Updated : 04 Feb 2021 10:06 IST

మేక @ జూమ్‌ మీటింగ్స్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అనేక కార్పొరేట్‌ సంస్థలు తమ ఉద్యోగులను వర్క్‌ ఫ్రమ్‌ హోం చేయమంటున్నాయి. ఈ క్రమంలో వీడియో కాన్ఫరెన్స్‌లు పెరిగిపోయాయి. ముఖ్యంగా జూమ్‌ యాప్‌ ద్వారా వీడియో కాల్‌ సమావేశం నిత్యకృత్యం అయిపోయింది. సాధారణంగా ఈ జూమ్‌ వీడియో సమావేశాల్లో ఉద్యోగులు, అధికారులు, క్లయింట్స్‌ పాల్గొంటుంటారు. కానీ, ఆకస్మాత్తుగా ఈ సమావేశంలో ఒక మేక వచ్చి చేరితే?ఇలాంటి ఆలోచన ఎవరికీ రాదు.. కానీ, ఓ మహిళా రైతుకు వచ్చింది. వెంటనే ఆమె పెంచుతున్న మేకలను జూమ్‌ కాల్స్‌లో పాల్గొనేలా చేసి ఆదాయం పొందుతోంది. ఆశ్చర్యంగా ఉంది.. కదా! అయితే, ఈ పూర్తి వార్త చదివేయండి..

యూకేలోని రాసెండేల్‌కు చెందిన డాట్‌ మెక్‌కార్టీకి వ్యవసాయక్షేత్రం ఉంది. అందులోనే మేకలను పెంచుతోంది. పంట సాగు చేయడంతోపాటు వ్యవసాయం, మేకల పెంపకంపై అవగాహన కోసం విద్యార్థులను సందర్శనకు అనుమతిస్తూ బాగా సంపాదించేది. కరోనా సంక్షోభంలో విద్యాసంస్థలు మూతపడటంతో ఆదాయం కాస్త తగ్గింది. లాక్‌డౌన్‌లో ఖాళీగా ఉన్న మెక్‌కార్టీకి ఒక ఆలోచన వచ్చింది. ‘ప్రస్తుతం ఉద్యోగులంతా జూమ్‌ వీడియో సమావేశాల్లో మాట్లాడుకుంటున్నారు.. వీరి మధ్యలోకి మేక వస్తే ఎలా ఉంటుందా?’ అని. సరదాగా వచ్చిన తన ఆలోచననే ఆమె వ్యవసాయక్షేత్రానికి సంబంధించిన వెబ్‌సైట్‌లో ఓ ప్రకటనగా ఇచ్చింది. 

‘జూమ్‌ వీడియో సమావేశాల నిర్వాహకులు.. సమావేశంలో పాల్గొనేవారిని ఆశ్చర్యపర్చడం కోసం మా మేకలను అద్దెకు తీసుకోవచ్చు. మీరు చెప్పిన సమయానికి మా మేకలు జూమ్‌ కాల్స్‌లో దర్శనమిస్తాయ’ని మెక్‌కార్టీ తన ప్రకటనలో పేర్కొంది. దీంతో ఆమె ప్రకటనకు అనూహ్యమైన రీతిలో స్పందన వస్తోంది. అనేక సంస్థలు తమ ఉద్యోగులను, ఇతరులు తమ కుటుంబసభ్యులు, స్నేహితులను ఆశ్చర్యపర్చడం కోసం మేకను అద్దెకు తీసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఒక జూమ్‌ సమావేశానికి మెక్‌కార్టీ 5 పౌండ్లు వసూలు చేస్తోంది. మేక సమావేశంలో పాల్గొనాలంటే ముందుగానే డబ్బులు చెల్లించి.. సమయం, వీడియోకాల్‌ లింక్‌ వివరాలు ఇవ్వాలి. ఆ సమయానికి మెక్‌కార్టీ వద్ద పనిచేసే ఉద్యోగులు మేకను వీడియో సమావేశంలో కనిపించేలా చేస్తారు. ఇలా ఇప్పటి వరకు మెక్‌కార్టీ 50వేల పౌండ్లు (దాదాపు రూ.50లక్షలు)సంపాదించింది. భలే ఉంది కదా.. ఆలోచన!

ఇవీ చదవండి..
బెజోస్ ప్రకటన: పిచాయ్, నాదెళ్ల ఏమన్నారంటే..

అమెజాన్‌ సీఈఓ ఆండీ జాస్సీ

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని