logo

సామాజిక సందేశం.. ఆకట్టుకునే కథాంశం!

యలమంచిలి మండలం కొంతేరులో యూత్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాటిక పోటీలు ఆద్యంతం ఆసక్తిగా సాగుతున్నాయి.

Published : 18 May 2024 04:23 IST

కొంతేరులో నాటికల ప్రదర్శన

కౌసల్య సుప్రజా రామ నాటికలో సన్నివేశం

పాలకొల్లు, న్యూస్‌టుడే: యలమంచిలి మండలం కొంతేరులో యూత్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాటిక పోటీలు ఆద్యంతం ఆసక్తిగా సాగుతున్నాయి. శుక్రవారం ప్రదర్శనల్లో సాయిఆర్ట్స్‌ కొలకలూరి వారి ‘కౌసల్యా సుప్రజా రామ’ మొదటి ప్రదర్శన, సుకృతి క్రియోషన్స్‌ చిలకలూరిపేట వారి ‘మిణుగురు వెలుగులు’ ద్వితీయ ప్రదర్శన ప్రేక్షకులను ఆలోచింపజేశాయి.

అమ్మ మనసు కథ

రామాయణంలో శ్రీరాముడు వనవాసానికి వెళ్తున్నపుడు కౌసల్య ఎంతో ఆవేదన చెందినా భర్త మాట ధిక్కరించలేక మౌనంగా ఉండిపోయినట్టే.. నేటి సమాజంలో ఎందరో తల్లులు తమ బిడ్డలను వదిలి ఉండలేక పోయినా వారి ప్రయోజనాల కోసం కాదనలేని పరిస్థితిని కళ్లకు కట్టినట్టు చూపించిన నాటిక ‘కౌసల్య సుప్రజా రామ’. కొందరు బిడ్డలు అమ్మలను అడ్డంగా భావించి వృద్ధాశ్రమాల్లో చేర్చినా మరికొందరు పిల్లలు తల్లులను వ్యతిరేకించి వేరు కాపురాలు పెట్టినా అమ్మ మనసు ఎల్లప్పుడూ సంతానం వెంటే ఉంటుందని కౌసల్య పాత్ర తెలియజేసింది.

యువత కోసం.. తెలిసీతెలియని వయసులో ప్రేమలో పడ్డ యువత విఫలమైతే క్షణికావేశంలో జీవితాలను నాశనం చేసుకున్న కథాంశంతో సాగిన మిణుగురు వెలుగులు నాటిక సామాజిక సందేశానిచ్చింది. ప్రేమకు ఆకర్షణకు మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోలేని యువత వారి జీవితాలను వారే నాశనం చేసుకుంటున్నారు. వారిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులను బతికుండగానే సజీవ సమాధులుగా ఎలా మారుస్తున్నారో తెలియజేసింది ఈ నాటిక.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని