జగన్‌ రాజేసిన రుణకాష్ఠం!

ఆసుపత్రిలో అప్పుడే కన్నుతెరిచి క్యేర్‌ మనే పసివాడు కూడా అవినీతి చక్రవర్తి జగన్‌ తన నెత్తిమీద రుణభారాన్ని రూ.2.04లక్షలకు పెంచాడని తెలిస్తే బావురుమంటాడు.

Published : 19 Apr 2024 01:23 IST

సుపత్రిలో అప్పుడే కన్నుతెరిచి క్యేర్‌ మనే పసివాడు కూడా అవినీతి చక్రవర్తి జగన్‌ తన నెత్తిమీద రుణభారాన్ని రూ.2.04లక్షలకు పెంచాడని తెలిస్తే బావురుమంటాడు. ద్రవ్య బాధ్యత లేని ఆర్థిక ఉగ్రవాది ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం రుణాల ఊబిలో ఎంతగా కూరుకుపోతుందో జగన్‌ తన పాలనకాలంలో సోదాహరణంగా నిరూపించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలు అవసరమా అంటూ ఆంధ్రుల ఆశల సౌధాన్ని నేలమట్టం చేసిన ఫ్యాక్షనిస్టు- రాష్ట్రంపై అప్పుల భారాన్ని ఏకంగా రూ.11లక్షల కోట్లు దాటించేశారు. ‘ప్రతినెలా పన్నులు, పన్నేతర రాబడులు, కేంద్రం నుంచి రుణాలు, ఇతర రాబడులు, రాబడి లోటు, ద్రవ్యలోటు, ప్రణాళిక ప్రణాళికేతర వ్యయం వంటివన్నీ ఎప్పటికప్పుడు వెబ్‌సైట్లో ఉంచాల్సిందే’నని విపక్ష నేతగా సుద్దులు చెప్పింది జగనే. ప్రభుత్వ గ్యారంటీల ద్వారా ఎంత రుణం తెచ్చారు, ఎంత తీర్చారు, ఎంత వినియోగించారన్న వివరాలు తాము కోరినా ఇవ్వడం లేదని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) ఆక్షేపించినా దులిపేసుకొంటోందీ ఆయన ప్రభుత్వమే! మొన్న మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 340 రోజులపాటు రిజర్వ్‌బ్యాంకు నుంచి చేబదుళ్ల రూపేణా తెచ్చింది రూ.లక్షా 18వేల కోట్ల పైచిలుకు! బహిరంగ రుణాలు మరో రూ.68,400 కోట్లు! ద్రవ్య బాధ్యత బడ్జెట్‌ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) చట్ట నిబంధనల్ని ఉల్లంఘించి నిరుడు ఒక్క ఏడాదే రూ.2.19 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నడిపించింది జగన్‌ సర్కారు! వచ్చే ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్‌ నాలుగో తేదీ లోగా రూ.20వేల కోట్ల రుణ ప్రణాళికకు మొహరు వేయించుకొన్న జగన్‌- ఈ నెలలోనే రూ.13వేల కోట్లు సేకరించనున్నారు. కొత్తగా ఏర్పడే ప్రభుత్వం ఏడాదంతా వినియోగించుకోగల రుణ వసతిలో మూడోవంతును తానే బిగపట్టి ఎన్నికల్లో లబ్ధికి మళ్ళించే క్షుద్ర రాజకీయమూ ఇందులో ఉంది. 2024-25లో అప్పుల అసలు వడ్డీ చెల్లింపుల భారమే రూ.53,230 కోట్లు అంటే, జగన్‌ రాజేసిన రుణకాష్ఠం రాష్ట్ర ప్రయోజనాల్ని ఎంతగా దహిస్తోందో గ్రహించాలి!

చేసిన అప్పులు మునుముందు తిప్పలుగా మారకూడదంటే శాస్త్రీయంగా రాష్ట్ర భవిష్యత్‌ నిర్మాణానికి మూలధన వ్యయంగా రుణాలను మళ్ళించాలి. దూకుడుగా దారుణాలకు తెగబడటమే కాని, దార్శనికత మచ్చుకైనా లేని జగన్‌- పోలవరం కట్టిందీ లేదు, కనీసం కొట్టుకుపోయిన ప్రాజెక్టుల గేట్లు పెట్టిందీ లేదు; భారీ పరిశ్రమల ఊసు లేదు, రాష్ట్ర ప్రగతిపై ధ్యాసా లేదు. నవరత్నాలంటూ తాను నెత్తికెత్తుకొన్న నత్తగుల్లల్నీ లబ్ధిదారులకు సక్రమంగా చేర్చని జగన్‌- అడ్డగోలుగా దూసి తెచ్చిన రూ.5లక్షల కోట్ల రుణాల్ని ఏం చేశారోగాని, మరో రూ.1.5లక్షల కోట్ల బిల్లుల బకాయిల్ని పేరపెట్టారు. ఇష్టారాజ్యంగా అప్పులు చేసి వాటిని ప్రజల మీద రుద్దిపోవడానికి ఈ రాష్ట్రం ఎవడబ్బ జాగీరూ కాదు! 2021-22 నుంచి 2030-31 కాలంలో ఏపీ ఎకాయెకి రూ.3.48లక్షల కోట్ల రుణాల్ని తీర్చాల్సి ఉంటుందని కాగ్‌ స్పష్టీకరించింది. గుట్టుగా వివిధ కార్పొరేషన్ల ద్వారా సేకరించిన అప్పులు, పెండింగ్‌లో పెట్టిన బిల్లుల భారం మొత్తం కలిపితే వచ్చే అయిదేళ్లలో ఏడాదికి రూ.90 వేల కోట్ల నుంచి రూ.1.3 లక్షల కోట్ల దాకా చెల్లించాల్సి వస్తుందన్న అంచనాలున్నాయి. రెవిన్యూ రాబడిలో పట్టుమని 10శాతాన్ని కూడా భవిష్యత్‌ ఆస్తుల నిర్మాణానికి, రాబడి మార్గాలకు వెచ్చించకుండా జగన్‌ సర్కారు చేసిన దగా దా‘రుణ’భూతంగా మారి రాష్ట్రాన్ని వెంటాడనుంది. ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలపై రూ.1.08 లక్షల కోట్ల పన్నుల భారం మోపిన జగన్‌ అది సరిపోదన్నట్లు- భవిష్యత్తులో రాగల మద్యం ఆదాయాన్ని, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ రాబడిని, మచిలీపట్నం పోర్టు భూముల్నీ తాకట్టు పెట్టేశారు. ఇలా రాష్ట్రం వర్తమానాన్ని కుళ్లబొడిచి, భవిష్యత్తును కుదువపెట్టి వైకాపా భూతాలకు నైవేద్యం పెట్టే హక్కు జగన్‌కు ఎవరిచ్చారు? మొన్న మార్చి నెల చివర్లో సామాజిక పింఛన్లకు నిధులు కేటాయించకుండా, కార్పొరేషన్‌ ద్వారా తెచ్చిన రూ.4,000 కోట్ల అప్పును వైకాపా గుత్తేదారుల బిల్లులకు మళ్ళించడంలోనే- జగన్‌ పాలన జనం కోసం కాదని తేలిపోయింది. అలాంటి ఫాసిస్టుకు మళ్ళీ అవకాశం ఇస్తే రాష్ట్రం నిలువునా మునిగిపోతుంది!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.