West Godavari: ఆర్మీ ఉద్యోగికి కేటాయించిన స్థలంపై వివాదం.. ఉద్రిక్తత

సైనిక ఉద్యోగికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన స్థలంలో అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేసేందుకు ఒక వర్గం ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది.

Published : 29 May 2024 14:03 IST

పెంటపాడు: సైనిక ఉద్యోగికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన స్థలంలో అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేసేందుకు ఒక వర్గం ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆర్మీ ఉద్యోగి భార్య ఆత్మహత్యకు యత్నించడంతో వివాదం మరింత ముదిరింది. పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం రావిపాడులో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

గ్రామానికి చెందిన పలివెల నాగేశ్వరరావు ఆర్మీలో మేజర్‌ సుబేదార్‌గా పనిచేస్తున్నారు. మరో రెండు నెలల్లో ఆయన ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇల్లు నిర్మించుకునేందుకు స్థలం ఇవ్వాలని ప్రభుత్వానికి ఆయన దరఖాస్తు చేసుకున్నారు. రెండు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం నాగేశ్వరరావుకు 3 సెంట్ల స్థలం కేటాయించి పొజిషన్‌ సర్టిఫికెట్‌ ఇచ్చారు. దీంతో అక్కడ ఆయన ఇంటి నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం శ్లాబ్‌ కూడా పూర్తయింది. స్థానిక వైకాపా నేతకు అదే స్థలంపై కన్నుంది. అక్కడ అంబేడ్కర్‌ విగ్రహం పెడితే స్థలం మీకే వస్తుందంటూ స్థానికంగా ఉన్న ఒక వర్గం వారిని రెచ్చగొట్టారు. దీంతో మంగళవారం వారంతా విగ్రహంతో వచ్చి నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో పెట్టేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకోవడంతో తాత్కాలికంగా వివాదం సద్దుమణిగింది.

వైకాపా నేతే ఇదంతా చేయిస్తున్నారని ఆరోపణలు

ఈ పరిణామాల నేపథ్యంలో బుధవారం ఉదయం రెవెన్యూ అధికారులు గ్రామానికి చేరుకున్నారు. ప్రభుత్వం కేటాయించిన స్థలం సర్వే నంబర్‌ సరికాదని.. 24 గంటల్లో నిర్మాణాన్ని కూల్చివేయాలని నాగేశ్వరరావు కుటుంబానికి నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులను వారు తీసుకోకపోవడంతో నిర్మాణం జరుగుతున్న చోట గోడకు అతికించారు. స్థలం ఇచ్చి.. ఇప్పుడు కూల్చేయాలంటూ అధికారులు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారంటూ ఆయన కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో నాగేశ్వరరావు భార్య విజయలక్ష్మి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. అక్కడే ఉన్న డీఎస్పీ, పోలీసు సిబ్బంది అడ్డుకోవడంతో ముప్పు తప్పింది. 30 ఏళ్ల పాటు దేశరక్షణలో సేవలందించిన సైనిక ఉద్యోగికి ప్రభుత్వం ఇచ్చే సత్కారం ఇదా? అని నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు జారీ చేసిన నోటీసులు తొలగించాలని.. లేకుంటే ప్రాణాలు తీసుకుంటామని ఆర్మీ అధికారి కుటుంబం హెచ్చరించింది. స్థానిక వైకాపా నేత బురగల రామసత్యనారాయణ ఒక వర్గాన్ని అడ్డుపెట్టుకుని ఇదంతా చేయిస్తున్నారని వారు ఆరోపించారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఇరువర్గాలతో అధికారులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని