Updated : 08 Sep 2020 17:25 IST

పెళ్లయిన కొత్తలో ఇవి మాట్లాడుకున్నారా?

‘పెళ్లి’.. జీవితంలో ఓ మరపురాని అనుభూతి. మూడు ముళ్లు, ఏడడుగుల బంధంతో ఒక్కటైన వారు భవిష్యత్‌ గురించి ఎన్నెన్నో కలలుకంటారు. అర్థం చేసుకునే వ్యక్తి జీవిత భాగస్వామిగా వస్తే వాళ్ల జీవిత ప్రయాణమంతా పూలపాన్పే. మనస్పర్థలొస్తే అదే ముళ్లదారిగా మారుతుంది. చిన్న గొడవలే చినికి చినికి గాలివానలా తయారై చక్కటి బంధంలో నిప్పులు పోస్తాయి. అలా జరగకూడదనుకుంటే జీవిత భాగస్వామిని ముందే మనం అర్థం చేసుకోవాలి. వాళ్ల అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలకు విలువివ్వాలి. వివాహ బంధం మూడు పువ్వులు..ఆరుకాయలుగా విరాజిల్లాలంటే  వివాహమైన కొత్తలో కొన్ని విషయాలను జీవిత భాగస్వామితో చర్చించాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దామా?

1. సంప్రదాయాలు తెలుసుకోండి

ఒకే మతానికి, కులానికి చెందిన వారు పెళ్లి చేసుకుంటే ఏ సమస్యా ఉండదు కానీ, కులాంతర, మతాంతర వివాహాల్లో సంప్రదాయాల విషయంలో విభేదాలు తలెత్తే అవకాశముంది. అందువల్ల పెళ్లికి ముందే ఒకరి అభిప్రాయాలను, సంప్రదాయాలను ఎదుటివారు తెలుసుకోవాలి. ఈ విషయాలను భాగస్వామితో పంచుకునేందుకు ఏమాత్రం వెనకడుగు వేయకూడదు.

2. ఖర్చులు-పొదుపులు
 అప్పటి వరకు ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం. ఖర్చులు, పొదుపు ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయి. వివాహం తర్వాత ఇద్దరూ కలిసుండాల్సి వచ్చినప్పుడు ఎదుటి వారు ఎంతమేర ఖర్చు చేస్తున్నారు. మరెంత పొదుపు చేస్తున్నారన్న దానిపై కనీస అవగాహన ఉండాలి. ఎందుకంటే అతిగా ఖర్చు పెడితే భవిష్యత్‌లో ఆర్థిక సమస్యలతో సతమతమయ్యే అవకాశముంది. పూర్తిగా ఖర్చుపెట్టకపోయినా పెళ్లయిన కొత్తలో కొన్ని సరదాలను వదులుకోవాల్సి వస్తుంది.

3. పిల్లలపై ఓ క్లారిటీ
దాంపత్య జీవితంలో పిల్లలు చాలా ముఖ్యం. దీనిపై భార్యాభర్తలిద్దరూ కలిసి ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎంతమందిని కనాలన్నదానిపై పెళ్లికి ముందే ఇద్దరూ ఓ అవగాహనకు వస్తే మంచిది.

4. పాత పరిచయాలు
పెళ్లికి ముందున్న పాత పరిచయాల గురించి జీవిత భాగస్వామితో చర్చించడానికి దాదాపు అందరూ వెనకడుగేస్తారు. కానీ, మూడో వ్యక్తి ద్వారా తెలుసుకోకముందే వారితో ఇవి చర్చిస్తే మంచిదని నిపుణుల అభిప్రాయం. అయితే కొన్నిసార్లు ఇలా మాట్లాడటమూ కష్టాలను తెచ్చిపెట్టొచ్చు. అందువల్ల మీ జీవిత భాగస్వామిని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే ఈ విషయాలు మాట్లాడండి.

5. ఇష్టాయిష్టాలు
మీ భయాలను, ఇష్టాయిష్టాలను, సందేహాలను జీవితభాగస్వామితో స్వేచ్ఛగా మాట్లాడండి. దీనివల్ల మీ గురించి వాళ్లకు ఒక అవగాహన ఏర్పడుతుంది. తద్వారా మీకు అనుకూలంగా నడుచుకునే అవకాశముంటుంది.

6. భవిష్యత్‌ ప్రణాళిక ఏంటి?
కొత్తగా వివాహం చేసుకున్న వారికి భవిష్యత్‌ ప్రణాళిక చాలా ముఖ్యం. కొత్తజీవితాన్ని ఎలా ప్రారంభించాలి?ఇరు కుటుంబాలను ఎలా సమన్వయం చేసుకోవాలి?భవిష్యత్‌లో ఇంకేం సాధించాలన్న దానిపై స్పష్టమైన అవగాహన ఉండాలి. అయితే అన్నిసార్లు ఇది సాధ్యం కాకపోవచ్చు. ఏ మార్గంలో వెళ్లాలన్న దానిపై మాత్రం స్పష్టత ఉండాలి. దీనిపై జీవితభాగస్వామితో ముందే చర్చించాలి.

7.నాకిది..నీకది అసలే వద్దు
ఉమ్మడి కుటుంబాల నుంచి వచ్చిన వారైతే కొంత వరకు ఫర్వాలేదు కానీ, మీ జీవిత భాగస్వామి చిన్న కుటుంబాల నుంచి వస్తే.. వారికి కొంత ఒంటరితనం అలవాటై ఉండొచ్చు. ఏవైనా పనులు చేయాల్సి వచ్చినప్పుడు నువ్వది చెయ్‌.. నేనిది చేస్తానంటూ వంతులేసే అవకాశముంది. అందువల్ల ఎదుటివారితో మాట్లాడి వారి స్వభావాన్ని అంచనా వేయాలి. తదనుగుణంగా మసలుకుంటే జీవితం సాఫీగా సాగిపోతుంది. 

8. గొడవలు సహజం
భార్యాభర్తలన్నాక చిన్న చిన్న గొడవలు సహజం. అంతమాత్ర గోరంతలు కొండంత చేసి చూడటం మంచి పద్ధతి కాదు. దీనివల్ల కాపురంలో కలహాలు మొదలవుతాయి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానిని ఎలా పరిష్కరించుకోవాలన్న దానిపై ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలి. దీనివల్ల భవిష్యత్‌లో సమస్యలు వచ్చినా, ఎలా సమన్వయం చేయాలన్న దానిపై ఎదుటివారికి ఒక అవగాహన వస్తుంది.

 

-ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం‌

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని