నవకల్పనల్లో మనమెక్కడ?

విజ్ఞాన సంద్ర మథనంలోంచి ఉద్భవించే నూతన ఆవిష్కరణలు సమాజాభివృద్ధికి ఆలంబనలు అవుతాయి. అటువంటి నవకల్పనలకు నెలవు కావడంలో ఇండియా పురోగతి నమోదు చేస్తున్నా, సాధించాల్సింది ఇంకా ఎంతో ఉందన్న  విశ్లేషణలు వెలువడుతున్నాయి. ప్రపంచ నవీకరణల సూచీలో నిరుడు 132 దేశాలకుగాను 40వ స్థానంలో నిలిచిన భారతావని- పరిశోధనా వసతుల అందుబాటులో మాత్రం 84వ ర్యాంకుకు పరిమితమైంది.

Published : 29 Apr 2024 00:23 IST

విజ్ఞాన సంద్ర మథనంలోంచి ఉద్భవించే నూతన ఆవిష్కరణలు సమాజాభివృద్ధికి ఆలంబనలు అవుతాయి. అటువంటి నవకల్పనలకు నెలవు కావడంలో ఇండియా పురోగతి నమోదు చేస్తున్నా, సాధించాల్సింది ఇంకా ఎంతో ఉందన్న  విశ్లేషణలు వెలువడుతున్నాయి. ప్రపంచ నవీకరణల సూచీలో నిరుడు 132 దేశాలకుగాను 40వ స్థానంలో నిలిచిన భారతావని- పరిశోధనా వసతుల అందుబాటులో మాత్రం 84వ ర్యాంకుకు పరిమితమైంది. పరిశోధనలూ అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) రంగానికి ఇండియాలో అరకొర నిధులే దఖలుపడుతున్నాయన్న చేదువాస్తవాన్నీ  ఆ సూచీ ప్రస్తావించింది. భారతీయ సాఫ్ట్‌వేర్‌, సేవా సంస్థల సంఘం ‘నాస్కామ్‌’ తాజా నివేదిక సైతం ఆర్‌అండ్‌డీలో దేశ ప్రగతికి ప్రతిబంధకాలవుతున్న పలు అంశాలను గుదిగుచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా 83 వేల పేటెంట్లకోసం దరఖాస్తులు దాఖలైనట్లు ‘నాస్కామ్‌’ వెల్లడించింది. అంతకు ముందుతో పోలిస్తే- దరఖాస్తుదారుల్లో స్థానికుల వాటా పెరగడం హర్షణీయం. మేధాహక్కుల పోటీలో డీప్‌ టెక్‌ స్టార్టప్‌లూ విద్యాసంస్థలు ముందంజలో ఉండటం మరో విశేషం. ప్రభుత్వ గణాంకాల ప్రకారం- దేశీయంగా గత ఆర్థిక సంవత్సరం లక్షకు పైగా పేటెంట్లు మంజూరయ్యాయి. వాటిలో 40శాతం దరఖాస్తులను ముప్ఫై నెలల్లోనే పరిష్కరించినట్లు సర్కారీ యంత్రాంగం ఘనంగా సెలవిస్తోంది. అంటే- అరవై శాతం అర్జీల పరిశీలన, పరిష్కరణకు రెండున్నరేళ్లకన్నా ఎక్కువ సమయం పడుతోందన్నట్లే కదా! పేటెంట్ల మంజూరులో అలవిమాలిన జాప్యం- నవ్యావిష్కరణలకు నీరుపోసే ప్రతిభావంతుల శ్రద్ధాసక్తులను హరిస్తుంది!

ప్రపంచవ్యాప్తంగా దాఖలవుతున్న పేటెంట్‌ దరఖాస్తుల్లో ఇండియా వాటా రెండున్నర శాతానికి మించడం లేదని అధ్యయనాలు చాటుతున్నాయి. నవీన పరికల్పనల్లో భారతావని వెనకబాటుతనానికి అవి అద్దంపడుతున్నాయి. వివిధ పరిశీలన ప్రకారం- ప్రతి పది లక్షల భారతీయుల్లో 262 మందే పరిశోధనల్లో నిమగ్నమవుతున్నారు. ఇండియాతో పోలిస్తే- దక్షిణ కొరియాలో శాస్త్ర పరిశోధకుల సంఖ్య 34 రెట్లు అధికం. అమెరికా, యూకేలలో దాదాపు 17 రెట్లు ఎక్కువ. ఇజ్రాయెల్‌ తన జీడీపీలో ఆరు శాతం నిధులను ఆర్‌అండ్‌డీకి వెచ్చిస్తోంది. దక్షిణ కొరియా, అమెరికా, జర్మనీ, ఆస్ట్రియా, జపాన్‌ తదితర దేశాలు మూడు శాతానికి మించి కేటాయిస్తున్నాయి. చైనా సైతం జీడీపీలో రెండున్నర శాతం సొమ్మును పరిశోధనలకు ప్రత్యేకిస్తోంది. దేశీయంగా మాత్రం ఆ వ్యయం 0.7శాతం దగ్గరే తచ్చట్లాడుతోంది. దాన్ని కనీసం రెండు శాతానికి పెంచాలన్న శాస్త్రవేత్తల మొత్తుకోళ్లు అరణ్యరోదనలే అవుతున్నాయి. దేశంలోని దాదాపు 40 వేల ఉన్నత విద్యాసంస్థలు, పన్నెండు వందల విశ్వవిద్యాలయాల్లో కేవలం ఒక్కశాతమే క్రియాశీల పరిశోధనలకు   వేదికలవుతున్నాయి. ఈ దుస్థితిని పరిమార్చి, విద్యాలయాల్లో వైజ్ఞానిక పరిశోధనలకు ఊతమిచ్చేందుకు జాతీయ పరిశోధన సంస్థ(ఎన్‌ఆర్‌ఎఫ్‌) ఏర్పాటుకు పార్లమెంటు నిరుడు సమ్మతించింది. ఎన్‌ఆర్‌ఎఫ్‌ స్థాపనా లక్ష్యం నెరవేరాలంటే- దానికి నిధుల మంజూరులో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాలి. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ మేధా హక్కుల కల్పన చురుకందుకోవాలి. సమాజ గతిని మార్చే పరిశోధనలకు దేశీయంగా తగిన సదుపాయాలు కొరవడటం- ఔత్సాహిక ఆవిష్కర్తలకు శరాఘాతంగా పరిణమిస్తోంది. ఈ సమస్యను అధిగమించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమష్టి కృషే- జ్ఞానాధారిత ఆర్థికవ్యవస్థగా భారతావని ఎదుగుదలను వేగవంతం చేస్తుంది!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.