ఓటర్ల విజ్ఞతకు పరీక్ష

ఎకాయెకి 97 కోట్ల ఓటర్లకు ఆలవాలమైన భారతావనిలో ఎన్నికల జాతర మొదలయ్యింది. వీలైనంత ఎక్కువగా ఓట్లను ఒడిసిపట్టేందుకు ప్రజలపై పార్టీలన్నీ వరాల జల్లులు కురిపిస్తున్నాయి. ఆ వాగ్దానాల మంచి చెడుల సంగతి అలా ఉంచితే- వాస్తవానికి పాలకుల నుంచి ప్రజలు ఆశించేదేమిటి? తాము హుందాగా, గౌరవంగా జీవించేలా మేలిమి విధానాలను ప్రభుత్వాలు రూపొందించాలనీ దుర్విచక్షణలకు తావులేని ప్రజాస్వామ్య పాలనను అందించాలని ప్రజానీకం అభిలషిస్తుంది!

Published : 18 Apr 2024 00:19 IST

ఎకాయెకి 97 కోట్ల ఓటర్లకు ఆలవాలమైన భారతావనిలో ఎన్నికల జాతర మొదలయ్యింది. వీలైనంత ఎక్కువగా ఓట్లను ఒడిసిపట్టేందుకు ప్రజలపై పార్టీలన్నీ వరాల జల్లులు కురిపిస్తున్నాయి. ఆ వాగ్దానాల మంచి చెడుల సంగతి అలా ఉంచితే- వాస్తవానికి పాలకుల నుంచి ప్రజలు ఆశించేదేమిటి? తాము హుందాగా, గౌరవంగా జీవించేలా మేలిమి విధానాలను ప్రభుత్వాలు రూపొందించాలనీ దుర్విచక్షణలకు తావులేని ప్రజాస్వామ్య పాలనను అందించాలని ప్రజానీకం అభిలషిస్తుంది! ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారతంలో 17 సార్వత్రిక ఎన్నికల తరవాత ప్రజాకాంక్షలు ఎంతవరకు నెరవేరాయి? జనాభాలో 50శాతానికి పైగా యువతతో ఉత్సాహం ఉరకలేస్తున్న దేశం మనది. నవతరాన్ని నిపుణ శ్రామిక శక్తిగా తీర్చిదిద్దడంలో దేశీయంగా అంతులేని అలక్ష్యమే రాజ్యమేలుతోంది. దేశవ్యాప్తంగా నిరుద్యోగుల్లో 83శాతం యువతేనంటూ ఇటీవల అంతర్జాతీయ శ్రామిక సంస్థ (ఐఎల్‌ఓ) చేదు వాస్తవాన్ని వెల్లడించింది. ఇండియాలో ఉపాధి రహిత వృద్ధి దౌర్భాగ్యాన్ని ఆ నివేదిక కళ్లకు కట్టింది. దేశంలో ఏటా 1.20 కోట్ల మంది పట్టభద్రులవుతుంటే- వారిలో ఉద్యోగార్హతలు ఉంటున్నవారి సంఖ్య మూడో వంతుకు మించడంలేదు. పరిశ్రమ అవసరాలకు, తరగతి గది బోధనకు మధ్య నెలకొన్న అంతరాలకు ప్రబల తార్కాణమిది. ఇంకోపక్క చుక్కలనంటుతున్న నిత్యావసరాల ధరలతో ఇంటి బడ్జెట్లు తలకిందులవుతుంటే సామాన్యులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ధరల కముకు దెబ్బలతో భారత్‌లో నికర ఆర్థిక పొదుపు నాలుగున్నర దశాబ్దాల వ్యవధిలో కనిష్ఠంగా అయిదు శాతానికి తెగ్గోసుకుపోయినట్లు ఇటీవల మోతీలాల్‌ ఓస్వాల్‌ సంస్థ అధ్యయనం వెల్లడించింది. రాబడికి ఖర్చులకు లంగరందక కుటుంబాల రుణభారం జీడీపీలో 40శాతానికి ఎగబాకింది. మరోవైపు ఆరుగాలం కష్టించే రైతులకు సరైన మద్దతు ధర ఎండమావినే తలపిస్తోంది. ఇలాంటివన్నీ ఎన్నికల్లో అభ్యర్థుల జయాపజయాలను నిర్ణయిస్తాయన్నది కాదనలేని సత్యం.

సమీప భవిష్యత్తులోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరిస్తుందని కేంద్రం పదే పదే వల్లెవేస్తోంది. అయితే, తలసరి ఆదాయం పరంగా 2022-23లో 189 దేశాల సరసన ఇండియా 147వ స్థానంలో నిలిచింది. ఆక్స్‌ఫామ్‌ నివేదిక ప్రకారం దేశ సంపదలో 40శాతం- అపర కుబేరులైన ఒక్కశాతం జనాభా దగ్గరే పోగుపడింది. కొందరి సంపద దేశప్రజలందరి కలిమి ఎలా అవుతుంది? ఆదేశిక సూత్రాల ప్రకారం- పౌరుల పౌష్టికాహార స్థాయి, జీవన ప్రమాణాలు, ప్రజారోగ్యం మెరుగుదల వంటివి ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. సరైన పోషకాహారానికి నోచుకోక దేశీయంగా ఏటా 17 లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. రాష్ట్రాలు తమ బడ్జెట్లలో కనీసం ఎనిమిది శాతాన్ని ప్రజారోగ్య కార్యక్రమాలకు ప్రత్యేకించాలని జాతీయ ఆరోగ్య విధానం నిర్దేశిస్తోంది. వాస్తవంలో అది పగటికలగానే మిగులుతోంది. అనుకోని అనారోగ్యం తలెత్తినప్పుడు వైద్య వ్యయభారాల ధాటికి సర్వం కోల్పోయి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. గడచిన తొమ్మిదేళ్లలో దేశీయంగా దాదాపు 25 కోట్ల మంది బహుముఖ పేదరికం నుంచి బయటపడినట్లు ఇటీవల నీతిఆయోగ్‌ వెల్లడించింది. 2014-22 మధ్య ప్రజల వినియోగ వ్యయంపై సర్వేలకే దిక్కులేనప్పుడు పేదరికం తగ్గినట్లు శాస్త్రీయంగా ఎలా నిర్ధారిస్తారు? పైగా, దారిద్య్రం గణనీయంగా తగ్గినప్పుడు 81 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు ఎందుకు అందిస్తున్నట్లో సర్కారే సెలవియ్యాలి. ప్రజల దీర్ఘకాలిక శ్రేయస్సుపై దృష్టిపెట్టని జగన్‌ పాలనలో ఏపీలో జన జీవితాలు పెను కడగండ్లలోకి జారిపోయాయి. జగన్‌ ఏలుబడిలో పరిశ్రమలు కరవై, ఉపాధి దూరమై నిరుద్యోగ యువత నిరాశలో కూరుకుపోయింది. సమ్మిళిత సుస్థిరాభివృద్ధికి అర్థం తెలియని జగన్‌లాంటి వివేకశూన్యుల దుశ్చేష్టలే దేశ సౌభాగ్యాన్ని కబళిస్తున్నాయి!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.