logo

ఏం తమాషాగా ఉందా... ఏమనుకుంటున్నావ్‌?.. ఎమ్మెల్యే సమక్షంలోనే వైకాపా నేత బెదిరింపులు

‘అసలు నీవు ఏమనుకుంటున్నావ్‌. ఏం తమాషాగా ఉందా?. ఇక్కడ పనిచేయాల్సిన అవసరం లేదు. మండలం నుంచి ఎక్కడైనా వెళ్లిపో.

Updated : 02 Jul 2023 07:57 IST

మండలం నుంచి వెళ్లిపోవాలంటూ ఆర్‌బీకే ఇన్‌ఛార్జికి హెచ్చరికలు

తమ పంటను కొనుగోలు చేయలేదంటూ ఎమ్మెల్యే మేడాకు ఫిర్యాదు చేస్తున్న పసుపు రైతులు

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే : ‘అసలు నీవు ఏమనుకుంటున్నావ్‌. ఏం తమాషాగా ఉందా?. ఇక్కడ పనిచేయాల్సిన అవసరం లేదు. మండలం నుంచి ఎక్కడైనా వెళ్లిపో. మా వాళ్లు ఏమడిగినా చేయలేమని అంటున్నావ్‌. ఎందుకంత బలుపు’ అంటూ ఒంటిమిట్ట మండలం చింతరాజుపల్లె రైతు భరోసా కేంద్రం బాధ్యురాలు (గ్రామ ఉద్యాన సహాయకురాలు) పుష్పరాణి పట్ల ఓ కీలక నేత ముఖ్య అనుచరుడిగా అంతా తానై చెలామణి అవుతున్న ఓ నాయకుడు అనుచితంగా మాట్లాడారు. గ్రామంలో శనివారం ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే తిరిగి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పసుపు కొనుగోలు చేయడానికి పేర్లు నమోదు చేయలేదని రైతులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పసుపు పంటను కొనుగోలు చేయకుండా అన్యాయం చేశారంటూ గోడు వెళ్లబోసుకున్నారు. ‘సార్‌.. మా ఊర్లో గతేడాది ఖరీఫ్‌లో చాలామంది పసుపు సాగు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్మాలని నిర్ణయించాం. రైతు భరోసా కేంద్రంలో అందరి పేర్లు నమోదు చేయలేదు. కొందరి నుంచి మాత్రమే పంటను కొన్నారు. ఎక్కువ మందికి తీవ్ర అన్యాయం జరిగింది. ఇప్పటికే కొనుగోలు గడువు ముగిసింది. ఆర్‌బీకే సిబ్బంది ఎందుకిలా చేశారో అర్థం కావడం లేదు’ అని ఆక్రోశించారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ ఆర్‌బీకే ఇన్‌ఛార్జి పుష్పరాణి, ఏవో కిరణ్‌కుమార్‌రెడ్డిని పిలిపించారు. రైతులకు మేలు చేయాలని మిమ్మల్ని నియమించారని, మీరెందుకు అన్నదాతలకు అండగా ఉండడం లేదని ప్రశ్నించారు. ఆర్‌బీకే ఇన్‌ఛార్జి పుష్పరాణితో ఇక్కడ పనిచేయడం చేతకాకపోతే తక్షణమే వెళ్లిపోవాలని మండి పడ్డారు. ‘చింతరాజుపల్లె ఆర్‌బీకే పరిధిలో గతేడాది ఖరీఫ్‌లో ఎంతమంది పసుపు సాగు చేశారు. ఈ-పంట, సీఎం యాప్‌లో నమోదు, ఎంతమందికి కొంటామని సందేశం పంపించారు’ తదితర సమాచారాన్ని సాయంత్రం లోగా తన వాట్సప్‌ నంబరుకు పంపించాలని ఆదేశింంచారు. ఇంతలో సదరు నాయకుడు మధ్యలో జోక్యం చేసుకున్నారు. మండలంలో ఉండాలని ఉందా? లేదా? అంటూ గట్టిగా ఆమెను హెచ్చు స్వరంతో బెదిరించారు. అక్కడందరూ చూస్తుండగానే అసలు నువ్వు ఇక్కడ అవసరం లేదు. ఎక్కడైనా వెళ్లిపో అంటూ బెదిరింపు ధోరణితో హుకుం జారీ చేశారు. మా వాళ్ల పట్ల ఎందుకంత చిన్నచూపు అంటూ ఆమె పట్ల అనుచితంగా, అమర్యాదగా మాట్లాడుతూ హల్‌చల్‌ చేశారు. అక్కడే ఎమ్మెల్యే ఉన్నా దురుసుగా మాట్లాడిన నాయకుడిని కనీసం మందలించలేదు. బెదిరింపులతో ఆర్‌బీకే ఇన్‌ఛార్జి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని