logo

బద్వేలులో వైకాపాకు భంగపాటు

సార్వత్రిక ఎన్నికల తరుణంలో బద్వేలు నియోజకవర్గ వైకాపాలో విభేదాలు రోడ్డెక్కాయి.

Published : 23 Apr 2024 05:30 IST

నామినేషన్‌ పర్వంలో ఆధిపత్య పోరు
ఈనాడు, కడప

ర్యాలీ ఆగిపోవడంతో ఎండలోనే నిలబడ్డ ఎమ్మెల్యే డాక్టర్‌ సుధ

సార్వత్రిక ఎన్నికల తరుణంలో బద్వేలు నియోజకవర్గ వైకాపాలో విభేదాలు రోడ్డెక్కాయి. ఇద్దరు కీలక నేతల మధ్య పోరు దళిత మహిళ, వైకాపా అభ్యర్థి డాక్టర్‌ దాసరి సుధ మండుటెండలో రెండు గంటల పాటు రోడ్డుపైనే నిలబడాల్సి వచ్చింది. అభ్యర్థి పరిస్థితి చూసి నామినేషన్‌ సందర్భంగా జరిగిన ర్యాలీకి వచ్చినవారంతా జాలిపడ్డారు. ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డికి, ఆయన బావమరిది, నియోజకవర్గ వైకాపా అదనపు సమన్వయకర్త విశ్వనాథరెడ్డి మధ్య తీవ్ర విభేదాలున్నాయి. బద్వేలులో జరిగిన నామినేషన్‌ కార్యక్రమానికి విశ్వనాథరెడ్డి పాల్గొనడంతో ఆయన్ను చూసి అక్కడి నుంచి ఎమ్మెల్సీ ఆగ్రహంతో పురపాలక సంఘం కార్యాలయంలోకి వెళ్లిపోయారు. మరికొంత సమయానికి విశ్వనాథరెడ్డి సైతం ర్యాలీ నుంచి నిష్క్రమించారు. నామినేషన్‌ ర్యాలీ ప్రారంభ కార్యక్రమానికి ఎంపీ అవినాష్‌రెడ్డి, జిల్లా వైకాపా అధ్యక్షుడు సురేష్‌బాబు హాజరై తిరిగి వెళ్లిపోయారు. వారు వెళ్లిన తర్వాత జరిగిన ఘటనను తెలుసుకున్న ఎంపీ ఫోన్‌లో ఇద్దరికి నచ్చచెప్పే ప్రయత్నం సఫలమైంది. ఈ తతంగం పూర్తయ్యేవరకు ఎమ్మెల్యే సుధ రహదారిపై ఎండలోనే నిలబడాల్సి వచ్చింది. వైకాపాలో ఇద్దరు నేతల మధ్య ఎమ్మెల్యే నలిగిపోతున్నారు. ఎవరిమాట వినాలో.. ఎవరితో ఎన్నికల ప్రచారానికి వెళ్లాలో అర్థం కాక సతమతమవుతున్నారు. ఈ వ్యవహారం నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని