షరతులు అంగీకరిస్తేనే ప్రాజెక్టుల అప్పగింత.. అసెంబ్లీ తీర్మానం

రాష్ట్ర ప్రభుత్వం విధించిన షరతులకు అంగీకరించకపోతే ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB)కి అప్పగించేది లేదని తెలంగాణ శాసనసభ తీర్మానించింది. 

Updated : 12 Feb 2024 20:27 IST

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం విధించిన షరతులకు అంగీకరించకపోతే ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB)కి అప్పగించేది లేదని తెలంగాణ శాసనసభ తీర్మానించింది. నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం అప్పటి ప్రభుత్వం కృష్ణా బేసిన్ అవసరాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని, 299 టీఎంసీలకు అంగీకరించడం తీవ్ర తప్పిదమని తీర్మానంలో ప్రభుత్వం పేర్కొంది. కేఆర్ఎంబీ పరిధిని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసినప్పటికీ అప్పటి ప్రభుత్వం కనీసం అభ్యంతరం చెప్పలేదని ఆక్షేపించింది. 

తెలంగాణకు చారిత్రక అన్యాయం, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో షరతులకు అంగీకరించకపోతే ఉమ్మడి ప్రాజెక్టులను అప్పగించబోమని స్పష్టం చేసింది. తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పంపిణీ.. పరీవాహక ప్రాంతం, కరవు ప్రాంతం, బేసిన్‌లోని జనాభా, సాగు ప్రాంతాలను పరిగణలోకి తీసుకొని జరగాలని తెలిపింది. కృష్ణా జలాల వివాదాల మొదటి ట్రైబ్యునల్‌ ప్రకారం బేసిన్‌లోని అవసరాలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. 1962లో శ్రీశైలం ప్రాజెక్టును జలవిద్యుత్ కేంద్రంగా మంజూరు చేసిన ప్రణాళికా సంఘం.. నాగార్జునసాగర్‌కు 264 టీఎంసీలు విడుదల చేయాలని చెప్పినట్లు గుర్తు చేసింది.

దీంతోపాటు శ్రీశైలంలో కనీస నీటి వినియోగ మట్టం 830 అడుగులుగా ఉండాలని తెలిపింది. శ్రీశైలం జలాశయం నుంచి బేసిన్ వెలుపలకు కేవలం 34 టీఎంసీలు మాత్రమే తరలించాలని, తాగునీటి అవసరాలను కేవలం 20 శాతంగానే పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది. బచావత్‌ ట్రైబ్యునల్ ప్రకారం రాష్ట్రాలకు క్యారీ ఓవర్ అవకాశం ఉండాలని.. కృష్ణా జలాలు తరలించేలా బేసిన్ వెలుపల అనుమతుల్లేని ప్రాజెక్టులు, విస్తరణ, పనులు చేపట్టకుండా చూడాలని తీర్మానంలో ప్రభుత్వం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని