Amaravati: సీఎం నిర్ణయం.. భస్మాసుర హస్తం: అమరావతి రైతులు

అమరావతి ఉద్యమం 1300ల రోజుకు చేరుకున్న నేపథ్యంలో  ‘నాలుగేళ్లుగా నరకంలో నవనగరం’పేరిట రాజధాని రైతులు ఆందోళన నిర్వహిస్తున్నారు.

Updated : 09 Jul 2023 13:35 IST

అమరావతి: ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు పునరుద్ఘాటించారు. రాష్ట్రం కోసం భూములు త్యాగం చేసిన తమకు సుప్రీం కోర్టులో న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్‌5 జోన్‌ పేరిట ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని విమర్శించారు. అమరావతి ఉద్యమం 1300 రోజుకు చేరిన నేపథ్యంలో ‘నాలుగేళ్లుగా నరకంలో నవనగరం’ పేరిట కార్యక్రమాలు నిర్వహించారు. మందడంలో నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు, మహిళలు హాజరయ్యారు. అమరావతి రైతులకు మద్దతుగా తెలంగాణ నుంచి కూడా రైతులు వచ్చారు. 3,139 మంది అసైన్డ్ రైతులను సీఎం జగన్‌ ప్రభుత్వం రోడ్డుపాలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

వైకాపా ప్రభుత్వ కుట్రలను ప్రజలంతా అర్థం చేసుకుంటున్నారని అమరావతి రైతులు అన్నారు. అరెస్టులు, కుట్రలతో రాజధానిని ఆపలేరని చెప్పారు. మూడు రాజధానుల పేరిట సీఎం జగన్‌ తీసుకున్న తప్పుడు నిర్ణయమే భస్మాసుర హస్తంగా మారుతుందని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దించుతామని శపథం చేశారు. ‘సేవ్‌ అమరావతి-బిల్డ్‌ అమరావతి’ నినాదంతో ముందుకు సాగుతామని, ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని అన్నారు. అమరావతి రైతుల ఆందోళనలకు మాజీ మంత్రులు నక్కా ఆనంద్‌బాబు, వడ్డే శోభనాద్రీశ్వరరావు, రైతు సంఘాల సభ్యులు మద్దతు తెలిపారు. మందడంలో నిర్వహించిన ఆందోళనలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.

ఎస్సీల మీదనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారని వాపోయారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించేంత వరకు ఉద్యమం ఆగదని ఈ సందర్భంగా అమరావతి రైతులు స్పష్టం చేశారు. ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని, ఏపీ అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ రాజధాని మహిళలు శనివారం ఆలయాల సందర్శన యాత్రను చేపట్టారు. అమరావతి ఉద్యమం మొదలై ఇవాళ్టికి నాటికి 1,300 రోజులకు చేరుకున్న సందర్భంగా రైతు ఐకాస ప్రత్యేక కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా శనివారం రాజధాని గ్రామాలకు చెందిన మహిళలు, రైతులు.. పలు ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు