Purandeswari: దేవాదాయ సిబ్బందికి ఎన్నికల విధులపై పునఃపరిశీలించాలి: పురందేశ్వరి

దేవదాయశాఖ సిబ్బందికి ఎన్నికల విధులు అప్పగిస్తే .. భక్తులు ఇబ్బందులకు గురవుతారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు.

Published : 13 Apr 2024 16:47 IST

అమరావతి: దేవదాయశాఖ సిబ్బందికి ఎన్నికల విధులు అప్పగిస్తే .. భక్తులు ఇబ్బందులకు గురవుతారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. దేవాదాయశాఖ సిబ్బందికి ఎన్నికల విధులు వద్దంటూ కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఆమె లేఖ రాశారు. ‘‘2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎండోమెంట్‌ సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని కొందరు ఉన్నతాధికారులు సీఈవోకు సూచించినట్టు తెలిసింది. గతంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా దేవాదాయశాఖ సిబ్బందిని వినియోగించుకోలేదు. ఆ శాఖ సిబ్బంది సాధారణంగా తమ పరిధిలోని దేవాలయాల్లో రోజువారీగా పరిపాలన విధులు నిర్వహిస్తారు. అందువల్ల వారి సేవలు అనివార్యం. సిబ్బంది అంతా హిందూ మతానికి చెందినవారే ఉన్నారు. 

వారిని ఎన్నికల విధులకు ఉపయోగిస్తే ఒక మతానికి చెందిన వారినే వినియోగించుకుంటున్నారనే నిరాధార ఆరోపణలు వచ్చే అవకాశముంది. ఏప్రిల్‌, మే, జూన్‌లో ఉత్తరాయణ పుణ్యకాలంలో వస్తుంది. పాఠశాలలు, కళాశాలలకు సెలవుల సీజన్‌ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది తీర్థయాత్రలు, వారి స్వగ్రామాలను సందర్శిస్తుంటారు. అందువల్ల దేవాలయాలను సందర్శించే యాత్రికులు అనేక రెట్లు పెరుగుతారు. ఎన్నికల్లో దేవాదాయ శాఖ సిబ్బంది సేవలను వినియోగించుకోవాలన్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరుతున్నా’’ అని లేఖలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని