logo

జగన్‌ ఝలక్‌... కరెంట్‌ షాక్‌!

వైకాపా పాలనలో విద్యుత్తు నియంత్రికలు, సామగ్రికి ధరాఘాతం తప్పడం లేదు. అస్మదీయులకు ఆయాచితంగా లబ్ధి కలిగించాలని ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

Updated : 28 Apr 2024 06:10 IST

విద్యుత్తు నియంత్రికలు, ఇతర సామగ్రిపై ధరల పిడుగు
వైకాపా ప్రభుత్వంలో వినియోగదారుల నిలువు దోపిడీ
అస్మదీయుల తయారీ సంస్థలకు ఆయాచితంగా లబ్ధి
న్యూస్‌టుడే, కడప

వైకాపా పాలనలో విద్యుత్తు నియంత్రికలు, సామగ్రికి ధరాఘాతం తప్పడం లేదు. అస్మదీయులకు ఆయాచితంగా లబ్ధి కలిగించాలని ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. నియంత్రికలు, సామగ్రి తయారు చేస్తున్న సంస్థలు, సరఫరాదారులకు మేలు చేకూర్చేవిధంగా సీఎం జగన్‌ ఏలుబడిలో పెద్దలు కీలక నిర్ణయం తీసుకుని వినియోగదారులకు భారీ షాక్‌ ఇచ్చారు. ఆమాంతం ధరలను పెంచేయడంతో వినియోగదారులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా అదనపు భారం పడుతోంది. అడ్డుఅదుపు లేకుండా ధరలు పెరుగుతున్నా మేమింతే అన్నట్లు పాలకులు వ్యవహరిస్తున్నారు.

క్షిణ ప్రాంత విద్యుత్తు సరఫరా సంస్థ (ఎస్పీడీసీఎల్‌) పరిధిలో 25 కేవీ సామర్థ్యం ఉన్న నియంత్రిక ధర గత ప్రభుత్వ హయాంలో రూ.61,216 ఉండేది. వైకాపా అధికారంలోకి వచ్చిన అనంతరం 2022,  డిసెంబరు నాటికి రూ.1,39,999కు పెంచారు. ప్రస్తుతం పన్నులతో కలిపి రూ.1.68 లక్షలు పలుకుతోంది. ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా ఉన్న తయారీ సంస్థల యాజమానులకు మేలు చేయాలని ధరలను పెంపునకు అనుమతిచ్చారు. సామగ్రి ధరలను నానాటికీ మరింత ఖరీదు కావడంతో కొనుగోలుదారులు వామ్మో ఇదేం వడ్డన అంటూ అదిరిపడుతున్నారు. అదే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో నియంత్రిక ధర రూ.లక్ష లోపే పలుకుతోంది. అదే మన రాష్ట్రంలో చూస్తే ఆకాశమే హద్దుగా పెంచేస్తున్నారు సామగ్రి అవసరమైనవారికి చుక్కలు చూపిస్తున్నారు. విద్యుత్తు సామగ్రి ధరలు సైతం కొండెక్కి కూర్చోవడంతో అవసరమైన వారు కొనాలంటే ఇబ్బందులు పడుతున్నారు. వెలుగుదివ్వె సరఫరాకు వినియోగించే అల్యూమినియం తీగల ధరలకు రెక్కలొచ్చాయి. 8, 9.1, 11 మీటర్ల పొడవు ఉన్న సిమెంటు స్తంభాలు, డిస్కలు, ఇన్సులేటర్లు, జి.ఐ ఎర్త్‌ పైపులు, ఎ.బి.స్విచ్‌లు ఇలా అన్ని రకాల పరికరాలు, సామగ్రిపై వడ్డించారు. వీటిని ఎస్పీడీసీఎల్‌ అధికారులు ప్రైవేటు కంపెనీల నుంచి కొనుగోలు చేస్తున్నారు. గతంలో ఎన్నలేనంతంగా ఇబ్బడిముబ్బడిగా ధరలు పెంచేసి దోపిడీ చేస్తున్నారు.

ప్రాధాన్యం గాలికొదిలేశారు...

వ్యవసాయ సర్వీసు కావాలని రైతులు కొత్తగా దరఖాస్తు చేస్తున్నారు. విద్యుత్తు మోటారు 10 అశ్వశక్తి సామర్థ్యం ఏర్పాటు చేసుకోవాలంటే రూ.12,400 చెల్లించాల్సి ఉంది. విద్యుత్తు నియంత్రిక 25 కేవీ, మూడు స్తంభాలు, 180 మీటర్ల పొడవున మూడు వరుసల తీగలు ఇవ్వాలి. ఈ తర్వాత ప్రధాన లైను నుంచి పంపుసెట్టు దూరంగా ఉంటే అదనంగా అన్నదాతలు భరించాలి. ఈ భారం కర్షకుల నెత్తిపైన పడుతోంది. మరోవైపు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వెంటనే పరిశీలించి నిర్ణీత రుసుం చెల్లించాలని సమాచారమివ్వాలి. డబ్బులు చెల్లించిన తర్వాత ప్రాధాన్యత క్రమం (సీనియార్టీ)ని పరిగణనలోకి తీసుకొని కనెక్షన్లు మంజూరు చేయాలని ఎస్పీడీసీఎల్‌ నిబంధనలను చెబుతున్నాయి. ఇక్కడ ఇవేమి అమలు కావడం లేదు. పలుకుబడి ఉన్న వారికి శరవేగంగా పనులు చేస్తుండగా, ఎలాంటి పరపతి లేకుండా, పైరవీలు చేయలేని వారంతా ఎదురుచూడాల్సి వస్తోంది. ప్రాధాన్యం అమలు చేయకుండా గాలికొదిలేశారు.


విపత్తులొస్తే కాసుల పంట

ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు విద్యుత్తు సరఫరా వ్యవస్థకు అపార నష్టం జరుగుతోంది. భారీ వర్షాలు కురిసి వరదలొచ్చినా, బలమైన ఈదురుగాలులతో స్తంభాలు విరిగి కూలిపోతున్నాయి. తీగలు చెల్లాచెదురుగా పడిపోతున్నాయి. నియంత్రికలు కిందపడి దెబ్బతింటున్నాయి. పునరుద్ధరణ పనుల్లో జాప్యం జరుగుతోంది. మరమ్మతులు అత్యవసరంగా చేయాలని అడుగుతున్న రైతుల నుంచి అదనంగా వసూళ్ల పర్వం సాగుతోంది. డబ్బులివ్వకపోతే ఆలస్యం చేస్తున్నారు. ఇటీవల విద్యుత్తు చోరీలు క్రమేణా పెరుగుతూ వస్తున్నాయి. నియంత్రికలను ధ్వంసం చేస్తున్న దొంగలు అందులోని సామగ్రిని పట్టుకెళ్లుతున్నారు. పోలీసు కేసు నమోదు చేయడంతో ఆలస్యం జరుగుతోంది. ఎఫ్‌ఐఆర్‌ పత్రం లేనిదే కొత్తగా మంజూరు చేయడం లేదు. పైగా రెండు, మూడు నెలల పాటు నిరీక్షణ చేస్తేగానీ సరఫరా చేయడం లేదు. విపత్తులు వస్తే అధికార యంత్రాంగానికి కాసుల పంట పండుతోంది. ఎస్పీడీసీఎల్‌ యంత్రాంగం చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల సిఫార్సులకు పెద్దపీట వేస్తున్నారు.

ఉమ్మడి కడప జిల్లాలో....

విద్యుత్తు సర్వీసులు : 12,47,277
ఫీడర్లు : 1,070
వ్యవసాయ కనెక్షన్లు : 1,88,837
ఫీడర్లు  : 853

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని