Amaravati: ఆ వాలంటీర్లను విధుల నుంచి తొలగించాం: సీఈవో

రాష్ట్రంలో 144 సెక్షన్‌ అమలవుతోందని, ఎలాంటి కార్యక్రమం అయినా అనుమతులు తీసుకోవాల్సిందేనని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) ముఖేశ్‌కుమార్‌ మీనా స్పష్టం చేశారు.

Updated : 20 Mar 2024 16:46 IST

విజయవాడ: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటివారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) ముఖేశ్‌కుమార్‌ మీనా అన్నారు. ఇప్పటి వరకు 46 మంది వాలంటీర్లు, ఒప్పంద ఉద్యోగులను విధుల నుంచి తొలగించామన్నారు. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొంటే తీవ్ర చర్యలు ఉంటాయని మరోమారు స్పష్టం చేశారు. ప్రధాని కార్యక్రమంలో భద్రతా లోపాలపై ఫిర్యాదు అందిందని, కేంద్రానికి పంపినట్టు చెప్పారు. భద్రతా లోపాల అంశం హోంశాఖ పరిధిలో ఉందన్నారు. రాష్ట్రంలో 144 సెక్షన్‌ అమలవుతోందని, ఎలాంటి కార్యక్రమం అయినా అనుమతులు తీసుకోవాల్సిందేనని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు సువిధ యాప్‌ ద్వారా అనుమతులు తీసుకోవాలని తెలిపారు.

ఉద్యోగులు ప్రజాప్రతినిధులతో కలిసి తిరగకూడదు..

‘‘ఇప్పటి వరకు 392 దరఖాస్తులు పరిష్కరించాం. వాలంటీర్లు, ఒప్పంద ఉద్యోగులపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. ప్రభుత్వ భవనాలపై నేతల ఫొటోలు, ప్రకటనలు తొలగించాలని ఆదేశించాం. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధులతో కలిసి తిరగకూడదు. ఎప్పటికప్పుడు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తుంది. సీ విజిల్‌ యాప్‌లో నమోదైన ఫిర్యాదులపై 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటున్నాం. సీ విజిల్‌ ద్వారా ఎవరైనా ఫొటో, వీడియో తీసి పంపవచ్చు. ఇప్పటి వరకు 1.99 లక్షల పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగ్‌లు తొలగించాం. 385 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశాం. 3 రోజుల్లో రూ.3.39 కోట్ల విలువైన నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నాం. ప్రస్తుతం తనిఖీల్లో 173 బృందాలు పాల్గొంటున్నాయి.

ఈసీ అనుమతిస్తేనే డీఎస్సీ పరీక్ష...

పవన్‌ కల్యాణ్‌ గాజు గ్లాసు చూపించిన అంశంపై నిషేధం లేదు. ఎవరైనా రాజకీయ ప్రకటనలు చేసుకోవచ్చు. పూర్తిగా పరిశీలించి అంశం ఆధారంగా నిర్ణయం ఉంటుంది. రాజకీయ హింస జరగకుండా చూడాలన్నదే మా లక్ష్యం. హింస రహిత, రీపోలింగ్‌ లేని ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తున్నాం. గిద్దలూరు, ఆళ్లగడ్డలో రాజకీయ హత్యలు జరిగాయి. ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఎస్పీలతో మాట్లాడుతాం. ఎస్పీల వివరణతో పాటు నివేదిక చూశాక చర్యలు తీసుకుంటాం. డీఎస్సీ వాయిదా వేయాలని వెయ్యికి పైగా ఫిర్యాదులు వచ్చాయి. డీఎస్సీ నియామకంపై ఎన్నికల కమిషన్‌కు పంపిస్తున్నాం. ఈసీ నుంచి అనుమతి వస్తేనే డీఎస్సీ పరీక్ష జరుగుతుంది’’ అని సీఈవో స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని