Cyclone Michaung: తుపాను.. గంటకు 14కి.మీ వేగంతో ముందుకు..

మిగ్‌జాం తుపాను గంటకు 14కి.మీ వేగంతో ముందుకు కదులుతున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

Updated : 04 Dec 2023 11:00 IST

అమరావతి: మిగ్‌జాం తుపాను (Cyclone Michaung) గంటకు 14కి.మీ వేగంతో ముందుకు కదులుతున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ తుపాను బంగాళాఖాతంలో వాయవ్య దిశగా కదులుతున్నట్లు వెల్లడించింది. చెన్నైకి 130కి.మీ, నెల్లూరుకు 220కి.మీ. బాపట్లకు 330కి.మీ, మచిలీపట్నానికి 350కి.మీ దూరంలో కేంద్రీకృతమైనట్లు తెలిపింది. నేడు కోస్తా తీరానికి సమాంతరంగా పయనించనున్న తుపాను.. మంగళవారం మధ్యాహ్నం నాటికి తీవ్ర తుపానుగా మారి నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించింది.

కోస్తా జిల్లాలో వర్షాలు..

తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరుతో పాటు తిరుపతి జిల్లాలో వర్షం కురుస్తోంది. పలుచోట్ల ఈదురుగాలులు వీస్తున్నాయి. వర్షంతో ఆయా ప్రాంతాల్లో చలి ప్రభావం పెరిగింది. బాపట్ల సహా పలు తీరప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తుపాను తీవ్రత దృష్ట్యా జిల్లాల్లో అధికారులకు సెలవులను రద్దు చేశారు.

తుపాను ఎఫెక్ట్‌.. పలు జిల్లాలో స్కూళ్లకు సెలవు

మిగ్‌జాం తుపాను నేపథ్యంలో  పలు జిల్లాల్లో పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. విశాఖపట్నంతో పాటు కృష్ణా, ఎన్టీఆర్‌, నెల్లూరు జిల్లాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు.  విద్యార్థుల రక్షణ దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు విశాఖ జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున తెలిపారు. ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలకు కూడా తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని డీఈవోకు ఆయన సూచించారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని