logo

కడప కార్పొరేటర్లపై వైకాపాకు అనుమానాలు!

కడప నగర కార్పొరేటర్లపై వైకాపా అభ్యర్థి అంజాద్‌బాషాకు అనుమానాలు వెంటాడుతున్నాయి. తన గెలుపునకు అంకితభావంతో సహాయపడడంలేదనే సంకోచంతో తరచూ వారితో భేటీకి ప్రయత్నిస్తున్నారు.

Updated : 29 Apr 2024 09:02 IST

శనివారం రాత్రి రహస్య సమావేశం
శాంతపరిచేందుకు విశ్వప్రయత్నాలు

బ్రదర్‌ అనిల్‌కుమార్‌తో భేటీ అయిన అఫ్జల్‌ అలీఖాన్‌

ఈనాడు, కడప: కడప నగర కార్పొరేటర్లపై వైకాపా అభ్యర్థి అంజాద్‌బాషాకు అనుమానాలు వెంటాడుతున్నాయి. తన గెలుపునకు అంకితభావంతో సహాయపడడంలేదనే సంకోచంతో తరచూ వారితో భేటీకి ప్రయత్నిస్తున్నారు. నగరంలో 50 డివిజన్లు ఉండగా వీటిలో 49 స్థానాలను వైకాపా గెలుచుకుంది. వీరిలో చాలామందికి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉపముఖ్యమంత్రికి పొసగడం లేదనే ప్రచారం జరుగుతోంది. అభివృద్ధి పనులు, వాటి కేటాయింపులు, కమీషన్ల వ్యవహారంలో తేడాలున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారం ఎన్నికలు వరకు వచ్చేసరికి ముదిరి పాకానపడినట్లు సమాచారం. తెదేపా, వైకాపా అభ్యర్థులు నామినేషన్లను ఈ నెల 24న ఒకేసారి దాఖలు చేయగా తెదేపా అభ్యర్థి మాధవి ర్యాలీకి భారీగా జనం తరలివచ్చారు. అదే ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా ర్యాలీకి ఆశించినంతగా జనం రాలేదు. దీంతో కార్పొరేటర్లపై అంజాద్‌బాషాకు అనుమానాలు తలెత్తాయి. కార్పొరేటర్లు చాలామంది సహాయ నిరాకరణతోనే నామినేషన్‌ కార్యక్రమానికి జనం హాజరు కాలేదనే అంచనాకు వస్తున్నారు. కొందరు కార్పొరేటర్లు తెదేపాతో సంబంధాలు నెరుపుతున్నారనే అనుమానాలు వైకాపా నేతలను వెంటాడుతున్నాయి. దీంతో శనివారం రాత్రి కార్పొరేటర్లతో అత్యవసర సమావేశం నిర్వహించి వారిని శాంతపర్చే ప్రయత్నాలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. కొందరికైతే ఖర్చుల కింద కొంత నగదు సైతం అందజేసినట్లు సమాచారం. అందరూ వైకాపా అభ్యర్థి గెలుపునకు కృషిచేయాలని జిల్లాకు చెందిన కీలక నేత కార్పొరేటర్లకు మరింత నొక్కి చెప్పినట్లు తెలిసింది. చాలామంది సరేనంటూ నిష్ఠూరంగా ఊకొట్టినట్లు సొంత పార్టీ నేతలో ప్రచారం చేస్తున్నారు.

అఫ్జల్‌ అలీఖాన్‌ నామినేషన్‌ తిరస్కృతికి విశ్వప్రయత్నాలు...

వైకాపా కీలక నేత అఫ్జల్‌ అలీఖాన్‌ ఆ పార్టీకి రాజీనామా చేసి ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషాపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. పార్టీ తనకు అన్ని రకాలుగా మోసం చేసిందంటూ విమర్శలు గుప్పించారు. పార్టీ నుంచి బయటకు వెళ్లే వరకు పెద్దగా అందోళన పడని వైకాపా... కాంగ్రెస్‌ అభ్యర్థిగా రంగంలోకి దిగడంతో షాక్‌కు లోనైంది. తమ పార్టీ ఓట్లకు గండి కొట్టేస్తారనే ఆందోళనతో అఫ్జల్‌ అలీఖాన్‌ దాఖలు చేసిన నామినేషన్‌ను ఏదో కారణంతో తిరస్కరణకు విశ్వప్రయత్నాలు సాగించినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వంలో కీలక వ్యక్తులు అధికారులపై ఒత్తిడి చేసి పలు రకాలుగా ప్రయత్నం చేయగా, అఫ్జల్‌ అలీఖాన్‌ విషయం తెలుసుకుని తీవ్రంగా పట్టుబట్టడంతో అధికారులు వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఇదే సమయంలో తెదేపా అభ్యర్థి మాధవి పేరుతో ఉన్న మరో మహిళతో నామినేషన్‌ వేయించగా సక్రమంగా లేకపోవడంతో తిరస్కరణకు గురికావడం వైకాపాకు మింగుడు పడడంలేదు. అఫ్జల్‌ అలీఖాన్‌ పోటీలో ఉండడం రుచించని వైకాపా నేతలు... ఒకింత ఆందోళనతో దిగులు చెందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ అభ్యర్థి వేగంగా పావులు కదుపుతూ పార్టీలోకి చేరికలకు ప్రయత్నాలు చేస్తున్నారు. రామకృష్ణ నగర్‌లో పలువురిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తన గెలుపునకు మద్దతు కోరుతూ అఫ్జల్‌ అలీఖాన్‌ ఆదివారం పీసీసీ అధ్యక్షురాలు, కడప ఎంపీ అభ్యర్థి షర్మిల భర్త బ్రదర్‌ అనిల్‌కుమార్‌ను కలిశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని