logo

నేడు కడపలో వివేకా ఐదో వర్ధంతి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు గురై ఐదేళ్లు గడిచిపోయింది. ఇప్పటికీ హత్యకు అసలు కారకులెవరన్నదీ తేలకపోగా, న్యాయం దిశగా అడుగులు పడడంలేదు.

Published : 15 Mar 2024 04:31 IST

హాజరు కానున్న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల
వివిధ రాజకీయ పార్టీలను ఆహ్వానించిన సునీత

ఈనాడు, కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు గురై ఐదేళ్లు గడిచిపోయింది. ఇప్పటికీ హత్యకు అసలు కారకులెవరన్నదీ తేలకపోగా, న్యాయం దిశగా అడుగులు పడడంలేదు. ఈ నేపథ్యంలో కడపలో ఆయన కుమార్తె సునీత ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. నగరంలోని జయరాజ గార్డెన్స్‌లో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీల నేతలు,  వివేకా అభిమానులను సునీత ఆహ్వానించారు. కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షురాలు షర్మిల హాజరుకానున్నట్లు సమాచారం. షర్మిల, సునీత కార్యక్రమం వేదికగా చేసే ప్రసంగాలపై అందరూ ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. కార్యక్రమానికి వచ్చేవారితోనూ మాట్లాడించే అవకాశాన్ని కల్పించాలని భావిస్తున్నారు. హత్య జరిగి ఐదేళ్లు గడిచిపోగా, న్యాయం జరిగే విషయంలో అడుగులు వెనక్కే పడుతుండడంపై సునీతతో పాటు షర్మిల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల పలు సందర్భాల్లో బాబాయ్‌ను చంపిన హంతకులెవరంటూ షర్మిల ప్రశ్నించారు. దిల్లీ వేదికగా సునీత తీవ్ర స్వరంతో తన గళం వినిపించారు. తన తండ్రి వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు, వెలుగుచూసిన కుట్ర కోణాలు, అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు, బాధితులైన తమపైనే పోలీసులు ఎదురు కేసులు పెట్టడాన్ని ప్రజలకు వివరించాలని సునీత భావిస్తున్నారు. ఆత్మీయ సమావేశానికి సైతం కలిగిస్తున్న ఇబ్బందులపై వివేకా కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వేదికకు పులివెందులలో విజయ గార్డెన్స్‌ను ఎంపిక చేసి అద్దె సైతం చెల్లించారు. ఒప్పందం చేసుకున్నాక నిర్వాహకులు మాట మార్చి ఆ రోజు ఫంక్షన్‌ హాల్‌ ఖాళీ లేదంటూ వైకాపా నేతల ఒత్తిళ్లతో దాట వేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో సునీత ఆత్మీయ సమావేశం కడపకు మార్చు కున్నారు. ఇలాంటి ఇబ్బందులకు వెరవకుండా అడుగు ముందుకు వేయాలనే సంకల్పంతో పట్టుదలతో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల దిల్లీ వేదికగా సునీత మీడియా సమావేశం నిర్వహించి తన వాదన... వేదనను వెలిబుచ్చారు. రానున్న ఎన్నికలల్లో జగనన్నకు ఓటెయ్యద్దంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. రెండో అడుగుగా అత్మీయ సమావేశం పేరిట కార్యక్రమాన్ని తలపెట్టి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించాలని భావిస్తున్నారు. కార్యక్రమానికి ఉమ్మడి కడప జిల్లా నుంచి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, వివేకా అభిమానులు తరలివచ్చే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని