UNICEF: చిన్నారులపై చేయి చేసుకుంటే మారుతారా?

చుట్టూ ఉన్న పరిసరాల ప్రభావం చిన్నారులపై ఎక్కువగా ఉంటుంది. వాటి నుంచి చాలా తొందరగా నేర్చుకోగలుగుతారు. ఈ క్రమంలో తల్లిదండ్రులకు నచ్చని కొన్ని పనులు చేస్తుంటారు.

Updated : 14 Nov 2021 19:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చుట్టూ ఉన్న పరిసరాల ప్రభావం చిన్నారులపై ఎక్కువగా ఉంటుంది. వాటి నుంచి చాలా తొందరగా నేర్చుకోగలుగుతారు. ఈ క్రమంలో తల్లిదండ్రులకు నచ్చని కొన్ని పనులు చేస్తుంటారు.  దీంతో కొంతమంది కోపంతో వారిపై చేయి చేసుకుంటారు. అయితే దీనివల్ల తల్లిదండ్రులపై పిల్లలకు వ్యతిరేక భావన ఏర్పడటం తప్ప .. ఎలాంటి ప్రయోజనం ఉండబోదని ఓ అధ్యయనంలో తేలింది. అంతేకాకుండా పిల్లలు మొండిగా తయారయ్యే అవకాశాలున్నాయని తేలింది. ఈ మేరకు బ్రిటిష్‌ మెడికల్‌ మ్యాగజైన్‌ ‘ ది లాన్సెట్‌’లో కథనం ప్రచురితమైంది. అమెరికా, కెనడా, జపాన్‌, రష్యా తదితర 69 దేశాల్లో దీనిపై అధ్యయనం చేశారు.

పిల్లల్ని శారీరకంగా శిక్షించడం వల్ల వాళ్ల బుద్ధి మందగిస్తుందని, స్వతంత్రత కోల్పోయామన్న భావనతో కుంగుబాటుకు లోనవుతారని అధ్యయనానికి నాయకత్వం వహించిన ఎలిజబెత్‌ గెర్‌షోఫ్‌ తెలిపారు. కొట్టడం వల్ల పిల్లలు మెరుగవుతారన్నది ఓ దురభిప్రాయం మాత్రమేనని చెప్పారు. దీనివల్ల వారు క్రూరంగా ప్రవర్తించినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. దీనికి సంబంధించి అధ్యయనంలో స్పష్టమైన ఆధారాలు లభించాయని ఆయన అన్నారు.

62 దేశాల్లో చట్ట విరుద్ధం

ప్రపంచవ్యాప్తంగా 62 దేశాల్లో పిల్లల్ని శారీరకంగా హింసించడం చట్ట విరుద్ధం. మరో 27 దేశాల్లో చిన్నారులపై భౌతికదాడులను ఆపేందుకు ఆయా ప్రభుత్వాలు చర్యలు ముమ్మరం చేశాయి. అయితే, 31 దేశాల్లో మాత్రం చిన్నారుల్ని కొట్టినా నేరంగా పరిగణించడం లేదు. యునిసెఫ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2 నుంచి 4 ఏళ్ల లోపు వయస్సు ఉన్న 25 కోట్ల మంది చిన్నారులు శారీరక హింసకు గురవుతున్నట్లు తెలుస్తోంది. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని