Chandrababu arrest: విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌

తెదేపా అధినేత చంద్రబాబుకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో ఆయన తరఫు న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేశారు.

Updated : 14 Sep 2023 19:34 IST

విజయవాడ: తెదేపా అధినేత చంద్రబాబుకు బెయిల్‌ ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో న్యాయవాది గింజుపల్లి సుబ్బారావు పిటిషన్‌ దాఖలు చేశారు. చంద్రబాబుపై సీఐడీ మోపిన అభియోగాలు నిరాధారమని పేర్కొంటూ సుబ్బారావు ఈ పిటిషన్ వేశారు. చంద్రబాబు పేరు ఎఫ్‌ఐఆర్‌లో లేకుండానే రిమాండ్‌ రిపోర్టులో ఏ37గా పేర్కొంటూ సీఐడీ ఈ కేసు దర్యాప్తు చేస్తోందన్నారు. దురుద్దేశపూర్వకంగానే ఈ కేసు నమోదైందని సుబ్బారావు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ అంశంపై విచారణ జరిపి చంద్రబాబుకు బెయిల్‌ మంజూరు చేయాలని అభ్యర్థిస్తూ పిటిషన్‌ వేశారు. 

ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన విజయవాడ ఏసీబీ కోర్టు దీనిపై శుక్రవారం విచారణ చేపట్టనుంది. ఈ పిటిషన్‌కు సంబంధించి ఏపీ సీఐడీకి నోటీసులు జారీ చేసింది. రెండ్రోజుల క్రితం చంద్రబాబుకు బెయిల్‌ ఇవ్వాలంటూ తెదేపా కార్యకర్త మహేష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయన పిటిషన్ సరిగా లేకపోవడంతో ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. అయితే, న్యాయవాది జి.సుబ్బారావు దాఖలు చేసిన పిటిషన్‌ను మాత్రం ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించింది.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో సీఐడీ తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌, దాని ఆధారంగా విజయవాడ అనిశా కోర్టు రిమాండు విధిస్తూ జారీచేసిన ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అలాగే, చంద్రబాబును పోలీసు కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటరు వేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులను, ఈ నెల 18 వరకు ఒత్తిడి చేయొద్దని విజయవాడ అనిశా కోర్టును ఆదేశించింది. విచారణను ఈనెల 19కి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో చంద్రబాబు తరఫు న్యాయవాది సుబ్బారావు విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరఫున బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని