సంతోష్‌ కుటుంబాన్ని పరామర్శించిన ఉత్తమ్‌

దేశం కోసం ప్రాణాలర్పించిన కర్నల్‌ సంతోష్‌బాబు కుటుంబ సభ్యుల్ని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పరామర్శించారు. సూర్యాపేటలోని విద్యానగర్‌లో...

Updated : 17 Jun 2020 15:29 IST

సూర్యాపేట: దేశం కోసం ప్రాణాలర్పించిన కర్నల్‌ సంతోష్‌బాబు కుటుంబ సభ్యుల్ని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పరామర్శించారు. సూర్యాపేటలోని విద్యానగర్‌లో ఉన్న కర్నల్‌ ఇంటికి వెళ్లి సంతోష్‌ చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కర్నల్‌ తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెప్పారు. మరోవైపు పలువురు ప్రముఖులు కాసేపట్లో సూర్యాపేటకు వచ్చే అవకాశం ఉన్నందున పట్టణంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొవిడ్‌ తీవ్రత దృష్ట్యా కర్నల్‌ ఇంటి పరిసరాల్లో సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ప్రముఖులతోపాటు స్థానికులు సైతం పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోనున్నందున ఇంటి చుట్టూ బారీకేడ్లు ఏర్పాటు చేశారు.

దిల్లీలో ఉన్న సంతోష్ భార్య, పిల్లలు బుధవారం ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన సూర్యాపేటకు బయలుదేరారు. సంతోష్‌ మృతితో విద్యానరగ్‌ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంతోష్‌ పార్థీవదేహాన్ని బుధవారం శంషాబాద్‌ విమానాశ్రయానికి ఆర్మీ అధికారులు తీసుకురానున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. సూర్యాపేటలోని హిందూ శ్మశానవాటికలో  సంతోష్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 

లద్దాఖ్‌లో చైనాతో ఆరు వారాలుగా నెలకొన్న సరిహద్దు ప్రతిష్టంభన సోమవారం హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఇరు దేశాలకు చెందిన సైనికులు భౌతిక ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణలో తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన సైనికాధికారి కర్నల్‌ సంతోష్‌ కుమార్‌ వీరమరణం పొందారు. ఆయనతోపాటు మరో 19 మంది భారత సైనికులు అమరులయ్యారు. ఈ ఘర్షణలో చైనా వైపు కూడా భారీ ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని