CM Revanthreddy: రామోజీరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి

రామోజీ గ్రూప్‌సంస్థల అధినేత రామోజీరావు కుటుంబ సభ్యులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరామర్శించారు.

Updated : 11 Jun 2024 22:37 IST

హైదరాబాద్‌: రామోజీ గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు కుటుంబ సభ్యులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరామర్శించారు. గుండె సంబంధిత సమస్యలతో  హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరిన రామోజీరావు చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆరోజు  సీఎం రేవంత్‌రెడ్డి దిల్లీ పర్యటనలో ఉండటంతో రామోజీరావు పార్థివదేహానికి నివాళులర్పించలేకపోయారు. రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఫిల్మ్‌సిటీలోని ఆయన నివాసానికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. రామోజీరావు చిత్రపటం వద్ద నివాళులర్పించారు.

రామోజీరావుతో తనకున్న అనుబంధాన్ని ‘ఈనాడు’ ఎండీ కిరణ్‌, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌, రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరితో పంచుకున్నారు. రామోజీరావు వ్యక్తి కాదు వ్యవస్థ.. ఆయనకు ప్రత్యామ్నాయం లేదన్నారు. రామోజీ చూపిన మార్గంలో వారి కుటుంబ సభ్యులు, సంస్థలు ప్రజల తరఫున నిలబడాలని ఆకాక్షించారు. ఆయన ఆలోచనా విధానాలకు అనుగుణంగా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని రేవంత్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌, మల్‌రెడ్డి రాంరెడ్డి, మధుసూదన్‌రెడ్డి తదితరులు సీఎం వెంట ఉన్నారు.

రామోజీరావుకు నివాళులర్పించిన త్రిపుర గవర్నర్‌

దివంగత రామోజీరావుకు త్రిపుర గవర్నర్‌ నల్లు ఇంద్రసేనారెడ్డి నివాళులర్పించారు. రామోజీ ఫిల్మ్‌సిటీలోని ఆయన నివాసానికి వచ్చిన ఇంద్రసేనారెడ్డి.. రామోజీరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. తెలుగు ప్రజలు అభిమానించే రామోజీరావు.. అందరికీ ఆర్శప్రాయుడని  తెలిపారు. ఆయన మరణం తెలుగు ప్రజలకు తీరని లోటని అన్నారు.  రామోజీరావుతో తనకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని