logo

డ్రోన్ల నిబంధనలు కఠినం... అన్నదాతల్లో అయోమయం!

వ్యవసాయాన్ని యాంత్రీకరణ దిశగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే పొలంలో మందులు పిచికారీ చేసే డ్రోన్లను పరిచయం చేస్తున్నారు.

Updated : 31 Mar 2023 02:36 IST

ఇంటర్మీడియట్‌ చదువు, పాస్‌పోర్టు కలిగి ఉండాలట విభిన్న కొర్రీలతో ఆసక్తి చూపని రైతులు
న్యూస్‌టుడే, జమ్మలమడుగు, పెద్దముడియం, రాయచోటి

పెద్దముడియం మండలంలోని పంట పొలంలో మందు పిచికారీ చేస్తున్న డ్రోన్‌

వ్యవసాయాన్ని యాంత్రీకరణ దిశగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే పొలంలో మందులు పిచికారీ చేసే డ్రోన్లను పరిచయం చేస్తున్నారు. సాధారణ పిచికారీ యంత్రాలతో పోలిస్తే డ్రోన్లతో పురుగు మందులు పంటపై జల్లినపుడు 30 శాతం ఆదా అవుతుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. డ్రోన్ల వినియోగానికి సంబంధించి నిబంధనలు కఠినంగా ఉన్నందున రైతులు ఆసక్తి చూపడం లేదు. ఒక్కో మండలానికి మూడు డ్రోన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో బృందంలో అయిదుగురు సభ్యులుండాలి. వారిలో ఒకరు ఇంటర్మీడియట్‌ చదువుకుని ఉండడంతో పాటు పాస్‌పోర్టు కలిగి ఉండాలన్న నిబంధనతో రైతులు విస్మయానికి గురవుతున్నారు.

వ్యవసాయశాఖ రైతు సంఘాలకు అందించాలనుకుంటున్న ఒక్కో డ్రోన్‌ విలువ రూ.10 లక్షల వరకు ఉటుందని అధికారులు చెబుతున్నారు. రైతులు తమ వాటా చెల్లించిన అనంతరమే వాటిని కొనుగోలు చేస్తారు. అనంతరం ప్రభుత్వం రాయితీని రైతు సంఘాల ఖాతాకు జమ చేస్తోంది. రూ.10 లక్షల్లో 40 శాతం రాయితీ పోనూ మిగిలిన 60 శాతంలో 10 శాతం అన్నదాతలు చెల్లించాల్సి ఉంటుంది. 50 శాతాన్ని బ్యాంకుల ద్వారా రుణంగా పొందొచ్చు.

మండలానికి మూడు డ్రోన్లు

తొలి విడతలో ప్రతి మండలానికి మూడు చొప్పున పురుగు మందులను పిచికారీ చేసే డ్రోన్లను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వైయస్‌ఆర్‌ జిల్లాలో 36 మండలాలుండగా, సగం మంది కూడా ఆసక్తి చూపడం లేదు.బృందంలో అయిదుగురు సభ్యుల్లో ఒకరికి ఇంటర్మీడియట్‌ విద్యార్హతతోపాటు పాస్‌పోర్టు ఉండాలన్న నిబంధనే అందుకు కారణమని తెలుస్తోంది. ప్రొద్దుటూరు వ్యవసాయ డివిజన్‌లో ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పెద్దముడియం, మైలవరం మండలాలుండగా, ఇంతవరకు ప్రొద్దుటూరు, మైలవరం మండలాల్లో రెండేసి చొప్పున నాలుగు రైతు సంఘాలు ఏర్పడ్డాయి. 12 సంఘాలకుగానూ ఇంకా ఎనిమిది గ్రూపులు ఏర్పడాల్సి ఉంది.  అన్నమయ్య జిల్లాలో మందులు పిచికారీ చేసే డ్రోన్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే సాంకేతిక పరమైన శిక్షణకు ఎంపికైన వారికి ఆరు విడతల్లో శిక్షణనిచ్చినట్లు డీఏవో ఉమామహేశ్వరమ్మ పేర్కొన్నారు.

అధికారుల కసరత్తు...

ఎత్తు పెరిగే పంటలతో పాటు మొక్కజొన్న, ఉద్యాన పంటలు, వరి, తీగజాతికి చెందిన పంటలకు డ్రోన్ల ద్వారా పిచికారీ చేయడం లాభదాయకం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తూనే ఉన్నారు. గ్రామాల్లో అగ్రికల్చర్‌ డిప్లొమా, అగ్రికల్చర్‌ బీఎస్సీ, బీటెక్‌ చేసిన వారైనా సరే అలాంటి వారిని గుర్తించి సభ్యులుగా చేర్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని స్థానిక వ్యవసాయాధికారులకు ఆదేశాలందినట్లు సమాచారం.


అవగాహన కల్పిస్తున్నాం
- సురేష్‌రెడ్డి, ఏడీఏ, ప్రొద్దుటూరు వ్యవసాయ డివిజన్‌

డీజీసీఏ నిబంధనల ప్రకారమే డ్రోన్లు వినియోగించాలి. బృంద సభ్యుల్లో ఒకరికి పాస్‌పోర్టు కలిగి ఉండాలన్న నిబంధన పెట్టారు. ఇదే విషయంపై గ్రామాల్లో తిరిగి రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఇటీవల ప్రొద్దుటూరు మండలం కల్లూరులో సమావేశాన్ని నిర్వహించి డ్రోన్లపై డెమో ఇప్పించాం. మైలవరం మండలంలో ఎంపిక చేసిన ఒక బృందంలోని ఎం.కంభాలదిన్నె గ్రామానికి చెందిన సభ్యుడు ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని