Karimnagar: కరీంనగర్‌లో ఎలుగుబంటి హల్‌చల్‌.. శివారు వాసుల్లో హడల్‌

కరీంనగర్‌లో ఎలుగు బంట్లు హల్‌చల్‌ సృష్టిస్తున్నాయి! శివారు ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

Updated : 12 Aug 2023 12:34 IST

కరీంనగర్‌ నేరవార్తలు: కరీంనగర్‌లో ఎలుగు బంటి హల్‌చల్‌ సృష్టించింది. శివారు ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురిచేసింది. అర్ధరాత్రి ఓ ఎలుగుబంటి నడిరోడ్డుపై ప్రత్యక్ష కావడంతో శ్రీపురం, రజ్వీ చమన్ వాసులు అప్రమత్తమయ్యారు. ఎవరిపై దాడి చేస్తుందోనన్న భయంతో వేకువజాము వరకు నిద్ర లేకుండా గడిపారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా ఫలితం లేకపోవడంతో స్థానిక యువత కర్రలు పట్టుకుని గస్తీ చేపట్టారు. చివరకు ఆ ప్రాంతం నుంచి ఎలుగుబంటి వెళ్లిపోవడతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

శుభం గార్డెన్ ప్రాంతంలోనూ ఓ ఎలుగు బంటి కనిపించిందని స్థానికులు చెబుతున్నారు. శనివారం ఉదయం రేకుర్తిలోని పలు కాలనీల్లోనూ ఎలుగుబంటి సంచరించినట్లు సమాచారం. శుక్రవారం ఉదయం తీగలగుట్టపల్లి కేసీఆర్ భవనం నుంచి గోపాల్‌పూర్ ప్రాంతంలో సంచరించినట్లు స్థానికులు గుర్తించారు. అయితే, ఎలుగు ఆయా ప్రాంతాల్లో తిరిగిన ఆనవాళ్లను స్థానికులు మొబైల్‌లో రికార్డు చేయగా, సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

చిక్కిన భల్లూకం..

ఎలుగుబంటి సంచారంపై సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రేకుర్తిలో జనావాసాల మధ్య సంచరిస్తున్న ఎలుగు బంటిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. దాదాపు 4 గంటలపాటు శ్రమించి మత్తు ఇంజక్షన్‌ ఇచ్చి ఎట్టకేలకు ఎలుగుబంటిని బంధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని