logo

Kavitha: బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్‌.. రైల్‌ రోకో వాయిదా: ఎమ్మెల్సీ కవిత

Eenadu icon
By Telangana Dist. Team Updated : 11 Jul 2025 19:34 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

హైదరాబాద్‌: బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్‌ తీసుకొస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని తెలంగాణ బీసీ బిడ్డలు, జాగృతి విజయంగా భావిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత (Kavitha) అన్నారు. ప్రజా ఉద్యమాల ద్వారా ఒత్తిడి తేవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. అంతకుముందు బంజారాహిల్స్‌లోని తన నివాసం నుంచి జాగృతి శ్రేణులతో ర్యాలీగా లోయర్‌ ట్యాంక్‌బండ్‌కు వెళ్లారు. అక్కడ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఆమె నివాళులర్పించారు.

‘‘స్థానిక ఎన్నికలకు ముందే 42 శాతం బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్‌ తీసుకొస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో ఈనెల 17న చేపట్టిన రైల్‌ రోకో కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నాం. అయితే మాకు కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. ఆర్డినెన్స్‌ ఇచ్చి వెంటనే రిజర్వేషన్లు అమలు చేయగలిగితే అధికారంలోకి వచ్చిన 18 నెలలు ఎందుకు ఆగారు? రాజకీయ లబ్ధి కోసమే అలా చేశారని మేం భావిస్తున్నాం. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే రిజర్వేషన్ల చుట్టూ రాజకీయాలు చేస్తున్నారు. 

ఎన్నికల హామీలు అమలు చేయకపోవడంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఇబ్బంది పడుతున్నారు. రాజ్యాంగ సవరణ జరిగితే బీసీలకు రాజకీయంగా హక్కులు లభిస్తాయి. విద్య, ఉద్యోగాల గురించి కూడా ప్రభుత్వం చెప్పాలి. కేంద్రంలో అధికారంలో ఉన్నందున భాజపా అనుకుంటే ఒకే ఒక్క నిమిషంలో రాజ్యాంగ సవరణ చేసి ఇవ్వగలదు.. కానీ ఇవ్వడం లేదు. దోషమంతా కాంగ్రెస్‌పై నెట్టి తప్పించుకోవాలని చూస్తున్నారేమో. ప్రజలు గమనిస్తున్నారు. బీసీ బిల్లును షెడ్యూల్‌-9లో పెట్టాలి. దీనికోసం బీసీ బిడ్డ, కేంద్రమంత్రి బండి సంజయ్‌ చొరవ తీసుకోవాలి. ఆర్డినెన్స్‌ తీసుకొస్తామని చెప్పినందున ఈ వారం రోజులు ప్రభుత్వ కార్యాచరణను గమనిస్తాం. దీనిపై ముందుకెళ్లకపోతే రైల్‌ రోకో చేపడతాం’’ అని కవిత అన్నారు.


Tags :
Published : 11 Jul 2025 14:51 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు