logo

Crime News: ఇంటిని విక్రయించమంటే తాకట్టు

అమ్మిపెట్టమని అప్పగించిన ఇంటిని తాకట్టు పెట్టి రూ.6 లక్షలతో ఉడాయించిన ఇద్దరు మోసగాళ్లను చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ కె.ఎన్‌.ప్రసాద్‌వర్మ కథనం ప్రకారం.. చాంద్రాయణగుట్టకు

Updated : 04 Jan 2022 07:49 IST

ఇద్దరి రిమాండ్‌, రూ. 6 లక్షలు స్వాధీనం

కేశవగిరి, న్యూస్‌టుడే: అమ్మిపెట్టమని అప్పగించిన ఇంటిని తాకట్టు పెట్టి రూ.6 లక్షలతో ఉడాయించిన ఇద్దరు మోసగాళ్లను చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ కె.ఎన్‌.ప్రసాద్‌వర్మ కథనం ప్రకారం.. చాంద్రాయణగుట్టకు చెందిన మహ్మద్‌ అఫ్సర్‌ హుస్సేన్‌(67) సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నాడు. గతేడాది సెప్టెంబరు 26న బండ్లగూడ కింగ్స్‌ అవెన్యూలో ఇల్లు లీజుకు ఉందంటూ ప్రకటన చూసి, అది ఇచ్చిన ఆబిద్‌, సత్తార్‌లను సంప్రదించాడు. వారిద్దరూ రూ.6 లక్షలకు ఇంటిని అఫ్సర్‌ వద్ద తాకట్టు పెట్టారు. నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి, రెండు నెలల తరువాత డబ్బు చెల్లిస్తే ఇంటిని ఖాళీచేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. వెంటనే అఫ్సర్‌ తన కుటుంబంతో సదరు ఇంట్లోకి మకాం మార్చాడు. అసలు యజమాని మహ్మద్‌ రఫతుల్లాఖాన్‌ వచ్చి నిలదీసి ఖాళీ చేయించాడు. దీంతో అఫ్సర్‌ ఫిర్యాదు మేరకు గతేడాది అక్టోబరు 12న చాంద్రాయణగుట్ట ఠాణాలో కేసు నమోదైంది. దక్షిణ మండలం అదనపు డీసీపీ సయ్యద్‌ రఫీక్‌ నేతృత్వంలో ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్‌ మజీద్‌ ఆధ్వర్యంలో సీఐ కె.ఎన్‌.ప్రసాద్‌వర్మ, ఎస్సై జె.శ్రీను కేసును దర్యాప్తు చేసి గుట్టు రట్టు చేశారు.

బామ్మర్దికి చెబితే..

రఫతుల్లాఖాన్‌ తన ఇంటిని అమ్మాలంటూ బామ్మర్ది అఫ్జల్‌ను కోరాడు. అతడు ఈ బాధ్యతను చాంద్రాయణగుట్టకు చెందిన ఆబిద్‌ కసాది(38), మొఘల్‌పురకు చెందిన అబ్దుల్‌సత్తార్‌ అలియాస్‌ కోరమ్‌(35)కు అప్పగించాడు. ఇంటి తాళాలు కూడా ముట్టచెప్పాడు. దీంతో వీరు అఫ్సర్‌ హుస్సేన్‌ను మోసగించి, ఆబిద్‌ రూ.5 లక్షలు, సత్తార్‌ లక్షతో ఉడాయించారు. వీరిని సోమవారం అరెస్టు చేసి రిమాండుకు తరలించి, రూ.6 లక్షలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని