. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీతో ఆ సొమ్ము తిరిగి వస్తుందని ఆశించగా నిరాశే మిగిలింది. అప్పులు తీర్చలేక సొంతింటిని అమ్ముకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నా. రూ.10 వేలు, రూ.20 వేలలోపు డిపాజిట్‌దారులకు చెల్లిస్తున్నట్లు చెప్పినా అది కూడా పూర్తిస్థాయిలో జరగలేదు.

 కె.గోపాలకృష్ణ, సంఘం జిల్లా అధ్యక్షుడు


నిరాశే మిగిలింది

భద్రత ఉంటుందనే యోచనతో పొదుపు చేసిన సొమ్మును డిపాజిట్‌ చేశా. ఎన్నికల హామీతో ఆ సొమ్ము తిరిగి వస్తుందని ఆశించా. రూ.10 వేలు, రూ.20 వేలు చెల్లింపుల్లో కూడా ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురు డిపాజిట్‌దారులు అంటే కేవలం ఒక్కరికే ఇస్తామన్నారు. రూ.50 వేలలోపు ఉన్నవారికి త్వరలో చెల్లిస్తామని చెప్పడంతో ఎంతో ఆశగా ఎదురు చూశాం. చివరకు నిరాశే మిగిలింది.

యడవల్లి వీరకృష్ణ, పెదఅమిరం


అణచివేత ధోరణి

గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నెరవేర్చాలని కోరుతూ 36 సార్లు నిరసన తెలిపి వినతిపత్రాలు ఇచ్చాం. మెయిల్‌ ద్వారా సందేశాలు, 48 గంటల దీక్షలు, సచివాలయానికి పాదయాత్ర, కలెక్టర్‌ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేపట్టాం ప్రజాప్రతినిధులకు వినతులు ఇచ్చాం. బాధితులకు సొమ్ము చెల్లించపోగా ఆందోళనలను అణచివేసేందుకు కేసులు బనాయించారు.

కె.భీమారావు, అగ్రిగోల్డ్‌ బాధితుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని