logo

జగన్‌ ఏలుబడి.. బాగుపడని బాలబడి!

ఒక్కటంటే ఒక కేంద్రం  బాగుందని చెప్పలేం. చిన్నారుల సంక్షేమానికి భరోసా మాది.  వారికి మావయ్యనంటూ సీఎం జగన్‌ ప్రకటనలిస్తున్నా..అవన్నీ ఉత్తమాటలే.

Updated : 28 Apr 2024 05:24 IST

ఒక్కటంటే ఒక కేంద్రం  బాగుందని చెప్పలేం. చిన్నారుల సంక్షేమానికి భరోసా మాది.  వారికి మావయ్యనంటూ సీఎం జగన్‌ ప్రకటనలిస్తున్నా..అవన్నీ ఉత్తమాటలే. అంగన్‌వాడీ కేంద్రాల పరిస్థితే ఇందుకు నిదర్శనం. ఇరుకు గదుల్లో బాల్యం మగ్గుతోంది. భవనాల నిర్మాణాలు పూర్తి కాక అసౌకర్యాల నడుమ కేంద్రాలు సాగుతున్నాయి. తాగునీరు, విద్యుత్తు, మరుగుదొడ్లు.. ఇలా వసతుల లోపం ప్రతి చోటా ఉంది. అటు నాడు-నేడులో చేపట్టిన పనులూ ముందుకు సాగడం లేదు.

ఏలూరు వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: అంగన్‌వాడీ కేంద్రాల్లో అసౌకర్యాలు తిష్ఠ వేశాయి. ఇప్పటికీ చాలా కేంద్రాలకు సొంత గూడు లేదు. గతంలో నాబార్డు, స్త్రీ, శిశు సంక్షేమ, ఉపాధి హామీ పథకం అనుసంధాన నిధులతో వందకుపైగానే ప్రాంతాల్లో భవనాల నిర్మాణాలు ప్రారంభించారు. ప్రభుత్వం మారిపోవడం..నిధులు పూర్తిస్థాయిలో విడుదల కాకపోవటంతో గుత్తేదారులు నిర్మాణాలు నిలిపేశారు. ఇప్పటికీ పూర్తి చేయలేదు. ఇంకొన్ని చోట్ల అప్పటి నుంచి ఈ నిర్మాణాల్లో పురోగతి కన్పించలేదు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన వాటిని వైకాపా సర్కారు నిర్లక్ష్యంగా వదిలేసింది. ఫలితంగా ఇరుకు అద్దె గదుల్లో.. అసౌకర్యాలతో నిండిన భవనాల్లో కేంద్రాల నిర్వహణ సాగుతోంది. పల్లెలు కంటే పురపాలికల్లో, నగరంలో భవనాల కొరత ఎక్కువగా ఉంది. ఇక్కడ అద్దె ఎక్కువగా ఉండటంతో ఇరుకు గదుల్లో అసౌర్యాల నడుమ కేంద్రాలను నిర్వహించాల్సి వస్తోంది. తాగునీటి సౌకర్యం లేకపోవటంతో ఇంటి నుంచే నీళ్ల సీసాలు తెచ్చుకుంటున్నారు. ప్రథమ చికిత్స కిట్లు కూడా రావడం లేదు. పిల్లల కుర్చీలు  పాతవైపోవటంతో వాటిని అటకపైకి పడేశారు. ఆట వస్తువులు పాడైపోయాయి.

భీమడోలు అరుంధతి కాలనీ మీపంలో శిథిలావస్థలో ఉన్న పాత పీహెచ్‌సీ భవనంలో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రం

చిన్నారులకు సమకూరని సౌకర్యాలు

జిల్లా కేంద్రమైన ఏలూరు అర్బన్‌ ప్రాజెక్టు పరిధిలో 120 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 86.. అద్దె గదుల్లోనే సాగుతున్నాయి. మిగిలిన 34 కేంద్రాలు వివిధ పాఠశాలల్లో నిర్వహిస్తున్నారు. వీటిలో సదుపాయాలు లేక చిన్నారులు అవస్థలు పడుతున్నారు. బియ్యం, ఇతర సరకులు, వంటావార్పు అన్నీ అక్కడే కావటంతో చాలీచాలని గదుల్లో  చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు.

నిలిచిన నాడు-నేడు పనులు

జిల్లాలో నాడు-నేడు కింద 229 కేంద్ర భవనాల నిర్మాణ పనులు చేపట్టారు. అనుమతిచ్చినా క్షేత్రస్థాయిలో చాలాచోట్ల ఎలాంటి కదలికా లేదు. కొన్ని గ్రామాల్లో పునాది దశలోనే ఉన్నాయి. మరికొన్ని చోట్ల కిటికీలు, శ్లాబ్‌ స్థాయి వరకు పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం సిమెంటు సరఫరాలో జాప్యంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి.


ఇబ్బందుల మధ్య కేంద్రాల నిర్వహణ

జీలుగుమిల్లి మండలం కనకాపురం  కేంద్రం మంచినీటి ట్యాంకు వద్ద అధ్వాన పరిస్థితిది. చేతులు శుభ్రం చేసుకోవడం.. ఇతర అవసరాలకు నీటిని పట్టుకోవాలంటే ఇబ్బందులు తప్పడం లేదు. ట్యాంకు వద్ద పగిలిపోయి.. నిల్చోవడానికి కూడా వీలులేకుండా ఉంది.

 న్యూస్‌టుడే, జీలుగుమిల్లి


కొయ్యలగూడెం మండలం అంకాలగూడెంలో 37 ఏళ్ల కిందట ఉపాధి హామీ పథకంలో నిర్మించిన ప్రాథమిక పాఠశాల భవనం ఇది. ఆ తర్వాత కొన్నేళ్లకు పాఠశాలను మరో చోటకు తరలించడంతో ఆ భవనంలో కోడ్‌ నంబరు 125 అంగన్‌వాడీ కేంద్రం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం భవనం శిథిలమైంది. కిటికీల తలుపులు ఊడిపోవడంతో అట్టలు అడ్డుపెట్టి కాలక్షేపం చేస్తున్నారు. శ్లాబు పెచ్చులూడుతోంది. భవనం స్తంభాలు సిమెంటు ఊడి ఊచలు బయటపడ్డాయి. వర్షాకాలంలో శ్లాబు కారుతుంది. బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి. సొంత భవన నిర్మాణానికి స్థలం కేటాయించారు కానీ నిధులు కేటాయించలేదు.

 న్యూస్‌టుడే, కొయ్యలగూడెం గ్రామీణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని