logo

జగనన్న బీమాయాజాలం

అనుకోని విపత్తులో మృత్యువు కబళించినా..కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కు ప్రాణం విడిచినా..నేనున్నానంటూ ధీమానిచ్చే ప్రభుత్వ బీమాను వైకాపా సర్కారు నిర్వీర్యం చేసింది.

Published : 29 Apr 2024 03:20 IST

దరఖాస్తు చేసి ఏళ్లు గడుస్తున్నా జమ కాని సొమ్ము
అమలులో ఆలస్యం.. అరకొరగా పరిహారం
అర్హతకూ కొర్రీలే..వేలాది కుటుంబాలకు ఎగనామం
ఈనాడు, భీమవరం, న్యూస్‌టుడే, బృందం

అనుకోని విపత్తులో మృత్యువు కబళించినా..కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కు ప్రాణం విడిచినా..నేనున్నానంటూ ధీమానిచ్చే ప్రభుత్వ బీమాను వైకాపా సర్కారు నిర్వీర్యం చేసింది. అధికారంలోకి వచ్చిన రెండేళ్లు బీమా ఊసే లేకుండా చేసి వేలాది మందికి అన్యాయం చేసింది. తర్వాత ఇస్తున్న పరిహారంలో కూడా అడ్డగోలు నిబంధనలు పెట్టి కోతలతో నిరుపేద కుటుంబాల వెన్ను విరిచింది. జగన్‌ అసమర్థతతో వందలాది కుటుంబాలకు ఏళ్ల తరబడి నిరీక్షణ, నిట్టూర్పులే మిగిలాయి.

ఇంట్లో ఎవరు మరణించినా తెదేపా పాలనలో చంద్రన్న బీమా  వర్తింపజేసేవారు. అంత్యక్రియలకు ముందే మట్టి ఖర్చులకు రూ.10 వేలు అందజేసేవారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక మొత్తం మారిపోయింది. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల వరకు అసలు పథకం ఊసే లేదు. 2021లో మొదలు పెట్టిన తర్వాత కూడా కుటుంబంలో సంపాదించే వ్యక్తికే పరిహారం ఇస్తానంటూ కొర్రీలు పెట్టి అడ్డగోలుగా కోతలు విధించారు. తెదేపా పాలన తుది దశలో ఎన్నికల నియమావళి వచ్చినప్పటి నుంచి వైకాపా అధికారంలోకి వచ్చే మధ్య కాలంలో ఉమ్మడి జిల్లాలో 3 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వారంతా తెదేపా సానుభూతిపరులన్న వంకతో ఒక్కరికి కూడా వైకాపా సర్కారు పరిహారం ఇవ్వలేదు.

ఇదీ వైఎస్‌ఆర్‌ భరోసా దుస్థితి

నూజివీడు పట్టణానికి చెందిన మందపాటి గోపి 2020లో కిడ్నీ సమస్యతో చనిపోయారు. కుటుంబ సభ్యులు బీమాకు దరఖాస్తు చేశారు. వాలంటీర్లు అన్ని పత్రాలు తీసుకువెళ్లారు కానీ ఏళ్లు గడుస్తున్నా బీమా మాత్రం రాలేదు. ‘కుటుంబం దిక్కులేనిదైంది. పోషణ చాలా ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వ సాయం చేస్తుందని ఏళ్లుగా ఎదురు చూస్తున్నా ఫలితం లేదు’ అని గోపి భార్య వెంకటలక్ష్మి ఆవేదన  చెందారు.


జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఎం.వరలక్ష్మి 2022 జూన్‌ 1న గుండెపోటుతో చనిపోయారు. ఆమె వైఎస్‌ఆర్‌ బీమా పథకంలో సభ్యురాలు. మరణించిన కొద్ది రోజులకు రూ.10 వేలు మట్టి ఖర్చుల నిమిత్తం ఇచ్చారు. రెండేళ్లు కావస్తున్నా..ఇప్పటి వరకు మిగిలిన రూ.90 వేలు రాలేదు. అధికారులకు, టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసినా ఫలితం లేదు. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు ఓ కొడుకు ఉన్నారు. కూలి పనులు చేసుకుని పొట్ట నింపుకొంటున్నారు.

  • నరసాపురం మండలం లిఖితపూడికి చెందిన అడబాల కృష్ణ ఈ ఏడాది జనవరి 31న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో కుటుంబం పెద్ద దిక్కునే కాకుండా ఆధారాన్ని కూడా కోల్పోయింది. చనిపోయిన 15 రోజులకే ప్రభుత్వం నుంచి బీమా సొమ్ము రూ.5లక్షలు అందాల్సి ఉన్నా ఇప్పటికి రెండు నెలలైనా అందలేదు. దీంతో ఆ కుటుంబ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.
  • కైకలూరు మండలం సీతనపల్లికి చెందిన దండే సీమోను 2021 మార్చి 6న రహదారి ప్రమాదంలో చనిపోయారు. ఇప్పటికి మూడేళ్లు దాటినా కనీసం మట్టి ఖర్చులు కూడా రాలేదు. సిబ్బందిని అడుగుతుంటే అసలు మీ దరఖాస్తు మాకు అందలేదని చెబుతున్నారు. ‘బీమా నగదు వచ్చి ఉంటే అమ్మ అనారోగ్య సమస్యలకు ఆసరాగా ఉండేది. నేను చదువుకునే వాడిని. ఆర్థిక ఇబ్బందులతో చదువు మానేసి కూలి పనులకు వెళుతున్నా’ అంటూ సీమోను కొడుకు జయకుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదేనా చిత్త శుద్ధి.. ‘అనుకోని విపత్తుతో ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంటుంది. బీమా క్లెయిమ్‌ చేసిన 15 రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వం నేరుగా బీపీఎల్‌ కుటుంబానికి జమ చేస్తుంది’ అంటూ బాకాలూదిన జగన్‌ వైఎస్‌ఆర్‌ బీమా పథకం అమలులో చతికిల పడ్డారు. ఏళ్లు గడుస్తున్నా పరిహారం అందని దారుణ పరిస్థితులు కళ్లకు కడుతున్నాయి. కుటుంబ అండను కోల్పోయినా ప్రభుత్వం భరోసానిస్తుందనుకున్న నిరుపేదల ఆశయాలను చిదిమేసి జగన్‌ చిరునవ్వులు చిందిస్తున్నారు.

కోతలరాయుడు జగన్‌.. పరిహారం ఇవ్వకుండా తప్పించుకునేందుకు ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో 1.6 లక్షల కుటుంబాలకు అసలు బీమా పథకానికి అర్హత లేకుండా చేసింది. భీమవరం పట్టణంలో మట్టా శ్రీనివాస్‌(46) అనే వ్యక్తి రెండేళ్ల క్రితం గుండెపోటుతో చనిపోయారు. వారి బియ్యం కార్డు తీసుకుని కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసేందుకు వెళ్లగా మీ పేరు నమోదు చేయలేదని, పరిహారం రాదని అధికారులు చెప్పారు. ఇలా ఉమ్మడి జిల్లాలో వందలాది మంది పరిహారం పొందే అర్హత ఉన్నా ప్రభుత్వ వైఖరితో అవస్థలు పడుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో వైఎస్‌ఆర్‌ బీమా కోల్పోయిన కుటుంబాల వివరాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని