logo

అధికార పార్టీ ప్రలోభాల పర్వం

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో  అధికార వైకాపా ముందుగానే ప్రలోభాలకు తెరలేపింది. నోటిఫికేషన్‌ విడుదలయ్యాక పోలింగ్‌కు ఎక్కువ సమయం ఉండటంతో అభ్యర్థులు గ్రామాల్లో శుభకార్యాలు, పెళ్లిళ్లు, పుట్టిన రోజు వేడుకలు, పరామర్శలకు ప్రాధాన్యం ఇచ్చారు.

Published : 28 Apr 2024 04:34 IST

మహిళా సంఘాలపై గురి

భీమవరం వన్‌టౌన్‌, పట్టణం, వీరవాసరం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో  అధికార వైకాపా ముందుగానే ప్రలోభాలకు తెరలేపింది. నోటిఫికేషన్‌ విడుదలయ్యాక పోలింగ్‌కు ఎక్కువ సమయం ఉండటంతో అభ్యర్థులు గ్రామాల్లో శుభకార్యాలు, పెళ్లిళ్లు, పుట్టిన రోజు వేడుకలు, పరామర్శలకు ప్రాధాన్యం ఇచ్చారు. పోలింగ్‌ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ సామాజికవర్గాల వారీగా పెద్దలను కలుస్తూ మద్దతు కోరుతున్నారు.  సమాంతరంగా తెరవెనుక ప్రలోభాల పర్వాన్ని కొనసాగిస్తున్నారు.

జిల్లాలో పలు నియోజకవర్గాల్లో అధికార వైకాపా అభ్యర్థులు డ్వాక్రా సంఘాలపై దృష్టి సారించారు. ప్రతి సభ్యురాలికి రూ.వెయ్యి చొప్పున నగదు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. దీనిని మే 3లోపు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి సహకరిస్తున్న యానిమేటర్లకు రూ.వేలల్లో ముట్టజెబుతున్నారు. కొన్ని చోట్ల యానిమేటర్లు వారి అనుభవానికి పదును పెట్టి సంఘాల్లో సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు నమ్మబలికి అదనపు నగదును కాజేస్తున్నట్లు వినికిడి.

జాతరలో చీరల పంపిణీ..భీమవరం నియోజకవర్గంలో పలు పంచాయతీల్లో ఇటీవల గ్రామ దేవతల జాతరలు ప్రారంభమయ్యాయి. అధికార పార్టీ అభ్యర్థి ఒకరు ఆయా గ్రామాల్లో మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నారు.

గెలుస్తామని చెప్పాలి మరి..

భీమవరం, సమీప నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో మహిళా సంఘాల సభ్యులకు రూ. వెయ్యి చొప్పున నగదు పంపిణీని అధికార పార్టీ నాయకులు మొదలుపెట్టారు. దీనిని పర్యవేక్షిస్తున్న ఆర్పీలకు రూ.25 వేల చొప్పున అందజేసినట్లు సమాచారం. సొమ్ము ఇచ్చాక.. రాబోయే పదిరోజులూ గెలుపు మనదే అంటూ చుట్టుపక్కల వారికి, బంధుమిత్రులందరికీ చెబుతూ విస్తృత ప్రచారం చేయాలని డ్వాక్రా, మెప్మా సంఘాల సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నారు. నగదు ఇచ్చిన విషయం మాత్రం బయటకు పొక్కనీయొద్దని బొట్టుపెట్టి మరీ చెబుతున్నారు.

వైదొలగిన వాలంటీర్లకు ప్యాకేజీలు

రాజీనామాలు చేసిన వాలంటీర్లకు అధికార పార్టీ అభ్యర్థులు రూ.5 వేల చొప్పున అందజేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇలాంటి వారంతా పోలింగ్‌ లోపు అధికార పార్టీ అభ్యర్థి కోసం ప్రచారం చేయడంతో పాటు ప్రత్యర్థి పార్టీల మద్దతుదారుల ఓట్లు రాబట్టుకొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నాయకులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. దీని కోసం వాలంటీర్లకు ప్రత్యేక ప్యాకేజీల రూపంలో నగదు ఇవ్వనున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని