Drugs: దేశంలో డ్రగ్స్‌ ప్రధాన సమస్యగా మారింది: సందీప్‌ శాండిల్య

దేశంలో డ్రగ్స్‌ ప్రధాన సమస్యగా మారిందని టీఎస్‌ న్యాబ్‌ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య అన్నారు. హైదరాబాద్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో మాదకద్రవ్యాల నివారణపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.

Updated : 03 Mar 2024 14:47 IST

హైదరాబాద్: దేశంలో డ్రగ్స్‌ ప్రధాన సమస్యగా మారిందని టీఎస్‌ న్యాబ్‌ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య అన్నారు. హైదరాబాద్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో మాదకద్రవ్యాల నివారణపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఒంటరితనం అనుభవించేవారు వీటి బారిన పడుతున్నారని తెలిపారు. పిల్లలను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని సూచించారు.

మాదకద్రవ్యాలు స్కూళ్ల వరకు చేరడం ఆందోళనకరం: హైదరాబాద్‌ సీపీ

స్కూళ్ల వరకు డ్రగ్స్‌ చేరుతున్నట్లు చాలా వార్తలు చూశానని హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఇది ఆందోళనకరమైన విషయమని చెప్పారు. ‘‘కొన్ని పాన్‌ షాపుల్లోనూ డ్రగ్స్‌ దొరుకుతున్నాయి. దేశం మొత్తం మీద ఇవి ప్రభావం చూపిస్తాయి. వీటి వల్ల వచ్చే డబ్బును ఉగ్రవాద కార్యకలాపాలకు వాడుతున్నారు. స్కూళ్లలో డ్రగ్స్‌ నిర్మూలన కమిటీలు ఏర్పాటు చేయాలి’’ అని ఆయన సూచించారు.

యువత డ్రగ్స్‌ బారిన పడుతున్నారని రాచకొండ సీపీ తరుణ్‌ జోషి ఆందోళన వ్యక్తం చేశారు. వీటి నివారణకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యమని తెలిపారు. మాదక ద్రవ్యాలు మానవ మనుగడకే ప్రమాదకరమని సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతి హెచ్చరించారు. డ్రగ్స్‌ వాడకాన్ని నిరోధించాలంటే దాని వల్ల కలిగే నష్టం ఎంతలా ఉంటుందో ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని కోరారు. ఈ విషయంలో అందరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. 

స్కూళ్లలో డ్రగ్స్‌ నిర్మూలన కమిటీలు: బుర్రా వెంకటేశం

విద్యార్థులు డ్రగ్స్‌ బారిన పడకుండా ఉండాలంటే చిన్నతనం నుంచే అవగాహన ముఖ్యమని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. తెలంగాణను మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చాలన్నారు.  ‘‘బాల్యంలోనే పిల్లల భవిష్యత్తు సక్రమంగా ఉంచాలి. సమాజంలో ప్రతి ఒక్కరికీ విద్య, ఆరోగ్యం చాలా ముఖ్యం. అన్ని స్కూళ్లలో డ్రగ్స్‌ నిర్మూలన కమిటీలు ఏర్పాటు చేయాలి. పేరును త్వరలోనే నిర్ణయిస్తాం. పాటించాల్సిన అంశాలను నిర్లక్ష్యం చేస్తే ఆయా స్కూళ్లపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాం’’ అని ఆయన హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు