భారాస ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌పై కేసు

భారాస నేత, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌పై పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

Updated : 25 Mar 2024 06:41 IST

హైదరాబాద్‌: భారాస నేత, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌పై కేసు నమోదైంది. బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 14లో భూమి కబ్జాకు యత్నిస్తున్నారంటూ నవయుగ కంపెనీ ప్రతినిధి చింతా మాధవ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంతోష్‌తో పాటు పాటు లింగారెడ్డి శ్రీధర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. సర్వే నంబర్‌ 129/54లో 1350 చదరపు గజాల స్థలాన్ని నవయుగ సంస్థ కొనుగోలు చేసింది. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆ స్థలం కబ్జాకు ప్రయత్నాలు చేస్తున్నారని ఈనెల 21న కంపెనీ ప్రతినిధి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో 400, 471, 447, 120బి రెడ్‌విత్ 34ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

రాజకీయ దురుద్దేశంతోనే కేసు నమోదు..

బంజారాహిల్స్‌లో తనపై నమోదైన కేసుపై భారాస ఎంపీ సంతోష్‌ కుమార్‌ స్పందించారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసు నమోదు చేసినట్టు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ‘‘షేక్‌పేటలోని సర్వే నెంబరు 129/54లో ఉన్న 904 చదరపు గజాల ఇంటి స్థలాన్ని శ్యామ్‌సుందర్‌ ఫుల్జాల్‌ నుంచి 2016లో రూ.3.18 కోట్లకు కొనుగోలు చేశా. సేల్ డీడ్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌శాఖ ఆధ్వర్యంలోనే కొనుగోలు ప్రక్రియ జరిగింది. ఫోర్జరీ అనే మాటకు తావులేదు.. అదంతా అవాస్తవం. ఎనిమిదేళ్లుగా ఎలాంటి న్యాయవివాదం తలెత్తలేదు. ఒక వేళ న్యాయపరమైన అంశాలు ఉంటే ముందుగా నాకు లీగల్‌ నోటీసు ఇచ్చి వివరణ కోరాలి. ఫోర్జరీ చేశామని పోలీస్‌ స్టేషన్‌లో ఎలా ఫిర్యాదు చేశారు. న్యాయపరంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా’’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని